కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన బంగారం చోరీ కేసు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భాగంగా మలయాళ ప్రముఖ నటుడు జయరామ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సాక్షిగా విచారించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
శబరిమల ఆభరణాల మాయం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టికి, నటుడు జయరామ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా, జయరామ్ నివాసంలో గతంలో జరిగిన కొన్ని ప్రత్యేక పూజల గురించి సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. దేవాలయానికి సంబంధించిన విలువైన ఆభరణాలు ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలోకి ఎలా వెళ్లాయి? ఆ సమయంలో జయరామ్ పాత్ర ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. శబరిమల వంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన సొమ్ము దుర్వినియోగం కావడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TG: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్..
ఈ వ్యవహారంపై జయరామ్ గతంలోనే తన వివరణ ఇచ్చారు. తాను తరచూ శబరిమలను సందర్శిస్తుంటానని, ఆ క్రమంలోనే అక్కడ ఉద్యోగిగా పనిచేస్తున్న ఉన్నికృష్ణన్ పొట్టితో పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు. దేవాలయం మూసివేసి ఉన్న సమయంలో స్వామివారి ఆభరణాలను ఇంట్లో ఉంచి పూజలు నిర్వహిస్తే కుటుంబానికి శుభం జరుగుతుందని పొట్టి తనను నమ్మించాడని జయరామ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో అయ్యప్ప ఆభరణాలతో పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ఆభరణాలు దొంగిలించినవని తనకు తెలియదని జయరామ్ వాదిస్తున్నారు.
గతంలో జయరామ్ ఇంట్లో పవిత్ర ఆభరణాలతో పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. దేవాలయ నియమ నిబంధనల ప్రకారం గర్భాలయం దాటి బయటకు రాకూడని ఆభరణాలు, ఒక నటుడి ఇంట్లో ఎలా ప్రత్యక్షమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. నిందితుడు పొట్టి ఇలా ఎంతమంది సెలబ్రిటీల ఇళ్లకు ఈ ఆభరణాలను చేరవేశాడనే దానిపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని కీలక నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com