Cows : గోమాతల్లో పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గో సంరక్షణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోమాతల్లో ఉన్న ప్రత్యేకతను వివరించుతూ, అవి అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయని చెప్పారు. ఈ అయస్కాంత శక్తి సూక్ష్మ క్రిములను నిర్మూలించేందుకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. భిల్వారాలోని శంభుపురా గ్రామంలో తులసి గోశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కటారియా మాట్లాడుతూ గోవుల గౌరవం మన సంప్రదాయంలో భాగమని, వాటి సంక్షేమం కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. గోవుల సంరక్షణపై పరిశోధనలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

పూర్వం గోవుల సంరక్షణ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉండేవని, ముఖ్యంగా తల్లులు ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు.రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న కటారియా, గోవుల ప్రాముఖ్యతను ప్రపంచం త్వరలో గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో గోవులను సంరక్షించే రోజు వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గోవుల సంరక్షణ లేకుండా వ్యవసాయం నాశనమవుతుందని ఆయన హెచ్చరించారు.ఇక పాఠ్యాంశాల్లో గోవుల ప్రాముఖ్యతను చేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే గోవుల యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలి అనే అభిప్రాయాన్ని వెల్లడించారు.అవినీతిని నిర్మూలించడంలో ప్రధాని మోదీ కీలక భూమిక పోషిస్తున్నారని, ఆయన నాయకత్వం దైవ సంకల్పమని కటారియా అభివర్ణించారు. గతంలో పేదలకు చేరాల్సిన నిధులు అవినీతితో అడ్డుకట్టకు గురయ్యాయని, కానీ ఇప్పుడు మోదీ నేతృత్వంలో పారదర్శక పాలన అందుబాటులోకి వస్తోందని తెలిపారు.