మన శరీరానికి అవసరమయ్యే కీలకమైన పోషకాల్లో మెగ్నిషియం (Magnesium)ఒకటి. గుండె జబ్బులు, మధుమేహం, ఆస్టియోపోరోసిస్, నాడీ సంబంధిత రుగ్మతలను నివారించడంలో మెగ్నిషియం కీలకపాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్యంలో మెగ్నిషియం (Magnesium)పాత్ర ఎంతో ఉంటుంది. శక్తి ఉత్పత్తి, కండరాలు పనితీరు, నాడుల పనితీరు, రక్తపోటు నియంత్రణ, ఎముకలను దృఢంగా చేయడం, బోలు ఎముకలు వంటి 300 కి పైగా జీవరసాయన ప్రతి చర్యలకు మద్దతును ఇస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది దాదాపు 15 నుండి 40 శాతం మంది మెగ్నిషియం లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో మెగ్నిషియం లోపించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలసట, కండరాల తిమ్మిరి, నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి లక్షణాలను బట్టి మన శరీరంలో మెగ్నిషియం లోపించిందని గుర్తించాలి.
Read Also : http://Anti Biotics : యాంటీ బయోటిక్స్ తో వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..
ఆకుకూరలలో మెగ్నిషియం
అయితే మనం తీసుకునే ఆహారాల ద్వారా కూడా మనం మెగ్నిషియం లోపాన్ని అధిగమించవచ్చు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మెగ్నిషియం లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. సహజంగా మెగ్నిషియం స్థాయిలను పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారాలేమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరలను తీసుకోవడం వల్ల మెగ్నిషియం స్థాయిలు పెరుగుతాయి. 100గ్రాముల పాలకూరలో 79 నుండి 87 మి.గ్రా., తోటకూరలో 55 నుండి 60 మి. గ్రా., మెంతి ఆకుల్లో 51 నుండి 59 మి.గ్రా., మునగాకులలో 24 నుండి 45 మి.గ్రా.ల మెగ్నిషియం ఉంటుంది. ఆకుకూరలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెగ్నిషియం లోపం తగ్గుతుంది. రోజూ కనీసం ఒక ఆకుకూరనైనా తీసుకునే ప్రయత్నం చేయాలి.
గింజలలో మెగ్నిషియం
అలాగే బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా, బ్రెజిల్ నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటి వాటిల్లో కూడా అధిక మొత్తంలో మెగ్నిషియం ఉంటుంది. బాదంపప్పులో 260 నుండి270 మి.గ్రా., జీడిపప్పులో 292 మి.గ్రా., వాల్‌నట్స్ లో 158 నుండి 168 మి.గ్రా., పిస్తా పప్పులో 121 మి.గ్రా., అవిసె గింజలు 393 మి.గ్రా., గుమ్మడి గింజలు 535 మి.గ్రా., పొద్దు తిరుగుడు విత్తనాలు 325మి.గ్రా., నువ్వులు 356 నుండి 370 మి.గ్రా.ల మెగ్నిషియం ఉంటుంది. ఈ గింజలను రోజూ వారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెగ్నిషియం లోపం తలెత్తకుండా ఉంటుంది.
తృణ ధాన్యాలలో మెగ్నిషియం
ఇక మెగ్నిషియం లోపంతో బాధపడే వారు తృణ ధాన్యాలను, చిక్కుళ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మెగ్నిషియం స్థాయిలు సహజంగానే పెరుగుతాయి. జొన్నలు, సజ్జలు, రాగి వంటి తృణ ధాన్యాలు మెగ్నిషియం అద్భుతమైన వనరులు. అలాగే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వంటి వాటిని తీసుకోవడం వల్ల తగిన మోతాదులో శరీరానికి మెగ్నిషియం లభిస్తుంది. రోజూ ఏదో ఒకరకం పప్పును ఆహారంలో భాగంగా తీసుకునే అలవాటు చేసుకోవడం వల్ల మెగ్నిషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. అదే విధంగా నీటిని తాగడం వల్ల ఒకప్పుడు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభించేవి. కానీ ఇప్పుడు నీటిని తాగినా కూడా పోషకాలు లభించడం లేదు. పోషకాలు కలిపిన నీటిని తీసుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మెగ్నిషియం లోపంతో బాధపడే వారు మెగ్నిషియం కలిపిన నీటిని తీసుకోవచ్చు. అయితే ఈ నీటిని తాగే ముందు వైద్యులని సంప్రదించడం మంచిది. ఈ విధంగా తగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మెగ్నిషియం లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. అయితే మెగ్నిషియం లోపం అధికంగా ఉన్నవారు మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: