భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని ఏడూళ్లబయ్యారం గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క గోరు గుచ్చుకోవడం వల్ల ఒక యువకుడు రేబిస్ బారిన పడి మృతిచెందాడు. గ్రామస్థుల సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన అందరినీ కలచివేస్తోంది.వివరాల్లోకి వెళితే,ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన సందీప్ అనే పాతికేళ్ల యువకుడు రెండు నెలల క్రితం ఒక కుక్కపిల్లను ఇంటికి తీసుకొచ్చాడు.
అయితే దానిని మచ్చిక చేసుకునే క్రమంలో సందీప్ తండ్రిని కుక్క కరిచింది. అదే సమయంలో అక్కడే ఉన్న సందీప్ (Sandeep) చేతికి కుక్క కాలి గోరు గుచ్చుకుంది. తండ్రికి వెంటనే చికిత్స చేయించిన సందీప్.. తన గాయాన్ని చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశాడు.గోరు గుచ్చుకున్న గాయం మానిపోయినా.. కొన్ని రోజుల తర్వాత సందీప్‌లో రేబిస్ లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి.
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు
జ్వరం, తీవ్రమైన తలనొప్పి, బలహీనత, అయోమయం వంటి లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. దురదృష్టవశాత్తు.. సోమవారం (సెప్టెంబర్ 22) నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.కుక్క కాటు లేదా గోరు గుచ్చుకోవడం ద్వారా సంక్రమించే రేబిస్ వ్యాధి (Rabies disease) అత్యంత ప్రమాదకరమని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమని
ఈ వైరస్ మెదడు, ఆ తర్వాత నాడీ వ్యవస్థ (nervous system) పై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సాధారణంగా కుక్క కాటు తర్వాత లక్షణాలు కనిపించడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుందని తెలిపారు. ఒకసారి జ్వరం, తలనొప్పి, గందరగోళం, నీటిని చూస్తే భయపడటం (హైడ్రోఫోబియా) వంటి లక్షణాలు కనిపిస్తే రోగిని రక్షించడం దాదాపు అసాధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
- కుక్క కరిచినా, గోరు లేదా పంటితో గాయం చేసినా వెంటనే దానిని సబ్బు, నీటితో బాగా కడగాలి. చిన్న గాయం కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి లేదా వైద్యుడిని సంప్రదించి రేబిస్ వ్యాక్సిన్‌ను తప్పకుండా వేయించుకోవాలి.
- పెంపుడు కుక్కలకు, పిల్లులకు క్రమం తప్పకుండా రేబిస్ వ్యాక్సిన్ (Rabies vaccine) వేయించాలి. ఇది వాటి ఆరోగ్యానికే కాకుండా కుటుంబ సభ్యులందరి రక్షణకు కూడా ఎంతో అవసరం.
- పెంపుడు కుక్కల గోళ్లు పొడవుగా పెరగకుండా నిపుణులైన వెటర్నరీ డాక్టర్లతో వాటిని కత్తిరించాలి.
- వీధి కుక్కలు లేదా అపరిచిత జంతువులకు దూరంగా ఉండాలి. వాటితో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: