గత రెండు వారాలుగా ఇరాన్‌ను కుదిపేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి యుద్ధ మేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆర్థిక సంక్షోభంపై ప్రజలు రోడ్లకెక్కిన నేపథ్యంలో ఇరాన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో నిరసనల్లోనే పలువురు భారతీయులు, మరికొందరు అఫ్గాన్ ప్రజలు అరెస్టు అయ్యారన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం తాజాగా కొట్టిపారేసింది.
ఆ వార్తల్లో నిజం లేదు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై భారత దేశంలోని ఇరాన్(Iran) రాయబారి మొహమ్మద్ ఫతాలీ స్పందించారు. “ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలపై కొన్ని విదేశీ ఎక్స్ ఖాతాల ద్వారా వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. ప్రజలు అధికారిక ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి” అని ఆయన కోరారు. ఇరాన్ నిరసనల్లో ఆరుగురు భారత పౌరులు, 10 మంది అఫ్గాన్ ప్రజలు అరెస్ట్ అయ్యారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు.
Read Also: USMilitary: ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!
కొనసాగుతున్న 500 మందికి పైగా బలి!
హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం.. ఇరాన్ భద్రతా దళాల అణిచివేతలో ఇప్పటి వరకు 544 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 496 మంది నిరసనకారులు కాగా.. 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,600 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినప్పటికీ.. ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ శాటిలైట్ పరికరాల ద్వారా అక్కడి ఉద్రిక్త పరిస్థితుల వీడియోలు బయటకు వస్తున్నాయి. నిరసనకారులు తమ మొబైల్ ఫోన్ల లైట్లను వెలిగిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అణిచివేతను తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సైనిక చర్యకు సిద్ధమని హెచ్చరించారు. సైనిక దాడులు, సైబర్ దాడులతో సహా అన్ని రకాల ఆప్షన్లను తాము పరిశీలిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: