భారత క్రికెట్ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) కు చెందిన ప్రతిభావంతమైన యువ క్రికెటర్ కంచన్ కుమారి ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం క్రీడా రంగాన్ని తీవ్రంగా కలచివేసింది. దేశవ్యాప్తంగా వివిధ క్రికెట్ టోర్నమెంట్లకు జట్లు సన్నద్ధమవుతున్న వేళ ఈ విషాదం చోటు చేసుకోవడం మరింత బాధాకరంగా మారింది.
కంచన్ కుమారి (Kanchan Kumari) చిన్న వయసులోనే తన ఆటతీరు ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రతిభ చూపుతూ జూనియర్ స్థాయిలో అనేక మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో అనేక విజయాలు సాధించిన ఆమె త్వరలో జాతీయ స్థాయిలో కూడా స్థిరపడతారని కోచ్‌లు, సహచర ఆటగాళ్లు విశ్వాసం వ్యక్తం చేసేవారు. కానీ అనుకోని రోడ్డు ప్రమాదం ఆమె కలలకే కాదు, క్రీడా రంగానికీ తీరని లోటు మిగిల్చింది.
క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, నిబద్ధత
కశ్మీర్ కన్వీనర్ ప్రకారం.. కంచన్ కుమారి ఓ క్రికెటర్‌గానే కాకుండా.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (Physical Education Teacher) గా కూడా సేవలందించారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె మృతిపై జమ్మూ కాశ్మీర్ డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ (YSS) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అనురాధ గుప్తా.. కంచన్ కుమారిని ఓ’సమర్థవంతమైన క్రీడాకారిణి’గా అభివర్ణించారు.
ప్రతిభావంతురాలైన యువ క్రీడాకారిణిని కోల్పోవడం మాకు తీవ్ర ఆవేదన
జమ్మూ కాశ్మీర్‌లో క్రికెట్, ఇతర క్రీడల అభివృద్ధికి ఆమె చేసిన కృషి అపారమని ఆమె కొనియాడారు.అనురాధ గుప్తా తన శోకసందేశంలో కంచన్ కుమారి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇంత ప్రతిభావంతురాలైన యువ క్రీడాకారిణిని కోల్పోవడం మాకు తీవ్ర ఆవేదన కలిగించింది. కంచన్ కుమారి జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌కు ఒక ఉజ్వల భవిష్యత్తును అందించేవారు. ఆమె అకాల మరణం మనందరికీ ఒక తీరని లోటు. ఈ విషాద సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు కంచన్ కుమారి కుటుంబ సభ్యులతో ఉంటాయి. ఈ భరించలేని బాధను తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: