తక్కువ నిద్ర చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం నిద్రలేమితో గుండె జబ్బులు(Heart Problem), మతిమరుపు, అధిక రక్తపోటు(Blood pressure), నిరుత్సాహం, డిప్రెషన్, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రతిరోజూ రాత్రిపూట 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రించేవారిలో కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తక్కువ, ఎక్కువగా నిద్రపోవడం ఎలాంటి సమస్యలు వస్తాయి.
అకాల మరణం ముప్పు
రోజూ రాత్రిపూట 7 గంటల కన్నా తక్కువసేపు పడుకునేవారికి అకాల మరణం ముప్పు 14 శాతం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా, 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రించేవారికి అకాల మరణం ముప్పు 34 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. గతంలో నిర్వహించిన 79 అధ్యయనాలను సమీక్షించి పరిశోధకులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. సమతులాహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామంలాగే, నిద్ర కూడా మొత్తం శరీర ఆరోగ్యం కోసం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. మనం నిద్రపోయినప్పుడు, శరీరంలో కొన్ని ముఖ్యమైన పనులు జరుగుతాయని తెలిపారు. కణజాలాలు, కండరాలు వాటి పనులను నిర్వహించుకోవడం, జ్ఞాపకశక్తి స్థిరపడటం, హార్మోన్లు నియంత్రించబడటం, రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, మానసిక సమతుల్యతను కాపాడుకోవడం వంటివి జరుగుతాయని వివరించారు. ఈ ప్రక్రియలు మనం మేల్కొని ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండటానికి చాలా అవసరమని పేర్కొన్నారు.
తక్కువ నిద్రపోవడం వల్ల
పెద్దలకు రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరమని చెబుతున్నారు. అంతకంటే తక్కువగా నిద్రపోతే అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం, ఉత్పాదకత తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయని, దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్, ఆందోళన, త్వరగా మరణించడం వంటివి కూడా సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా తగినంత నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల అనేక వ్యాధులు, రుగ్మతలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని, ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్ నుంచి ఊబకాయం, చిత్తవైకల్యం వరకు ఉంటాయని అధ్యయనంలో పేర్కొంది.
రాత్రి నిద్ర ఎందుకు రాదు?
దీర్ఘకాలిక నిద్రలేమికి సాధారణ కారణాలు: ఒత్తిడి. పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మీ మనస్సును చురుగ్గా ఉంచుతాయి, దీని వలన నిద్రపోవడం కష్టమవుతుంది. ప్రియమైన వ్యక్తి మరణం లేదా అనారోగ్యం, విడాకులు లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన జీవిత సంఘటనలు కూడా నిద్రలేమికి దారితీయవచ్చు.
నిద్ర లేకపోతే ఏమవుతుంది?
నేర్చుకోవడంలో, దృష్టి పెట్టడంలో మరియు ప్రతిస్పందించడంలో మీకు ఇబ్బంది ఉండవచ్చు. అలాగే, ఇతరుల భావోద్వేగాలు మరియు ప్రతిచర్యలను అంచనా వేయడం మీకు కష్టంగా అనిపించవచ్చు.