మంత్రులకు చేపకూర, విద్యార్థులకు పస్తులా?: కేటీఆర్ : రాష్ట్రంలో ప్రజాపాలన దారుణ స్థాయికి చేరిందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. SLBC ప్రమాదం జరిగిన సందర్భంలో రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులతో మునిగితేలుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల కష్టసుఖాల పట్ల ప్రభుత్వ అనాసక్తి స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజా సమస్యలను పక్కన పెట్టి వినోదంలో మునిగిపోయే పాలకులు ఉన్నా ప్రజలు నిశ్శబ్దంగా ఉండరని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

గుడిలో అన్నదానానికి వెళ్లి తినండి
మంత్రులకు చేపకూర, విద్యార్థులకు పస్తులా?: కేటీఆర్ : అచ్చంపేట నియోజకవర్గం కొండనాగులలో ఉన్న ఎస్టీ బాలుర హాస్టల్ విద్యార్థులకు సరైన భోజన సదుపాయాలు కల్పించకుండా, శివరాత్రి రోజున గుడిలో అన్నదానానికి వెళ్లి తినమనడం తీవ్రంగా నిరాశకు గురిచేసిందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థుల నిత్యావసర అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది ప్రజాపాలనలో నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. పండగపూట కూడా విద్యార్థులను పస్తులుండేలా చేయడమే ప్రభుత్వ నిర్వాకానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారాన్ని వినోదంగా మార్చుకున్నారు
ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, అధికారాన్ని వినోదంగా మార్చుకుంటున్న ప్రభుత్వ తీరును ప్రజలు సహించరని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాల్సిన మంత్రులు తమ హోదాను స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడమే కాకుండా, బాధితులను పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఈ పరిస్థితిని ప్రజలు త్వరలోనే గమనించి సరైన తీర్పు ఇస్తారని, నిర్లక్ష్య పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.