హెల్త్ డిపార్ట్మెంట్ కు సవాల్ గా నిలుస్తున్న సీజనల్ వ్యాధులు ప్రతి సంవత్సరం ప్రబలుతున్నాయంటే దానికి కారణాలనేకం. జనాభా పెరుగుదల, శీఘ్ర పట్టణీకరణం, డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం, ప్రయాణికుల సందడి, గ్లోబల్ వార్మింగ్, (Global warming) అనారోగ్య అలవాట్లు, శారీరక, మానసిక ఒత్తిడి మొదలైనవి కాలానుగుణ మార్పులు. ఇవి మన జీవితంలో సహజంగా ముడిపడి ఉండడంతో ప్రతి సంవత్సరం పిల్లలు, పెద్దలు సీజనల్ ఫీవర్స్ తో బాధపడడం కూడా సహజమైపోయింది.
సీజనల్ వ్యాధులపై ప్రజల్లో ఎంత అవగాహన పెంచినా, పెరిగినా వీటిని
అరికట్టడంలో ప్రజలు, ప్రభుత్వాలు వైఫల్యాల్ని చవిచూస్తూనే ఉన్నారు. అయితే వీటివల్ల ఇన్ఫెక్షన్స్ పెరగడం లేదా ఆరోగ్యం సరిగా లేకపోవడం అని అర్థం కాదు. ఈ మార్పులు ఎలా రోగనిరోధక వ్యవస్థని ప్రభావితం చేస్తాయో అర్ధం చేసుకోవడం ద్వారా, మీ శరీరానికి మద్దతు ఇవ్వడానికి, అనారోగ్య ప్రమాదాల్ని తగ్గించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో తెలియచేయడమే సీజనల్ ఫీవర్స్ కవర్ స్టోరీ కథనం.
సముద్రం, భూమి పీడన వ్యత్యాసం వల్ల రుతువులేర్పడతాయి. ప్రతి రుతువు రెండు నెలల కాలవ్యవధిని కలిగి ఉంటుంది. రుతువుల్నే సీజన్స్ అని అంటారు. ఇలా ప్రతి రుతువులో కలిగే వాతావరణంలోని మార్పులకనుగుణంగా అనేక వ్యాధులు ప్రబలుతుంటాయి. వీటినే ‘సీజనల్ డిసీజెస్’ అని అంటారు. ఇవి చిన్న జలుబు, దగ్గు నుండి ప్రాణాంతకమైన వ్యాధులైన స్ట్రోక్,
మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ (infection) బ్రెయిన్ ఫీవర్ వరకు ఉంటాయి. ఇది సీజనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది.
వేసవి తాపాన్ని తగ్గించే వర్షాలు జూన్ నుండి అక్టోబరు వరకు కురుస్తాయి. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు రావడం వల్ల వీటినే వర్షాకాల వ్యాధులు, రెయినీ డిసీజెస్, గ్రీన్ డిసీజెన్, రుతుపవన వ్యాధులు, మాన్సూన్ డిసీజెస్ అని వ్యవహరిస్తారు. మాన్సూన్ అనేది పోర్చుగీస్ పదం. మొనాకో, అరబిక్ మౌసిమ్ డబ్ పదం. మానూన్ నుండి వచ్చింది. దీని అర్థం సీజన్. కాబట్టి వీటినే సీజనల్ వ్యాధుల్లో రకంగా భావిస్తారు.
ప్రకృతిలో మనిషి మనుగడకు ముఖ్యమైనవి గాలి, నీరు, ఆహారం, ఇవి కలుషితమైనప్పుడు ఏ వయస్సు వారైనా అనారోగ్యానికి గురవుతారు. దీనికి ముఖ్య కారణం సూక్ష్మజీవులే. వాతావరణ మార్పులకు జ్వరం రావడానికి సంబంధం ఉంది. జ్వరం అనేది అనారోగ్యానికి శరీరం సహజ ప్రతిస్పందన అని చెప్పాలి.
నార్మల్, మన శరీర ఉష్ణోగ్రత 36.5-37.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీన్నే నార్మోథెర్మియా, యుథెర్మియా అంటారు. హైపోథాలమస్లోని శరీర థర్మోరెగ్యులేటరీ సెంటర్ ద్వారా నియంత్రించబడే సెట్ పాయింట్ కంటే ఒక వ్యక్తి ప్రధాన శరీర ఉష్ణోగ్రత పెరగడం. దీనికి ఎండోజెనస్ లేదా ఎక్సోజెనస్ పైరోజెన్స్ కారణం. జ్వరం ఇన్ఫెక్షన్ లేదా ఇతర శారీరక ఆరోగ్య స్థితితో ముడిపడి ఉంటుంది.
జ్వరం వ్యాధి అత్యంత పురాతన లక్షణం అని హిపోకాట్రిస్ట్ కాలంలో గుర్తించారు. సాధారణ ప్రజలు జ్వరాన్ని దుష్టశక్తులు ప్రేరేపించిన శిక్షకు లేదా మరణానికి గుర్తుగా భయపడేవారు. 1815-1910లో మొదట రీన్ హోల్డ్ వుండర్చ్ జ్వరం అనే పదాన్ని నిర్వచించాడు. ఇది నాగరికత కాలం నాటిదని చెప్పవచ్చు.
జ్వరం వ్యాధి కాదు. ఇది అనేక వ్యాధుల్లో కనిపించే సర్వసామాన్య లక్షణం. ప్రతి జ్వరాన్ని ఒకే రకంగా ఊహించే అవకాశం లేదు. జ్వరం స్వస్థతకు ఆటంకమవుతుందా? దోహదమవుతుందా? అనేది వివాదాంశం. జ్వరం రోగిలో రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.
ఇది శరీరంలోని సహజమైన రోగ నిరోధక శక్తి రోగాల వైరస్లతో, బాక్టీరియా, ఫంగస్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ లో జరిపే పోరాటంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది అంతర్యుద్ధం లాంటిది. రోగ స్థితి నుంచి కోలుకోవడంలో ప్రయోజనకరమైన, ప్రధానమైన భాగంగా జ్వరాన్ని పరిగణించాలి. అది అపాయకరంగా మారుతున్నదనుకుంటే
తప్ప దాన్ని అణిచివేయకూడదు. సీజనల్ జ్వరం మూడు ప్రధాన దశలుగా సాగుతుంది.
ప్రారంభ దశ: రోగ నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాలకు ప్రతిస్పందించినప్పుడు ఇది క్రమంగా లేదా అకస్మాత్తుగా పెరగవచ్చు.
స్థిరమైన దశ: జ్వరం గరిష్ట ఉష్ణోగ్రతకు చేరి కొంత కాలం అధిక, స్థిరంగా ఉండడం. ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి మీ శరీరం అధిక ఉష్ణోగ్రతని నిర్వచించవచ్చు.
తిరస్కారణ దశ: ఉష్ణోగ్రత సాధారణ స్థితికి క్రమంగా లేదా ఆకస్మాత్తుగా సంభవిస్తుంది.
జ్వరంలో చలి, వేడి, చెమటలు పట్టడం అనేవి మూడు ప్రధాన అంశాలు. సీజనల్ జ్వరాలు ఐదు రకాలుగా వస్తుంటాయి.
అడపా దడపా వచ్చే జ్వరం: దీంట్లో హెచ్చుతగ్గులుంటాయి, వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. జ్వరం 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఎక్కువ రోజులుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
నిరంతర జ్వరం: శరీర ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ వైవిధ్యాలతో ఉండి సాధారణ స్థితికి రాకుండా స్థిరంగా పెరుగుతుంది. కాబట్టి జ్వరానికి గల కారణాన్ని తెలుసుకోవాలి.
రెమిటెంట్ జ్వరం: ఇది ఆగి ఆగి రెండు డిగ్రీల కంటే ఎక్కువగా ఉండి- ఉదయం, సాయంత్రం మధ్య వస్తుంది. ఎప్పుడూ సాధారణ స్థితికి రాదు.
రిలాప్సింగ్ జ్వరం: కొంత కాలం తర్వాత మళ్లీ వచ్చే జ్వరాలు, కొన్ని రోజులు, వారాలకి తిరిగి వస్తాయి.
హెక్టిక్ జ్వరం: రోజంతా హెచ్చుతగ్గులుంటాయి.
దీర్ఘకాలిక రుగ్మతల్ని ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీసే వాటివల్ల జ్వరం ఒక పట్టాన తగ్గదు. ఒత్తిడి, నిద్ర విధానాల్లో మార్పులు, మందులు కూడా శరీర ఉష్ణోగ్రతలో మార్పులకు కారణం వల్ల మందులు వాడిన తర్వాత పదే పదే జ్వరం వస్తుంది. జ్వరం తగ్గకపోతే మీరు చికిత్స చేయని ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నట్లు గుర్తు. తరచుగా రాత్రిళ్లు జ్వరం ఎక్కువ ఉండడానికి కారణం కార్టిసాల్ లెవెల్స్ తగ్గడమే. ఇవి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి వస్తుంది. ఈ అనారోగ్యాలు అసౌకర్యాన్ని కల్గిస్తాయి. అంతేగాకుండా రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. సరైన నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో సీజనల్ జ్వరాల ప్రమాదాల్ని తగ్గించవచ్చు.
కారణాలు: వాతావరణంలోని మార్పులు సూక్ష్మజీవుల వృద్ధికి అనువుగా ఉంటాయి. చెత్తా చెదారం ఎండకు ఎండి పొడిగా తయారై గాలిలో, వర్షం నీటిలో కలిసిపోతాయి. డ్రైనేజీలు, కాలువల్లో వాడుక నీరు పోవడానికి సరైన సదుపాయాలు లేక వర్షంనీటితో నీరు నిల్వ ఉండి రోడ్ల పైకి రావడం జరుగుతుంది. గుంతలు, రోడ్ల పక్కన, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమల లార్వాలు వృద్ధి చెందుతాయి. దీంతో వర్షాకాలంలో దోమలు, ఈగలు, బొద్దింకలు వంటి చిన్న చిన్న క్రిమికీటకాల బెడద ఎక్కువవుతుంది.
వాతావరణంలోని తేమ, జెర్మ్స్ బాక్టీరియా బ్రీడింగ్కు అనువుగా ఉంటుంది. మంచినీటి వనరులు, ట్యాంకులు, భూగర్భ జలాలు, వర్షంనీరు మురికినీరుతో చేరడం వల్ల నీరు కలుషితం అయిపోతుంది. దోమలు కుట్టడం వల్ల, ఈగలు ఆహార పదార్థాలపై వాలడం వల్ల, శానిటేషన్ సరిగా లేకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఆహార పదార్థాలు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షంలో తడవడం వల్ల, తడిబట్టల వల్ల, పాచి పట్టడం వల్ల బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువవుతాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కాలుష్యం ఎక్కువవడం వల్ల ఎలర్జీస్ ఎక్కువవుతాయి.
వర్షాకాలం రైతులు పంటలు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. నేల తొలకరి జల్లులకి తడవడం వల్ల వచ్చే వాసననే మట్టివాసన లేదా పెట్రికర్ అని అంటారు. రైతులు మట్టిలో ఎక్కువగా ఉండడం వల్ల కూడా వ్యాధులు వస్తాయి. వేసవిలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం, చెత్తా చెదారం బయట పడేయటం, ఆరుబైట మలమూత్ర విసర్జన చేయడం వల్ల సూక్ష్మజీవులు వర్షం నీటిలో చేరి వృద్ధి చెంది వ్యాధుల్ని కలిగిస్తాయి. వరదలు రావడం కూడా మరో ముఖ్య కారణం.
ఇండియా, థాయ్ లాండ్, మలేషియా, నేపాల్, వియత్నాం దేశాల్లో సీజనల్ ఫీవర్ ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో లక్నో, ఉత్తరాఖండ్, అస్సాం, కర్ణాటక వంటి కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉండడం వల్ల. వర్షంనీరు, వరదనీరు ప్రాజెక్ట్లోని అత్యధిక నీరు పల్లపు ప్రాంతాలకి(దిగువ) వదిలేయడం వల్ల నీటి కాలుష్యం. ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా మరో ముఖ్య కారణం. స్త్రీ, పురుషులిరువురిలో 1:2 నిష్పత్తిలో వ్యాధులు వస్తున్నాయని ఇన్ఫెక్షన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ముఖ్యంగా జ్వరాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ 71.2 శాతం వస్తాయి. స్త్రీలలో 45.8 శాతం, పురుషుల్లో 54.2 శాతం ఉంటుంది.
స్త్రీలలో 45.8 శాతంగా ఉంటుంది. వర్షాకాలంలో ఎపిడమిక్ వ్యాధులు, మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ప్రతి సంవత్సరం 5-78 మిలియన్స్ మంది సీజనల్ ఫీవర్స్ తో బాధపడుతుంటారు.
ఇది సీజనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాంప్లెక్స్ రిలేషన్షిప్ (వాతావరణం-సూక్ష్మజీవులు) కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రతలో మార్పులు, నీటిసాంద్రత, తేమ, ప్రజల స్థితిగతులు, అలవాట్లు సూక్ష్మజీవుల వృద్ధికి దోహదపడే పరిస్థితులు, అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- హ్యుమన్ ఆక్టివిటీ: జన సమర్థ్యమున్న ప్రాంతాలు,
గాలి, వెలుతురు, మురికివాడలు, ఎడారి ప్రాంతాలు, మంచు ప్రాంతాల్లో రండడం, టెంపరేచర్లో మార్పులు, సీజనల్ ఎన్విరాన్మెంటల్ మార్పులు, సీజనల్ క్లోతింగ్ స్టయిల్స్, హ్యుమన్ బిహేవియరల్ ఎఫెక్ట్స్, ఫిజికల్ ఆక్టివిటీలో మార్పులు మొదలైన అంశాలు సీజనల్ ఛేంజ్స్ ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల గాలి, కాంటాక్ట్ వల్ల ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తాయి. ఫిజికల్ ఆక్టివిటీ వేసవి, వసంత కాలంలో ఎక్కువగా ఉంటే, చలికాలంలో తక్కువగా ఉంటుంది. పిల్లలకి స్కూల్స్, సమ్మర్ క్యాంప్స్ లో హాస్టల్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఇది సోషల్ ఎకనమిక్ కండిషన్స్ పై ఆధారపడి ఉంటుంది. - పాథోజెన్స్ ఇన్ఫెక్టివిటీ: ఇది టెంపరేచర్, డీహైడ్రేషన్, యువిలైట్, ఆక్సిజన్ కాన్సన్టేషన్, తేమ, చిత్తడి, పొడి వాతావరణాన్ని బట్టి ఉంటుంది.
ఉదా: ఈకోలై తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో, పోలియో వైరస్ ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో ఎఫెక్ట్ అవుతుంది. పాక్సో వైరస్ అననుకూల పరిస్థితుల్లో కూడా చాలా నెలలు జీవించి ఉంటుంది. క్షయ వ్యాధిని కలిగించే మైకోబాక్టీరియమ్ ట్యూబర్క్యులె బాసిల్లె డీహైడ్రేషన్స్ వున్నటువంటి ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్లో కూడా జీవిస్తుంది. ఇది వాటి కణకవచం కాంప్లెక్సిటీ, కాంపోనెంట్ నేచర్ని బట్టి ఇన్ఫెక్టివిటీ, హోస్ట్ రెసిస్టెన్సీ పవర్ని బట్టి ఉంటుంది.
- ఇమ్యూనిటీ సిస్టమ్ ఫంక్షన్: ఇది దేశ కాల ప్రాంత పరిస్థితుల్ని బట్టి మారుతుంది. ఉదా: మెనింగోకాకల్
ఇన్ఫెక్షన్స్ పొడి వాతావరణం ఉన్న ఆఫ్రికాలో ఎపిడమిక్గా ప్రబలుతాయి. శ్వాసకోశ వ్యాధుల్ని కలిగించే వైరస్ చలికాలంలో, మంచుకాలంలో ఎక్కువగా కనిపిస్తే: సింగపూర్లో వేసవి కాలంలో ఎక్కువగా కనిపించడం విశేషం. ఇది సీజనల్ వేరియేషన్ని బట్టి, పొల్యూషన్ని బట్టి, దుమ్ము, ధూళి వంటి ఎలర్జీస్ని బట్టి, పాథోజెన్స్ మైక్రోసిలియరీ పనితీరుని బట్టి మారుతుంది.
చలికాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ ఫంక్షన్ తక్కువగా ఉంటుంది. సూక్ష్మజీవుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొనే తెల్ల రక్తకణాలపై కూడా కూడా ప్రభావం ఉంటుంది. చలికాలంలో తక్కువగా, వేసవిలో ఎక్కువగా వీటి ప్రభావం ఉంటుంది. బి కణాలు చలికాలంలో, టి కణాలు వసంత కాలంలో, సిడి8 కణాలు వర్షాకాలంలో పెరుగుతాయి. సిడి4 టి లింఫోసైట్స్ వేసవిలో తగ్గితే, సిడి8 టి లింఫోసైట్స్ వేసవిలో పెరుగుతాయి. పశ్చిమ ఆఫ్రికా పిల్లల్లో సిడి4, సిడి8, కణాల నిష్పత్తి వేసవిలో పెరిగితే, వర్షాకాలంలో తగ్గడం విశేషం. అడ్రినో కార్టికల్ హార్మోన్ ఆక్టివిటీ చలికాలంలో ఎక్కువగా ఉంటే, వేసవిలో తక్కువగా ఉంటుంది. వాతావరణంలోని మార్పులకనుగుణంగా సీజనల్ మార్పులను బట్టి ఇమ్యూనిటీ ఫంక్షన్లో మార్పులు కలుగుతాయి. - విటమిన్ డి లెవెల్స్: దీన్నిబట్టి కూడా సీజనల్ మార్పులు కలుగుతాయి. ఎన్కా కణాలు చలికాలంలో ఎక్కువవుతాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడం, ఎక్కువసేపు ఇంట్లో ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం వల్ల శరీరంలో
విటమిన్ డి లెవల్స్ తగ్గుతాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. వేసవి, వసంత కాలంలో విటమిన్ డి లెవల్స్ ఎక్కువగా ఉండడం, హ్యుమన్ ఆక్టివిటీ ఎక్కువగా ఉండడం వంటివి శరీర ఆరోగ్యంపై భౌగోళిక పరిస్థితులు ప్రభావం
చూపుతాయి. ఉదా: సైప్రస్, మెడిడేరియన్ ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వేడి ఉంటుంది. ఫిలిప్పైన్స్లో రెండు సీజన్స్ ఉంటాయి. భారతదేశంలో ఉత్తర దేశం కాన్న దక్షిణ భారతదేశంలో వేడి ఎక్కువగా ఉంటుంది. - హార్మోన్ల సీజనాలిటీ: ఇది ఎన్విరాన్మెంట్ ఛేంజ్స్, వెలుతురు, చీకటి, తేమ, పొడి వాతావరణాన్ని సూక్ష్మజీవులు ప్రభావితం చేసేదాన్ని బట్టి సెల్యులార్, హ్యుమరల్ ఇమ్యూనిటీలో తేడా వస్తుంది. దీనివల్ల మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్స్ లో తేడా వస్తుంది. స్త్రీలలో హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల బహిష్టు లోపాలు, పిసిఓడీలు కలుగుతాయి. వాతావరణానికి అనుగుణంగా శరీరంలో సైటోకిన్స్ తెల్ల రక్తకణాలు, బిటిఎన్కె కణాలు, ఆంటిబాడీస్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది.
రకాలు: సీజనల్ ఫీవర్స్ ని నాలుగు రకాలుగా విభజించవచ్చు
- ఆహారం వల్ల వచ్చే వ్యాధులు: ఉదా: కలరా, టైఫాయిడ్, విరేచనాలు, హెపటైటిస్ ఎ,బి.
