గురువారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో హైదరాబాద్ (Hyderabad Rains) నగరం తారుమారు అయిపోయింది. కేవలం గంటలోనే 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఐటీ హబ్‌గా పేరొందిన మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ నరకంగా మారింది. ఆఫీసు ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరిన ఐటీ ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గంటల వరకు రోడ్లపైనే గడిపారు.వర్షపు ప్రభావంతో పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ద్విచక్ర వాహనాలు వరద నీటికి కొట్టుకుపోయాయి. మల్కం చెరువులో నీరు నిలిచిపోవడంతో బయో డైవర్సిటీ నుండి షేక్‌పేట దాకా వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యామ్నాయంగా ఐకియా, కేబుల్ బ్రిడ్జి మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
రంగంలోకి HYDRA అధికారులు
హైదరాబాద్ వర్ష పరిస్థితిని సమీక్షించేందుకు HYDRA కమిషనర్ ఏ.వి. రంగనాథ్ నాయకత్వంలో అధికారులు నీట మునిగిన ప్రాంతాలను సందర్శించారు. సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చురుకుగా వ్యవహరించారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిస్థితిపై తక్షణమే స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనగల సమర్థతతో వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.రామకృష్ణారావు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్థంభాలు, ఓపెన్ మ్యాన్‌హోల్స్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
హిమాయత్ సాగర్ గేటు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల వర్షాల ప్రభావంతో హిమాయత్ సాగర్ (Himayat Sagar) లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం 1762.70 అడుగులకు చేరడంతో ఒక గేటును ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.GHMC, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో స్పందించాలంటూ HMWSSB MD అశోక్ రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
Read Also : Heavy Rain In HYD: దంచికొట్టిన వాన.. అత్యధికం ఎక్కడంటే