తిరుమలలో జరిగే ప్రతి పరిణామం భక్తుల విశ్వాసాలపై ప్రభావం చూపుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యులు, అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించింది. తిరుమల పరకామణిలో జరిగిన చోరీ ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు చేసింది. కానుకల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, ఇందులో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించింది.
Read also: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు
కానుకల లెక్కింపులో ఏఐ వినియోగం తప్పనిసరి
పరకామణిలో మానవ జోక్యాన్ని తగ్గించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అత్యాధునిక యంత్రాలను ప్రవేశపెట్టాలని టీటీడీకి హైకోర్టు స్పష్టం చేసింది. దొంగతనాల నివారణకు తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక సంస్కరణలను కూడా అమలు చేయాలని ఆదేశించింది. హుండీ సీలింగ్, కానుకల రవాణా, లెక్కింపు ప్రక్రియల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు తెలిపింది.

శాశ్వత పరిష్కారాల దిశగా కానుకలను వర్గీకరించడం, విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐ సాంకేతికత వినియోగించడం, బంగారం వంటి విలువైన లోహాలను వేరు చేసే ఆధునిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. ఈ అంశాలపై ఎనిమిది వారాల్లో ముసాయిదా తయారు చేసి కోర్టుకు సమర్పించాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది.
ప్లాన్-బీ సిద్ధం చేయాలని ఆదేశం
అదేవిధంగా ఈ కేసులో నిందితుడైన రవికుమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యుల ఆస్తుల విక్రయాలు, రిజిస్ట్రేషన్ల వివరాలను సీల్డ్ కవర్‌లో వారంలోపు సమర్పించాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 26కు వాయిదా వేస్తూ, కోర్టు ఆదేశాల మేరకు టీటీడీ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక (ప్లాన్–బీ) సిద్ధం చేసి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: