ఒక్కసారి డయాబెటిస్ నిర్ధారణ అయ్యిందంటే చాలు! ఇక దాన్ని తగ్గించుకోవడానికి చక్కెర పదార్థాలకు దూరంగా, డాక్టర్లు చుట్టూ తిరుగుతూ, ఏవేవో మందులు వాడుతూ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ షుగర్ అదుపులో పెట్టుకునేందుకు కొన్ని సహజ మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
రక్తంలో అధిక చక్కెర స్థాయి (Sugar levels)కలిగి ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది కాలక్రమేణా డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ (Diabatic)లేదా డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని వివరిస్తున్నారు.
వ్యాయామం అవసరం
రక్తంలో షుగర్‌ను సహజంగా తగ్గించుకోవడానికి శారీరక శ్రమ అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి. వ్యాయామం చేసినప్పుడు కండరాలు అనేవి శక్తి కోసం గ్లూకోజ్(Glucose)ను వినియోగించుకుంటాయని, దీంతో రక్తంలో షుగర్ పరిమాణం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. నడక, జాగింగ్ లాంటి వ్యాయామలు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుందని Gradyhealth అధ్యయనంలో పేర్కొంది. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండడానికి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, ఒబెసిటీలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. తృణధాన్యాలు, కూరగాయలు, చిక్కుళ్లు వంటి తక్కువ గ్లైసెమిక్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించవచ్చనని వివరిస్తున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు అనేవి నెమ్మదిగా జీర్ణం అవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అనేది అదుపులో ఉంటుందని పేర్కొన్నారు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.మరోవైపు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుందని వివరించారు. కూరగాయలు, పండ్లు, విత్తనాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను రోజు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని తెలిపారు. భోజనానికి ముందు కొద్ది మొత్తంలో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గుతుందని National Library of Medicine పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది దంతాలను రక్షించుకోవడానికి, నోటిని శుభ్రంగా ఉంచడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి
ప్రస్తుతం మానసిక అనారోగ్యం అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అనారోగ్య బారిన పడేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అనేది రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఇన్సులిన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. యోగా, ధ్యానం, లోత్తెన శ్వాస తీసుకోవడం లేదా ఆరుబయట నడవడం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, దీంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని తెలిపారు.
తగినంత నిద్ర అవసరం
తక్కువ నిద్ర లేదా తగినంత విశ్రాంతి ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని sleepfoundation అధ్యయనంలో పేర్కొంది. తగినంత నిద్ర లేనప్పుడు శరీరంలో ఎక్కువ కార్టిసాల్ ఉత్పత్తి అవుతుందని, దీంతో రక్తంలో ఆటోమెటిక్‌గా షుగర్ లెవల్స్ పెరిగిపోతాయని తెలిపారు. ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవటం వల్ల హార్మోన్ల సమతుల్యంగా ఉంటాయని, తద్వారా బాడీలో షుగర్ అదుపులో ఉంటుందని తెలిపారు.
Read Also : Health: ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూరగాయలు