ఛత్తీస్‌గఢ్: ఈడీ అధికారులు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య నివాసంలో సోమవారం సోదాలు నిర్వహించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయని సంబంధిత అధికారులు వెల్లడించారు .మొత్తం 15 ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది. ఈ తనిఖీల నేపథ్యంలో భగేల్ కార్యాలయం నుంచి స్పందన వచ్చింది.

రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం
ఏడు సంవత్సరాలు నడిచిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేసింది. కానీ ఇప్పుడు ఈడీ అతిథులు వచ్చి భగేల్ నివాసంలో తనిఖీలు చేశారు అని మండిపడింది. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. మద్యం సిండికేట్‌కు రూ.రెండువేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఈడీ గతంలో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్టు చేసింది.
సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం
కాగా, ఉదయం 7:00 గంటలకు మూడు ఇన్నోవా కార్లలో ఈడీ బృందం భూపేష్ బఘేల్ ఇంటికి వచ్చింది. బంగ్లా లోపల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు భూపేష్ బఘేల్ ఇంటి బయట గుమిగూడారు. ఈడీ సోదాల నేపథ్యంలో భద్రత కోసం హాజరైన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.