సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో కలకలం సృష్టించిన దారుణ ఘటన చోటుచేసుకుంది.ఒక యువకుడి ప్రేమ, అతడిని అతనితోనే జీవితం గడపాలనుకున్న యువతి కలలను బలవంతంగా చీల్చేశారు.కుటుంబసభ్యుల ఒత్తిడి, కక్షల కారణంగా ఈ యువకుడిని చంపేందుకు కుట్ర పన్నిన కుటుంబసభ్యులు ఆయనను హతమార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి సమీపంలోని అలీ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సమీర్ (25) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.2023లో నాచారంలోని ఓ భవనంలో వెల్డింగ్ పనికి వెళ్ళిన సమయంలో అక్కడి యజమాని కుమార్తెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.యువతి అప్పట్లో డిగ్రీ మొదటి సంవత్సరాన్ని చదువుతూ ఉండగా, సమీర్‌తో ప్రేమను గడపాలని నిర్ణయించింది.కుటుంబ సభ్యులు ఈ ప్రేమకు అంగీకరించకపోవడంతో,జనవరిలో ఇద్దరూ అస్సాంకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత 20 రోజుల పాటు అక్కడే ఉన్నారు.అయితే, ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు వారికి పెళ్లి చెయ్యిస్తామని నమ్మబలికి తిరిగి హైదరాబాద్‌కు రప్పించారు.
సికింద్రాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత యువతి తల్లిదండ్రులు సమీర్‌పై ఒత్తిడి పెంచారు. యువతిని విడిచిపెట్టాలని సమీర్‌ను నొక్కడం మొదలుపెట్టారు.బలవంతంగా ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు.ఇదంతా జీర్ణించుకోలేకపోయిన సమీర్ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా,యువతి సోదరుడు ఉమర్ అతనిపై పగ పెంచుకున్నాడు.డిసెంబర్ 21న అర్ధరాత్రి దాటాక,సమీర్ ఆరుబయట కూర్చుని ఉండగా ఉమర్ తన మిత్రులతో కలిసి ద్విచక్రవాహనాలపై అక్కడకు చేరుకున్నాడు.అందరూ కలిసి సర్జికల్ బ్లేడ్లు,కత్తులతో సమీర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి అతడిని అక్కడికక్కడే హతమార్చారు.ఈ దారుణ ఘటనపై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నారాయణరెడ్డి, ఎస్సై శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం,యువతి సోదరుడు ఉమర్, అతని స్నేహితుల ప్రమేయం స్పష్టమైందని పోలీసులు తెలిపారు. సమీర్‌ను హతమార్చడం పక్కాగా పథకం ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు.ఇటువంటి సంఘటనలు సమాజంలో ప్రేమకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎదురవుతున్న నిర్దాక్షిణ్యానికి నిదర్శనం.