మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాలని సామాజిక కార్యకర్త జెట్టి ఉమేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పబ్లిక్ గార్డెన్‌లో విగ్రహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఉమేశ్వర్‌రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించి, గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని ఆయన కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఈ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సూచించారు. గార్డెన్‌లో 13 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురవ్వగా, విగ్రహాలు పెడితే స్థలాభావం తలెత్తుతుందని తెలిపారు. పార్క్‌లో పిల్లల ఆటస్థలం తగ్గిపోతుందని, రాజకీయ సమావేశాలకు విగ్రహాలను వాడుకుంటారని, భవిష్యత్తులో ఇతర పార్టీల నేతల విగ్రహాల కోసం డిమాండ్లు రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది శాంతిభద్రతలకు ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
![అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనపై హైకోర్టు తీర్పు](https://vaartha.com/wp-content/uploads/2025/01/అటల్-బిహారీ-వాజ్_పేయి-విగ్రహ-ప్రతిష్ఠాపనపై-హైకోర్టు-తీర్పు1.jpg.webp)
అయితే, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ వాదన ప్రకారం, పిటిషనర్‌కు ఈ వ్యవహారంపై చట్టపరమైన హక్కు లేదని, విగ్రహం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించదని తెలిపారు. సుప్రీంకోర్టు గత తీర్పులను ఉదహరిస్తూ, విగ్రహాల స్థాపనపై అభ్యంతరాలు ప్రధానంగా కుల, మత పరమైన సందర్భాల్లో మాత్రమే చెల్లుతాయని వాదించారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.