హైదరాబాద్ : ప్రజాస్వామ్య మనుగడలో పోలీసు వ్యవస్థది కీలకపాత్ర అని బిఎస్ఎఫ్ డిజి దల్జీత్ సింగ్ చౌదరి(DG Daljeet Singh Chaudhary) అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు సవాల్ గా మారిన సైబర్ నేరాల విషయంలో మరింత అప్రమత్తంగా వుండాలని యువ ఐపిఎస్లను ఆయన కోరారు. నగర శివార్లలోని శివరాంపల్లిలో గల సర్దార్ వల్లభభాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమిలో శుక్రవారం జరిగిన 77వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనరీ అధికా రుల దీక్షాంత్ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వారి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరి రక్షణ, నేరాల నివారణ, ఉగ్రవాదులు, తీవ్రవాదుల పీచమణచడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని, సాంకేతిక నేరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ మరింతగా మెరుగు పడాలని, ఈ విషయంలో టెక్నాలజీని వాడాలని ఆయన తెలిపారు.
Read also: K Ramp Twitter review : కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ కిరణ్ అబ్బవరం ఎనర్జీ అద్భుతం
దేశం అత్యున్నతంగా వుండేందుకు ఐపిఎస్లు పాటుప డాలని ఆయన కోరారు. సామాన్యులు, పీడిత ప్రజల అభ్యున్నతి వారి భద్రత కోసం ఐపిఎస్లు మరింత నిబద్దతో కృషి చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరాల(Cybercrime) నివారణలో టెక్నాలజీని మరింత వాడుకోవాలని, నేరగాళ్ల పీచమణిచేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. నక్సలిజం, టెర్రరిజంను అంతమొందించడంలో ఐపిఎస్ అధికారులు (DGDaljeet Singh Chaudhary) ఇప్పటికే సుశిక్షుతులయ్యారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్దం కావాలని ఆయన సూచించారు. పోలీసింగ్ అంటే ఒక వృత్తి కాదని, త్యాగం, సేవలకు గుర్తింపు అని ఆయన అన్నారు. యువ ఐపిఎస్ల ముందు ఎన్నో కఠిన సవాళ్లు వున్నాయని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తు లో పోలీసింగ్ స్మార్ట్ పోలిసింగ్గా వుండాలని, సున్నితమైనదిగా వుండాలని, ప్రజల మనస్సులను గెలిచేలా వుండాలని బిఎస్ఎఫ్ డిజి తెలిపారు. నక్సల్స్ విషయంలో దేశ వ్యాప్తంగా పోలీసు శాఖ ఇటీవల కాలంలో మంచి ఫలితాలను సాధించడంపై ఆయన సంతృప్తి చెందారు. దేశంలో వ్యవస్థీకృత నేరాలు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయని, వీటి నివారణలో పోలీసులు మరింత రాటుదేలాల్సిన అవసరం వుందని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారిన పలు రకాల నేరాల విషయంలో మరింత పరిణతి సాధించాలని ఆయన కోరారు.
మాదకద్రవ్యాల స్మగ్లింగ్ విషయంలో పోలీసులు మరింతగా పురోగతి సాధించాల్సిన అవసరం వుందని, డ్రగ్స్ ను సమూలంగా అంతం చేయాలని ఆయన తెలిపారు న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రిమినల్ జస్టిస్ విషయంలో ఐపిఎస్ లు పట్టు సాధించాలని, దేశాన్ని ఐక్యంగా వుంచేందుకు నాడు సర్దార్ వల్లభ బాయి పటేల్ తొలి కేంద్ర హోం మంత్రిగా చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తుతించారు. అప్పట్లో సర్దార్ పటేల్ చేసిన అవిరళ కృషి వల్లే నేడు భారత దేశం ఉన్నతంగా వుందని ఆయన కొనియాడారు.
190 మంది అధికారులు పాల్గొన్న ఈ దీక్షాంత్ పరేడ్లో 174 మంది ఐపిఎస్ అధికారులు కాగా 16 మంది విదేశీ అధికారులున్నారు. వీరిలో 62 మంది మహిళలు వున్నారు. దీక్షాంత్ వరేడ్కు తమిళనాడు కేడర్కు చెందిన అంజిత్ నాయర్ నాయకత్వం వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దల్జీత్ సింగ్ చౌదరి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభకనబరచి బెస్ట్ ఆల్ రౌండర్గా నిలిచిన పరేడ్ కమాండర్ అంజిత్ నాయర్కు బెస్ట్ క్యాడర్ అవార్డుతో పాటు కత్తిని బహుకరించారు. ఆయనతో పాటు శిక్షణలో ప్రతిభ కనబరచిని మరికొందరు ఐపిఎస్ అధికారులకు బిఎస్ఎఫ్ డిజి ట్రోపిలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిజిపి శివధర్ రెడ్డితో అకాడమి డైరక్టర్ అమిత్ గార్గ్ సహా సిబిఐ, ఐబి డైరక్టర్లు, త్రివిద దళాలకు చెందిన అధిపతులు, విశ్రాంత పోలీసు, రక్షణ బలగాల అధిపతులు, ఇతర ఉన్నతాధి కారులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో ఐపిఎస్ల దీక్షాంత్ పరేడ్ ఆహుతులను అలరించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :