📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The time when snow covers everything : మంచు ముంచే వేళలో…

Author Icon By Abhinav
Updated: December 8, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనకు ఉన్న ఆరు రుతువుల్లో చివరిదైన శిశిరానికి ఎంతో ప్రత్యేకత. వసంత, గ్రీష్మ,, వర్ష, శరత్, హేమంతాలతో పోలిస్తే దీనిది అంతటా విలక్షణత. మెండుగ ముండే ఎండలు, కుండపోత వర్షాలు, చుట్టూ దట్టంగా కమ్ముకునే మంచు (Snow)తీవ్రతను మించి ఉంటుంది చలికాలం.

విశేషించి డిసెంబరు నుంచి కొత్త సంవత్సరం మార్చి నెలదాకా అంతా శీతాకాల ప్రభావమే! వాతావరణ శాస్త్ర నిపుణుల ప్రకారం- ఈ అన్ని మాసాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు అత్యంత అల్పమే!

భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, శిశిర వర్ణనలు అలనాటి కావ్యాల్లో కనిపిస్తాయి. కుమార సంభవం, కవిరాజ మనోరంజనం, కళాపూర్ణోదయం, సమీరకుమార విజయం, రాజశేఖర విలాసం, రామరాయ విలాసం, తదితరాలు చలిగిలిని విపులీకరించాయి. శీత్యాంత నిపీడన, శిశిర సమయ కైవారం, సుశీతల శిశిర ఆగమనం, శిశిర కుసుమశోభ వంటి పదాలు ఈ కాల విభిన్నతను తేటతెల్లం చేస్తున్నాయి. ‘అమంద సుందర కుంద బృంద నిష్యందన్మరందపానా నందిత హృదయార విందేందిర సందోహ’ శిశిర సమయం అనేది కవి వర్ణన.

విపరీత తాకిడి

‘తుహిన బిందువుల్ జారెడి కాలము మహిని చల్లగ మార్చెడి కాలము పుష్యమిలో వచ్చే శీతాకాలము. చలిమంటలు వేసెడు కాలము నలువైపుల మంచు నిండు కాలము నిప్పు సెగవద్ద కూడెడి కాలము.

ఉహుహూ అని వణికే కాలము/దేహము ముడిచి నడిచే కాలము/దుప్పటిలో జనులు దూరెడి కాలము’.. అని కూడా కళ్లముందు నిలిపారు ‘శీతాకాలం’ కర్తలు. శీతరువు, చలికారు, శైత్యం అనేవి అప్పటి పదబంధ అర్థాలు. పుష్యమాసం అంటే చలికాలమే. తేమ నిండి ఉన్న రోజులివి. ప్రతికూల స్థితులకు అవకాశం ఎక్కువ. ఘనీభవనం, మంచు పేరుకుపోవడం, తుపాను తాకిడుల వంటివీ సంభవిస్తుంటాయి. వైరుధ్యాలు ఎంతో రివాజు. అనుభవంలోకి వచ్చేవే అన్నీ.

చలి రంపం అంటుంటాం. ఎముకలు కొరికేలా చేస్తుంది. గజగజా గడగడా వణికిస్తుంది. విపరీతంగా పెరిగే చలిధాటితో ప్రతీ ప్రాణీ వెచ్చదనానికే తహతహలాడుతుంది. పవలు, రేయి(పగలూ, రాత్రిళ్లు) కూడా కటకటా చలి జబ్బు అనిపించేలా చేస్తుంది. మరుల మంటలు రేపేలా చలి వెంటాడుతుంది. జంటకోసం అలమటింపచేసే వేడి తహతహ వేరు.

బక్కప్రాణి కోరుకునే వెచ్చని స్పర్శ తీరు వేరే. ఆరిన కుంపటి విధాన, దారి పక్కన కాళ్లు ముడుచుకుని పడుకుని, చలికి దడదడలాడటం! చలి ఒక పులి. అది పంజా విసిరితే ఇంకేముందీ?

దట్టంగా కప్పేసినట్లు ఉంటుంది మంచుముసుగు. అది ఉష్ణోగ్రత ఉన్నపళంగా పడిపోయిన విపరీత స్థితి. దిక్కుతోచని రీతిలోకి జీవితాన్ని నెడుతుంది. మన్యం ప్రాంతాలతో పాటు మహానగరాలైనా ఆ చలి గాలుల పెనుతాకిడికి తల్లడిల్లాల్సిందే.

ఉహుహూ… అంటూ అనుకుంటూ ప్రతి జీవి అల్లాడిపోయేంత విపత్కర పరిస్థితి. శీతాకాలం కోతపెట్టగ.. కొరడు కట్టీ, ఆకలేసి, కేకలేసిన దయనీయత ప్రత్యక్షమవుతుంది.దాని వాడిమి ఇంత, అంత అనలేనంత! బహు పదునుగా ఉంటుందది.

అధిక పీడనత్వం

ఎంతో కష్టతరమైన, కఠినాతికఠినమైన తరుణం శీతాకాలం. పగటి వెలుతురు తక్కువ. చూస్తుండగానే వాతావరణమంతా మారిపోతుంటుంది. ప్రధానంగా హిమాలయాలకు ఉత్తర ప్రాంతాల్లో అధిక పీడనత్వం ఏర్పడుతుంటుంది. ఖండాంతర గాలులు ప్రతాపాన్ని చూపుతుంటాయి. మంచు, చలిగాలులతో భిన్నమైన వాతావరణం చోటు చేసుకుంటుందన్నమాట. మన దేశంలోని ఉత్తరాదిన అయితే చలి ప్రభావ తీవ్రతర స్థితి రోజు రోజుకు విస్తరిస్తుంటుంది.

మరింత లోతుగా పరిశీలిస్తే-2014 తర్వాత గణనీయ తీరున చలి తీవ్రత ఉంది 2025 జనవరిలోనే! దశాబ్ద కాలంలో ఇదెంతో గమనార్హం. భౌగోళికంగా మనది ఐదు మండలాల ప్రాంతం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య మండల ప్రదేశాలు. హిమాలయ ప్రాంతాల్లో భారీ హిమపాతం ఈ సంవత్సరం సంభవించింది. ఆ మైదాన, పర్వత ప్రదేశాలన్నింటా పొగమంచు ఆవరించింది. చలచల్లగా మారిపోయింది అంతా. మొత్తం అత్యంత శీతలత్వం అనుభవానికి వచ్చినట్లయింది. వానలు, ఎండల మధ్యన వచ్చే చలి పలు పరిణామాలకు కారణం. ఉత్తర అర్ధగోళంలో వచ్చే శీతాకాలం డిసెంబరు నుంచి మూడు నెలల పర్యంతం గణనీయంగా ఉంటుంది. భూమికి తక్కువ సూర్యకాంతినీ శీతాకాల అయనాంతంగా పరిగణిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయనం అంటే మార్గం. సూర్యునికి సంబంధించిన దిశల దోవ. ఉత్తర, దక్షిణ ఆయనాలు. ఉత్తరాయనం అనేది భానుడు అటువైపు ప్రభావం కనబరిచే ఆరు నెలల కాలం. అది మకర సంక్రాంతితో ఆరంభమవుతుంది.. సహజంగా జనవరి 14 ప్రాంతాల్లో.

ఈలోపు సంభవమయ్యే చలికాల అయనాంతం సర్వసాధారణంగా డిసెంబరు 21 లేదా 22 తేదీల్లో. పగటి సమయం అతి తక్కువగా ఉండే రోజు. ఖగోళ శీతాకాలంగా భావిస్తుంటారు. ‘శీతాకాలం సూర్యుడిలా కొంచెం కొంచెం చూస్తావే’ అని కవిభావన! సూటిగా చూడటానికి/తాకడానికి విరుద్ధ రీతి. భూమికి, సూర్యునికి గరిష్ట దూరం వల్లనే: సూర్యకిరణాలు చేరడానికి బాగా సమయం పడుతుంది. ఉష్ణత ఎంతగానో తగ్గుతుంది. ఏడాదిలో ఇదెంతో విశేషం, విలక్షణం, విభిన్నం.. శీతాకాలం ప్రత్యేకం.

