తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. జాతర సమయంలో ఉండే విపరీతమైన రద్దీని, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేలాది కుటుంబాలు ముందస్తుగానే తమ మొక్కులను చెల్లించుకోవడానికి తరలివస్తున్నాయి. ముఖ్యంగా సెలవు దినం కావడంతో గడచిన ఆదివారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు మేడారానికి చేరుకోవడంతో ఆలయ పరిసరాలు, జంపన్న వాగు ప్రాంతం జనసంద్రంగా మారాయి.
TG Weather: జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి
మేడారానికి వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, ఆపై గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటున్నారు. ప్రస్తుతం జాతర కోసం ప్రభుత్వం భారీ ఎత్తున అభివృద్ధి పనులను చేపడుతోంది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం, క్యూ లైన్ల నిర్మాణం మరియు పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల కారణంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, గద్దెల లోపలికి అనుమతించకుండా వెలుపలి నుంచే దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ భక్తులు క్రమశిక్షణతో క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సాధారణంగా మేడారం మహా జాతర ఫిబ్రవరి నెలలో జరగనున్నప్పటికీ, ఈసారి ముందస్తుగా వస్తున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుండగా, పోలీస్ యంత్రాంతం ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పహారా కాస్తోంది. అడవి మార్గం గుండా వచ్చే భక్తులు చెట్ల నీడన వంటలు చేసుకుంటూ వనభోజనాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే, వచ్చే నెలలో జరిగే అసలైన జాతర నాటికి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com