ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల తిరుగు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా బస్టాండ్ ప్రాంగణానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రయాణికుల రద్దీని తట్టుకోలేక యంత్రాంగం చేతులెత్తేసింది. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోయారు.
Telangana: కేసీఆర్ తో KTR భేటీ
ముఖ్యంగా ప్రధాన మార్గమైన హన్మకొండ వైపు వెళ్లే కౌంటర్ల వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గంట నుంచి ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడంతో వేచి చూసి విసిగిపోయిన భక్తుల సహనం నశించింది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆగ్రహించిన ప్రయాణికులు కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన తడకలను పీకేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ఉన్న జనసందోహాన్ని నియంత్రించడంలో అటు పోలీసులు, ఇటు రవాణా శాఖాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే, ప్రయాణికుల సంఖ్య అంచనాలకు మించి ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు సమర్థించుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా బస్సులు తిరిగి మేడారం చేరుకోవడంలో ఆలస్యం జరుగుతోందని, తక్షణమే అదనపు బస్సులను మళ్లించి భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో, అధికారులు పరిస్థితిని సమీక్షించి అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com