హైదరాబాద్‌లో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి (Magam Ranga Reddy) గుండెపోటుతో మృతి చెందారు. బుధువారం ఆకస్మికంగా గుండెనొప్పితో బాధపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.
రేపు శామీర్పేటలో అంత్యక్రియలు
మాగం రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులుగా గుర్తింపు పొందారు. నేడు బీజేపీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కొనసాగుతున్న ఆయన రాజకీయ అనుభవం, స్పష్టత పార్టీకి తోడ్పాటైంది. ఆయన మృతి బీజేపీకి తీరనిలోటుగా భావిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామమైన శామీర్పేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులకు నేతలు పరామర్శలు తెలియజేస్తున్నారు.
రేవంత్ రెడ్డి సంతాపం
మాగం రంగారెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. “రంగారెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా, అభివృద్ధి పరంగా పలు సూచనలు చేసిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన మరణం తీవ్ర విషాదకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ వర్గాల్లో ఆయన మృతిపై దిగ్భ్రాంతి నెలకొంది.
Read Also : Bengaluru Stampede : వేడుక విషాదంగా మారడం దురదృష్టకరం- పవన్