మానవ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమమన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. మంగళవారం సాయంత్రానికి దాదాపు 55 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు.ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తెలిపింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊహించని రీతిలో భక్తులు తరలివస్తున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక-సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 55 కోట్ల మందికిపైగా మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా 55 కోట్ల మార్కును చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది,మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు” అని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
పౌరాణిక గాథలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు
మహాకుంభమేళాలో శాంతిభద్రతలకు అవాంతరం కలగకుండా యూపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏఐతో కూడిన అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఏఐతో అనుసంధానమైన డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, సమాచార కేంద్రాల ద్వారా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించేలా ఏర్పాటు చేసిన పౌరాణిక గాథలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.