ప్రస్తుతం యువతలో ఫిట్‌నెస్ (Fitness) ప్రాధాన్యం పెరుగుతోంది. శరీరానికి ఆకర్షణీయమైన రూపం ఉండాలన్నది ప్రతి యువకుడి లక్ష్యం. అందుకు జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లకు వెళ్లడం, కండరాలను పెంచుకోవడం లేదా బరువు తగ్గించడం కోసం విభిన్న వ్యాయామాలు చేయడం సామాన్యమైంది. ఆ వ్యాయామాలను పూర్తి ఫలితంగా పొందడానికి చాలామంది ప్రోటీన్ పౌడర్లు, ఇతర సప్లిమెంట్లు వాడుతున్నారు. ఇవి మార్కెట్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి, ఎందుకంటే ‘ఫాస్ట్ రిజల్ట్’ అందిస్తాయని ప్రచారం చేస్తున్నారు.
కానీ ప్రతి ఒక్కరికి ఇవి సరిగా పనిచేయవు. శరీరంలో ప్రోటీన్ (Protein) లేదా ఇతర పోషకాల అవసరాలు వ్యక్తివ్యక్తిగా ఉంటాయి. అందువల్ల, వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా లేకుండా ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరంగా మారుతుంది. తీవ్రమైన అలెర్జీ, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అలెర్జీ రావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు
అయితే ఇవి అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా (Advice from nutritionists) లేకుండా వాటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రోటీన్ పౌడర్ ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైంది. జిమ్ ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ వల్ల తీవ్రమైన అలెర్జీ రావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఆరోగ్యం కోసం జిమ్‌కు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని విషాదం ఎదురైంది.
ఈ సంఘటన నీలగిరి జిల్లా (Nilgiri District) లోని కూనూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కూనూర్ ఏఐఏడీఎంకే కౌన్సిలర్ గురుమూర్తి కుమారుడు రాజేష్ ఖన్నా ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో జిమ్ వాళ్లు ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాడు. అయితే అది అతని శరీరానికి పడకపోవడంతో తీవ్రమైన అలెర్జీ వచ్చింది. దీనివల్ల అతని శరీరంపై దద్దుర్లు, ఇతర అలర్జీ లక్షణాలు కనిపించాయి.
చికిత్స పొందుతూ రాజేష్ శనివారం మరణించాడు
అలర్జీ రావడంతో రాజేష్ ఖన్నా తీవ్రంగా కలత చెందాడు. ఆగస్టు 31న ఇంట్లో తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతనికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే అతడిని కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ శనివారం మరణించాడు. ప్రోటీన్ పౌడర్ వల్ల వచ్చిన అలెర్జీతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. ఏదైనా సప్లిమెంట్ వాడే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: