హైదరాబాద్ హిమాయత్ నగర్(Himayat Nagar)లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) దేవాలయంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) ఈరోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సోమవారం నాడు పవిత్రమైన అనుకూరార్పణతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్దఎత్తున హాజరై శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఉదయం శేష వాహన సేవను ఆలయ ఆవరణలో నిర్వర్తించారు. భక్తులు శేష వాహనంపై స్వామివారి దర్శనాన్ని ఆస్వాదిస్తూ భక్తిసాంద్రతలో మునిగిపోయారు. రాత్రి సమయంలో శ్రీ హనుమంత వాహన సేవ జరుగనుంది. ప్రతి రోజు ప్రత్యేక వాహన సేవలు, అలంకారాలు, నైవేద్యాలు జరుగుతాయి. గరుడ వాహనం, గజ వాహనం, అశ్వ వాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Read Also : Raghurama Krishnam Raju: జగన్ పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాద వితరణ, శ్రీవారి కల్యాణోత్సవం, రథోత్సవం వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రత, శుద్ధత విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవాలయ పరిసర ప్రాంతమంతా శ్రీవారి నామస్మరణతో మార్మోగిపోతుండగా, ఈ బ్రహ్మోత్సవాలు నగరంలోని భక్తులకు భక్తి పరవశాన్ని కలిగిస్తున్నాయి.
కార్యక్రమాల షెడ్యూల్:
- జూన్ 3 (సోమవారం):
- ధ్వజారోహణం: ఉదయం 6:30 నుండి 8:45 వరకు
- శేష వాహన సేవ: ఉదయం 10 నుండి 11 వరకు
- శ్రీ హనుమంత వాహన సేవ: రాత్రి 8 గంటలకు
- జూన్ 4 (మంగళవారం):
- సూర్యప్రభ వాహనం: ఉదయం
- చంద్రప్రభ వాహన సేవ: రాత్రి 8 గంటలకు
- జూన్ 5 (బుధవారం):
- గజ వాహన సేవ: ఉదయం 8:30 గంటలకు
- శ్రీవారి శాంతి కల్యాణం: ఉదయం 10:30 గంటలకు
- గరుడ వాహన సేవ: రాత్రి 8 గంటలకు
- జూన్ 6 (గురువారం):
- రథోత్సవం: ఉదయం
- అశ్వ వాహన సేవ: సాయంత్రం
- జూన్ 7 (శుక్రవారం):
- చక్రస్నానం: ఉదయం 11:30 గంటలకు
- పుష్పయాగం: సాయంత్రం 6 గంటలకు
- ద్వజావరోహణం (ఉత్సవ ముగింపు): రాత్రి 9 గంటలకు