హైదరాబాద్ : ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్ పెద్ద మనిషిగా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆశపడిన బీఆర్ఎస్ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు నిరాశ చెందారని కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
గవర్నర్ తన హోదా, స్థాయిని మరిచి ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. రాష్ట్రంలో రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణ మాఫీ చేయాలని, రైతులకు పంట బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన, నిరసన మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
కేసీఆర్ హయాంలో 56 శాతం ఉన్న బీసీలు
బీసీ కులగణనపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 56 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఎందుకు తగ్గిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి తెలంగాణ తల్లి అంటున్నారు. రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ లో పెట్టారు. మూడేళ్ల తరువాత మేం అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపిస్తాం అని కేటీఆర్ అన్నారు.