CM Revanth Reddy : తెలంగాణలో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం 75శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదు. తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉంది. 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరిజ్ఞానంలో తెలంగాణ 36వ స్థానంలో ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అథమ స్థానంలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితి. ప్రతి స్థాయిలో విద్యారంగం రోజు రోజుకూ క్షీణించి పోతోంది.

విద్యా రంగానికి భారీగా నిధులు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11వేలకు పైగా టీచర్ల నియామకం చేపట్టాం. 21వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతులు కల్పించాం. ఏడెనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 36వేల మంది టీచర్ల బదిలీ చేపట్టాం. కలెక్టర్లనైనా బదిలీ చేయవచ్చు గానీ, టీచర్ల బదిలీ ఆషామాషీ కాదు. 36వేల మంది టీచర్లను చిన్న ఆరోపణలు లేకుండా బదిలీ చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై రూ.1.08లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో రూ.50వేల వరకు ఖర్చయితే.. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.లక్ష ఖర్చవుతోంది. బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమిస్తూ రూ.23,108 కోట్లు కేటాయించాం. విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించినా ప్రమాణాలు పడిపోతున్నాయి.
విద్యా ప్రమాణాల మెరుకు చర్యలు
ఇందుకు ప్రభుత్వమే కాదు.. సమాజం బాధ్యత తీసుకోవాలి. లోతుగా విశ్లేషించి సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో ఆలోచన చేసినంత కాలం విద్యారంగం ప్రక్షాళన కాదు. విద్య పట్ల ప్రత్యేక విధానం తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. విద్యారంగం బలోపేతానికి సూచనల కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం అన్నారు. గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో విద్యా ప్రమాణాల మెరుకు చర్యలు తీసుకుంటాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే స్థానిక సంస్థల్లో పోటీకి, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశంపై చర్చించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.