కొన్ని దేశాల్లో మరీ!

ఇతర దేశాల్లో ఎండవేడిమి ఉంటే, మరీ ముఖ్యంగా ఐదు చోట్ల మటుకు శీతలం వ్యాపించి ఉంటుంది. అవి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్. ఆయా ప్రదేశాల్లో శీతాకాల ప్రకంపనలు ఏర్పడటానికి మూలం వాతావరణం మార్పులు, చేర్పులే. స్పెయిన్లోని కానరీ దీవుల్లో విపరీత శీతల స్థితిగతులుంటాయి. వాటితో పోల్చి చూసినప్పుడు మన దేశంలో ఈసారి చలికాలం పులిపంజా విసిరింది. ఈశాన్యంలోని లాచుంగ్,

తవాంగ్, జులుక్ ప్రాంతాలన్నీ మంచుతో నిండాయి. పలు సరస్సులు ఘనీభవన దశకు చేరుకున్నాయి.

అరుణాచల ప్రదేశ్ లో హిమపాతం ఎంతో భారీగా పేరుకుపోయింది. ఉత్తరాదిన చలిగాలులు సరేసరి. లడజ్లోని ద్రాస్ ప్రాంతం అతి చల్లనిదీ, ఎవరూ భరించలేనిదీ. అక్కడ ఉష్ణోగ్రత అనేకానేక మైనస్ డిగ్రీలు. వాతావరణ మార్పును సూచించే ‘లానినా’ ఎన్నో విపరీతాలను వెల్లడి చేస్తోంది. వాయవ్య దిశ నుంచి వీచే చలిగాలులు ఢిల్లీలో ఎంత వణికించాయో మనకు తెలుసు.

దేశ రాజధానితో పాటు హరియాణా, పంజాబ్, ఇతర ప్రాంతాల్లో చలి పులిపంజా విసురుతూనే ఉంది. అనేక ఉత్తరాది ప్రదేశాల్లో శీతాకాల గాలుల తీవ్రత హడలెత్తిస్తోంది. వేడిమి కన్నా శీతల పవనాల ధాటి వల్లనే అనేక రెట్లు ఎక్కువగా ప్రాణనష్టం కలుగుతోంది. ఇదే అంశాన్ని భారత వాతావరణ శాఖ ఐదేళ్ల నక్రితమే గణాంకాలతో సహా వెల్లడించి, ముందు జాగ్రత్తలను సూచించింది. ముఖ్యంగా 2017-2020 ລ້ మరణాల సంఖ్యను ప్రస్తావించి,

తీవ్ర ఆందోళన వ్యక్తపరచింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చండీగఢ్ ప్రాంతాల్లోనూ చలిబెడద క్రమేపీ విస్తరిస్తోందని విపులీకరించింది ఆ శాఖ.

పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో కూడా చలిగాలులు విజృంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితీ ఆవేదన మిగులుస్తోందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆ మాటకొస్తే, ఇప్పటికీ పుష్కర కాలం క్రితమే ప్రభుత్వం చలిగాలుల తీవ్రత నష్టాలను జాతీయ విపత్తుగా గుర్తించింది. కష్ట-నష్టాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నతాధికారులు.. కార్యాచరణ ప్రణాళికనూ వెలువరించారు. ఉపశమన చర్యలు, విపత్తును సమర్థంగా ఎదుర్కొనే కార్యక్రమాలు ప్రాంతీయంగా ఇంకా బలోపేతం కావాలన్నదే వారి స్థిర అభిప్రాయం. ఆ మేరకు నివేదికలూ రూపొందించారు.

ఆగని మరణాలు

చిన్నపాటి ఇళ్లల్లో, పూరిపాకల్లో ఉండేవారు శీతల రక్కసి బారిన పడుతున్నారు. రోడ్డుపక్కన ఉంటూ జీవితాలను వెళ్లదీస్తున్న కష్టజీవులు చలితాకిడిని తట్టుకోలేక చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. జమ్ము-కాశ్మీరులో అటువంటి విషాదాలెన్నో మునుపు బయట పడ్డాయి. ‘వాతావరణ మార్పు-చేర్పులు కొన్ని సందర్భాల్లో ప్రాణ హరణానికి దారి తీస్తున్నాయి. క్షేత్ర స్థాయి వాస్తవాలను గ్రహించి, సకాలంలో సరైన విధంగా జాగ్రత్తలను తీసుకోవాల్సింది స్థానిక పాలన సంస్థలేనని ఢిల్లీలోని అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంటు బోర్డు ప్రతినిధి బిపిన్ గతంలోనే స్పష్టపరిచారు. జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో అప్రమత్తత అవసరాన్ని తేల్చిచెప్పారు. నష్ట నివారణకు చేయాల్సింది ఎంతో ఉందన్నది తన నిశ్చిత అభిప్రాయం.

రెండేళ్ల కిందటి విపత్కర స్థితిని గుర్తు చేసుకుందాం… అప్పట్లో కశ్మీరు ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల మైనస్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్కు పడిపోయాయి. అక్కడి దాల్ సరస్సు ప్రాంతంలోనైతే కొంత భాగంగా ఏకంగా గడ్డ కట్టుకుపోయింది! మరికొన్ని చోట్ల నీటి పైప్ లైన్లు సైతం గడ్డ కట్టేసాయంటే ఎంత విషాదమో అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. అసలే పేవ్మెంట్ల మీద జీవనం సాగించే నిరుపేదలెందరో నరకయాతన పాలయ్యారు. అన్ని రకాల సమస్యలూ చుట్టుముట్టినట్లయింది వారిని,

తెలుగు నేలలో…

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ చలిబెడద ఇంకా దడదడలాడిస్తోంది. ఎందరెందరినో గజగజ వణికించి, దారీ తెన్నూ తెలియనివ్వకుండా చేస్తోంది. కొద్ది రోజుల నక్రితం తెలంగాణలో అందునా రాజధాని నగరం హైదరాబాద్లో చలి చంపేసినంత పని చేసింది. ఉన్నపళంగా వాతావరణం మారిపోవడంతో గాలితేమ శాతం పూర్తిగా తగ్గడంతో అనారోగ్య స్థితులు దాపురించాయి. పెచ్చుపెరిగిన శీతల గాలుల బెడద రాష్ట్రంలో ‘ఎల్లో అలర్ట్’కు దారి తీసింది. అంటే వాతావరణ పరిస్థితుల వల్ల తలెత్తే విషమ పరిణామాల గురించి ముందుగానే హెచ్చరించడం. అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలూ తీసుకోవాలని ప్రజలందరినీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం, హిమపాతం వంటివి రోజువారీ పనులను అడ్డగిస్తాయనీ చెప్పడం!

ఆంధ్రప్రదేశ్ లో వణికించిన చలిపులి మొత్తం పరిస్థితినంతటినీ దుర్భరంగా మార్చింది. పొగమంచు దట్టంగా కమ్మివేయడంతో కొన్ని చోట్ల విమాన సర్వీసులూ చాలా ఆలస్యమయ్యాయి. రైలుసేవలు కొన్ని ప్రాంతాల్లో స్తంభించాయి. కొన్ని నగరాలు, పట్టణాలు గజగజలాడాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత భీతావహం రేకెత్తించింది. అరకులోయ, చింతపల్లి, పెదబయలు తదితర ప్రదేశాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలోనివి! ముంచంగిపుట్టులోనైతే మరింత దారుణ స్థితి.

