CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచ గచ్చిబౌలి పరిధిలోని భూముల వ్యవహారం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆందోళనలు, తాజా పరిణామాలపై ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో సీఎం సమీక్షించారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ఇప్పటికే స్పష్టం చేశారు.

ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే
దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది లేదని పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. హెచ్‌సీయూని సందర్శించేందుకు బయల్దేరిన బీజేపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. హెచ్‌సీయూ సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు.