వయస్సు పెరిగే కొద్దీ శారీరక బలాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం. తాజాగా ఓ ఆసక్తికర అధ్యయనం ఈ దిశగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి నేలపై కూర్చుని, మళ్లీ నిలబడే సామర్థ్యం ఆధారంగా ఆయన ఆరోగ్య భవిష్యత్తును అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు (Scientists) అంటున్నారు. ఈ పరీక్షను ‘సిట్టింగ్-రైజింగ్ టెస్ట్’ (Sitting-Rising Test) అంటారు.బ్రెజిల్‌కు చెందిన నిపుణుల బృందం 46–75 ఏళ్ల మధ్య వయసున్న 4,300 మందిపై ఈ పరీక్షను నిర్వహించింది. ఎస్‌ఆర్‌టీ ద్వారా వారి శరీర బలం, సమతౌల్యం, కండరాల పని తీరు లాంటి అంశాలను పరిశీలించారు. ఈ పరీక్షలో వ్యక్తులు నేలపై కూర్చుని, ఏ సహాయం లేకుండా మళ్లీ నిలబడాలి. ఎవరు మోకాలిపై ఆధారపడినా, చేతుల సహాయం తీసుకున్నా, ఒక్కో పాయింట్‌ను తగ్గించారు. అదే విధంగా స్థిరంగా కదలలేని వారికి 0.5 పాయింట్లు తగ్గించారు.
తక్కువ స్కోరు… ఎక్కువ ముప్పు
ఈ అధ్యయనాన్ని 12 సంవత్సరాల పాటు పర్యవేక్షించారు. ఆ కాలంలో 665 మంది మరణించినట్లు గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎస్‌ఆర్‌టీ పరీక్షలో తక్కువ స్కోరు సాధించిన వారిలో 42% మరణాలు సంభవించాయి. అదే సమయంలో ఎక్కువ స్కోరు వచ్చినవారిలో ఈ రేటు కేవలం 3.7% మాత్రమే. ఇది ఆరోగ్య పరిస్థితిపై ఈ పరీక్ష ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.తక్కువ స్కోరు సాధించినవారిలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 500% అధికంగా ఉంది. సహజ కారణాల వల్ల మరణించే ముప్పు కూడా 300% అధికమని నిపుణులు తెలిపారు.
ఆరోగ్యంపై అవగాహనకు ఒక సరళ పరీక్ష
గత 25 ఏళ్లుగా ఈ టెస్ట్ అనేక వయో వర్గాలపై ప్రయోగించారట. ఇది అత్యంత సులభమైన, ఖచ్చితమైన శారీరక పరీక్షలలో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్‌ఆర్‌టీ ద్వారా వ్యక్తులు తమ శరీర సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. తద్వారా అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా అడుగులు వేయొచ్చు.
Read Also : Chengalpattu Express : చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ..