తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) కీలక సూచనలు చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని పరకామణి (కానుకల లెక్కింపు) విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. కానుకల లెక్కింపులో అవినీతి, చోరీలు, నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి మానవ ప్రమేయాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది.
Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పరకామణిలో సంస్కరణలను రెండు దశల్లో చేపట్టాలని హైకోర్టు నిర్దేశించింది. తక్షణ చర్యల్లో భాగంగా హుండీల సీలింగ్, రవాణా, లెక్కింపు ప్రక్రియల్లో భద్రతాపరమైన మార్పులపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇక శాశ్వత ప్రణాళికలో భాగంగా కానుకల వర్గీకరణ, విదేశీ కరెన్సీ గుర్తింపు, విలువైన లోహాలు, రాళ్లను వేరు చేయడం కోసం ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.ఇందుకోసం సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులైన నిపుణుల సహాయం తీసుకోవాలని పేర్కొంది.
తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా
ఈ శాశ్వత ప్రణాళికపై ఎనిమిది వారాల్లోపు ముసాయిదాను కోర్టుకు సమర్పించాలని గడువు విధించింది. భక్తులు హుండీలో సమర్పించే కానుకలు వారి విశ్వాసానికి ప్రతీక అని, వాటిని కాపాడాల్సిన నైతిక, ధార్మిక బాధ్యత టీటీడీ ధర్మకర్తల మండలిపై ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఈ ప్రక్రియలో ఏ చిన్న లోపం జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వారంలోపు సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఏసీబీ డీజీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: