Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ వర్గాలు స్పందించాయి. రాహుల్ వ్యాఖ్యలు ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని అభివర్ణించాయి. ‘ఓటరు జాబితా తయారీ, పోలింగ్, ఓట్ల లెక్కింపుతో సహా ప్రతి ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారు. ఈ విషయం దేశం మొత్తానికీ తెలుసు. రాహుల్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఈసీని కించపరచడానికి చేసినవేనని తెలుస్తోంది’ అని ఓ ప్రకటనలో తెలిపాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే అది కేవలం చట్టాన్ని అవమానించడమే కాదని, తన సొంత పార్టీకి చెందిన వేలాది మంది ఏజెంట్లను కూడా కించపరచడమేనని ఈసీ పేర్కొంది.

ఎన్నికల సిబ్బందిని కూడా అగౌరవపర్చాడు
రాహుల్ చట్టాన్ని అగౌరవ పర్చడంతో పాటు తన సొంత పార్టీ కార్యకర్తలను, లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని కూడా అగౌరవపర్చాడని విమర్శించింది. ఈ తరహా ఆరోపణలు ఎన్నికల సిబ్బందిని నిరుత్సాహ పరుస్తామని తెలిపింది. ఓటర్లు తమకు ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ రాజీపడిందని చెప్పడం పూర్తిగా అవాస్తమైన వ్యాఖ్యలని వెల్లడించాయి. కాగా, అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తావించారు. ‘సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య 65 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది అసాధ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి ఓటు వేయడానికి దాదాపు 3 నిమిషాలు పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఈసీ రాజీపడినట్టు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.
Read Also: సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు