పెళ్లి చేసుకుందామనే ఆశతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ఓ యువ జంట కథ విషాదాంతమైంది. వారి మధ్య తలెత్తిన ఓ వివాదం చినికి చినికి గాలివానలా మారి ప్రియురాలి ప్రాణాలను బలిగొంది. 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని అడవిలో పడేశాడు.
పెళ్లి కోసం వెళ్లిన గోవాలో విషాదాంతం
కర్ణాటకలోని ఉత్తర బెంగళూరు(Bengaloor)కు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22)(Sanjay Kevin M), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు (Bengaloor)నుంచి గోవా(Goa)కు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ తీవ్రమైన వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సంజయ్, రోష్నిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని దక్షిణ గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.
శవం లభించిన ప్రదేశం: ప్రతాప్ నగర్ అడవి
సోమవారం సాయంత్రం ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువతిని గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు. ఆమె రోష్ని మోసెస్‌గా గుర్తించారు. ప్రేమ వ్యవహారం, పెళ్లి ప్రతిపాదన, దానివల్ల తలెత్తిన గొడవే ఈ హత్యకు కారణమని దక్షిణ గోవా (Goa) ఎస్పీ టికమ్ సింగ్ వర్మ తెలిపారు.
24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్
మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు. వారికి లభించిన కీలక సమాచారం ఆధారంగా నిందితుడిని సంజయ్ కెవిన్(Sanjay Kevin M)గా గుర్తించారు. హత్య వెలుగుచూసిన 24 గంటల్లోపే సంజయ్ ఆచూకీని బెంగళూరులో కనిపెట్టి అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.
హత్యకు దారితీసిన అసలు కారణం ఏమిటి?
ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో వివాదానికి దారితీసిన అసలు కారణం, ఆరోజు జరిగిన సంఘటనలు, ప్లానింగ్ హత్యనా లేక హఠాత్ నిర్ణయమా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు. రోష్నీ మోసెస్ కుటుంబానికి ఈ వార్త తీవ్ర ఆత్మవేదనను కలిగించింది. పెళ్లి అనుకోగా, ఓ దుర్మార్గ ప్రేమికుని చేతిలో పాశవిక హత్యకు గురైంది.