గత కొన్ని వారాలుగా పరుగులు తీసిన బంగారం ధరలు ఒక్కసారిగా వెనక్కి తగ్గడం గోల్డ్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో ధరలు ఒక్క రోజే వెయ్యి రూపాయలకు పైగా పడిపోవడం గమనార్హం. పుత్తిడి ధరల్లో ఇలా ఒక్కసారిగా భారీగా మార్పు రావడంతో మదుపర్లు, ఆభరణాల కొనుగోలుదారులు, స్టాకిస్టుల దృష్టంతా మళ్లీ బంగారం వైపే మొగ్గుచూపింది.

ఢిల్లీలో బంగారం ధరలు రూ. 1,500కు పైగా పడిపోవడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 91,450కి చేరింది. ఇది వారం రోజుల కిందట రూ. 93,000 దాటి ఉన్న స్థాయి నుంచి గణనీయంగా తక్కువ. మార్కెట్ నిపుణుల ప్రకారం, విక్రయాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే ధరలు ఇలా తగ్గినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొంత మేర తగ్గినప్పటికీ, అక్కడి ధరలు ఢిల్లీతో పోలిస్తే బాగా తక్కువ స్థాయిలో ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ రూ. 280 తగ్గి రూ. 90,380గా నమోదైంది. ఇది గత వారం ముగింపు ధరతో పోలిస్తే కొంత తగ్గుదలే అయినా, కస్టమర్లను ఆకర్షించడానికి గల కారణం అవుతోంది.
వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గడం గమనార్హం. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ తగ్గిపోవడంతో వెండి ధర కిలోకు ఏకంగా రూ. 3,000 తగ్గి రూ. 92,500గా నమోదైంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో వెండి ధరలు అంతగా తగ్గకపోయినా, రూ. 1.03 లక్షల స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఔన్సుకు 10.16 డాలర్లు తగ్గి 3,027 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధర ఔన్సుకు 30.04 డాలర్ల వద్ద ఉంది. ఇది మార్కెట్‌లో ఉన్న అస్థిరత, అమెరికా కేంద్ర బ్యాంక్ విధానాలు, మరియు ట్రేడింగ్ వాతావరణం కారణంగా చోటుచేసుకుంది. ధరలు తగ్గిపోతున్న వేళ, మదుపర్లు కొంత గందరగోళంలో ఉన్నారు. కొందరు ఇది తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసే మంచి అవకాశం అంటుండగా, మరికొందరు ఇంకా తగ్గవచ్చని భావిస్తూ వేచిచూస్తున్నారు. ముఖ్యంగా పండగల సీజన్ దగ్గరపడుతుండటంతో, వివాహ వేడుకలకు బంగారం కొనుగోలు చేసే ప్రజలలో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
Read also: Trump: నేడు సెన్సెక్స్ భారీగా పతనం