- లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ వినియోగం
- భూమిపూజలో టిటిడి చైర్మన్ నాయుడు
తిరుమల: వడ్డీకాసుల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీతోబాటు అన్నప్రసాదాల తయారీకి అవసరమైన గ్యాస్ను నిరంత రాయంగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు 8.13కోట్ల రూపాయల వ్యయంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లిమిటెడ్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుచేయడం జరుగుతుందని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని ఔటర్రింగురోడ్డులో బాటగంగమ్మ ఆలయా నికి సమీపంలో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్యాస్ ప్లాంట్ను టిటిడి-ఐఒసిఎల్ సంయుక్తంగా నెలకొల్పుతున్నట్లు చెప్పారు. రానున్న ఆరునెలల్లో ఈ పనులు పూర్తయి టిటిడి (TTD) కి లడ్డూప్రసాదాల తయారీ, ఆన్నప్రసాదాల తయారీకి గ్యాస్ వినియోగం అందుబాటులోకి వస్తుందన్నారు.
గ్యాస్ ప్లాంట్ లడ్డూప్రసాదాల తయారీకి
ఈ నూతన ప్రాజెక్ట్ ఏర్పాటుతో సంవత్సరానికి 1.5కోట్ల రూపాయలు టిటిడి (TTD) కి ఆదా అవుతుందని తెలిపారు. గురువారం ఉదయం ఔటర్రింగురోడ్డులో 45మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్టోరేజీ కేంద్ర నిర్మాణానికి టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు (B.R. Naidu) , ఐఒసిఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ వి. సతీష్కుమార్ భూమిపూజ చేశారు. ప్రస్తుతం టిటిడికి గత రెండు దశాబ్దాలుగా ఐఒసిఎల్ సంస్థ ఎల్పీజిని నిరంతరాయంగా సరఫరా చేస్తోందన్నారు. ఇకపై 30 సంవత్సరాలు ఎల్పీజి సరఫరాకు టిటిడి-ఐఒసిఎల్ మధ్య ఒప్పందం కుదిరిందని చైర్మన్ వెల్లడించారు. ఐఒసిఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ తిరుమల డంపింగ్ యార్డుప్రాంతంలో 12.05కోట్ల రూపాయలతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతిరోజూ సేకరిస్తున్న 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఒసిఎల్ ప్లాంట్కు తరలించి రోజుకు వెయ్యికిలోల బయోగ్యాస్ ఉత్పత్తిచేయనున్నామని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్లో 45 మెట్రిక్ టన్నుల మౌండెడ్ స్టోరేజ్ వెసల్స్, 1,500 కిలోల వేపరైజర్. అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, రెండు వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్, రిమోట్ ఆపరేటింగ్ వాలు, గ్యాకేజీ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సిసిటివి, జిఎంఎస్, టిఎఫ్ఎంఎస్, ఐఎల్ఎస్ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ సత్యనారాయణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, ఇఇలు సుబ్రమణ్యం, సుధాకర్, డిఇ చంద్రశేఖర్, పిఆర్ ఒ నీలిమ, ఐఒసిఎల్ అధికారులు పాల్గోన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Jagan: జగన్.. పోలీసుల్ని బెదరించడం సరికాదు- పోలీసు అధికారుల సంఘం