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని చోట్ల విచిత్ర వాతావరణం ఉంది. చలి, వేడి ఒకేసారి ప్రభావం చూపించడం! వాతావరణంలోని ఈ మార్పు ప్రభుత్వం, పౌర బాధ్యతలను గుర్తు చేయడం లేదూ!

ఏం జరుగుతుంది?

వణికించే చలికాలం అనారోగ్యాన్ని మోసుకొస్తుంది. ఇళ్ల గదుల్లో ఎక్కువగా ఉండాల్సి రావడంతో శ్వాసకోశ వ్యాధులు ఆవహిస్తాయి. వైరస్ వ్యాప్తి ఒకరి నుంచి మరొకరికి జరిగిపోవడమే దీనికి కారణం.

చలి వాతావరణం పెచ్చుపెరిగి, మనలోని వ్యాధి నిరోధక శక్తిని సన్నగిల్లేలా చేస్తుంది. జ్వరాలు, జలుబులు సంక్రమించి బాధలకు గురి చేస్తుంటాయి. శీతల గాలుల ముట్టడి శరీరాన్ని బలహీనపరుస్తుంది. రక్తం మందంగా మారి గడ్డ కట్టేందుకు మూలమవుతుంది.

ఇన్ని ప్రభావాల ఫలితం గుండె మీద పడుతుంది. మెదడుతో పాటు శరీర ఇతర అవయవాలూ ప్రభావితమవుతుంటాయి. రక్తనాళాలు సంకోచానికి లోనవుతాయి. రక్తపోటు, హృదయ సంబంధ ఇబ్బందులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరడంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కండరాలు కుంచించుకుపోవడం, ఛాతీలో నొప్పి, దగ్గు వంటివీ ఎదురవుతాయి.

ఎలా జాగ్రత్త పడాలి?

కఠిన వాతావరణం కాబట్టి, శరీర పరంగా అదనపు జాగ్రత్త అవసరం. కాలానుగుణ వ్యాధుల గురించిన సదవగాహన పెంచుకోవాలి. చలి నుంచి రక్షించుకునేందుకు అనువైన వస్త్రధారణ, పరిసరాల శుభ్రత, ఆరోగ్యకర ఆహార అలవాట్లు ఎంతగానో ఉపకరిస్తాయి. జీవనశైలిని తగిన విధంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పని శారీరక శ్రమ మనల్ని బలవత్తరం చేస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం అనంతర ఉత్తేజానికి కారణమవుతుంది. చర్మం పొడిబారటం, కీళ్లనొప్పులు మొదలైన ముందు జాగ్రత్తలతో నియంత్రితమవుతాయి.

విటమిన్ ‘సి’ లభించే

పండ్లను ఆహారంగా తీసుకోవాలి. జామ, దానిమ్మ లాంటి పండ్లు అధికంగా తీసుకోవడం మంచిది. ఆకుకూరలు ఆరోగ్యదాయకం. ఇంట్లో తేలికపాటి వ్యాయామ విధానాలతో శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. రోజూ తగినంత నీరు తాగడం, విటమిన్ ‘డి’గా దోహదపడే సూర్యకాంతిలో నడక, మానసికంగా దిటవును అలవరచుకోవడం మరికొన్ని అత్యవసరాలు. ఇవన్నీ మనకు తెలియనివి కావు. అయితే ఆచరించడమే తెలియాలి. చిన్న అలవాట్లే పెద్ద ప్రయోజనాలు కలిగిస్తాయని అనుభవమే నిరూపిస్తుంది. కావాల్సింది ముందు జాగ్రత్త.. ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కోగల సంసిద్ధత. అంతే!

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh winter Climate Change cold waves Cold Weather extreme winter fog conditions fog disruptions Google News in Telugu heavy snowfall Himalayan snowfall Immunity Boost India's winter Latest News in Telugu low temperatures respiratory infections Shishira season Telangana winter Telugu News Today winter climate winter deaths winter health issues winter lifestyle winter precautions winter safety tips winter season

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.