- వెక్టర్ వల్ల వచ్చే వ్యాధులు: ఉదా: మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, ఫెలేరియా, హెమరేజిక్ ఫీవర్స్,
- వర్షంలో తడవడం వల్ల వచ్చే వ్యాధులు: లెప్టోస్పీరోసిస్, హైపోథెర్మియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, జలుబు, ఆస్త్మా, చర్మవ్యాధులు.
- వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్: తేమ, చిత్తడి వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఉదా: జలుబు, వైరల్ ఫీవర్స్, న్యుమోనియా, స్వైన్ఫ్లూ జ్వరాలు మొదలైనవి.
జ్వరం వచ్చినప్పుడు గమనించాల్సి విషయాలు
1) జ్వరం ఏ విధంగా ఆరంభమైంది? సడన్ gaa: ఇన్ఫ్లుయెంజా, న్యుమోనియా, డెంగ్యూ: గ్రాడ్యువల్గా : టైఫాయిడ్, క్షయ.
2) చలిగా ఉందా? లేదా? (మలేరియా) 3) తలనొప్పి ఉందా? లేదా? (మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్, టైఫాయిడ్); 4) బాడీ పెయిన్స్ (డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా):
5) అధిక చెమటలు: రుమాటిక్ ఫీవర్, టి.బి. మలేరియా:
6) ఫిట్స్ (మెనింజైటిస్, సెరిబ్రల్ మలేరియా.:
7) డెలీరియం: టైఫాయిడ్, ప్లేగు, న్యుమోనియా, మెనింజైటిస్;
8) విరేచనాలు: టైఫాయిడ్, మాలిగ్నెంట్ మలేరియా, అల్సరేటివ్ కొలైటిస్, గ్యాస్ట్రో ఎంటరైటిస్:
9) వాంతులు: మలేరియా, మెనింజైటిస్, అపెండిసైటిస్, గ్యాస్ట్రో ఎంటారైటిస్:
10) గొంతునొప్పి: స్కార్లెట్ ఫీవర్, డిప్తీరియా, లుకేమియా, గ్లాండ్యులార్ ఫీవర్:
11) తరుచు యూరిన్ రావడం ప్రైలోనె ప్రయిటిస్, సిస్టయిటిస్, కిడ్నీ ట్యూబర్క్యులోసిస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్.
ఇవేగాక టెంపరేచర్, పల్స్, శ్వాసక్రియ, రాష్, రక్తహీనత, రక్తస్రావాలు, క్లబ్బింగ్ ఫింగర్స్, లింఫ్ గ్రంథుల వాపు, జాండిస్, టాక్సేమియా, ఆకలిలో హెచ్చుతగ్గులున్నాయా? అనేది గమనించాలి. అలాగే జ్వరం ఏ రకం రెమిటెంట్, ఇంటర్మిటెంట్ (మలేరియా, కాలాఆజర్), కంటిన్యూడ్ ఫీవర్(టిక్ ఫీవర్, ఎన్సెఫలైటిస్, బొరిలియా), హెక్టిక్, రిలాప్సింగ్ ఫీవర్ అని తెలుసుకోవాలి.
సీజనల్ ఫీవర్స్ తో బాధపడేవారిలో కనిపించే మార్పులు
పల్స్ రేట్ పెరగడం, కార్డియాక్ ఔట్ పుట్ పెరగడం, డయాస్టలిక్ ప్రెషర్ తగ్గడం, ఎక్కువసేపు స్థిమితంగా కూర్చోలేకపోవడం, ఫెయింట్ కావడం, హైపర్ అప్పియా, యూరిన్ శాతం తగ్గడం, జీర్ణశక్తి లోపాలు, మెటబాలిజమ్ రేటు పెరగడం (ఒక డిగ్రీకి 7 శాతం పెరుగుతుంది). శ్వాస వేగం పెరుగుతుంది. నెగటివ్ నెట్రోజెన్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. డీహైడ్రేషన్, పల్స్ రేట్, శ్వాసవేగం ఎక్కువగా ఉంటుంది.
గుండెదడ, నిద్రలేమి, ప్లాస్మాక్లోరైడ్ లెవల్స్ పడిపోతాయి.
కాంప్లికేషన్స్: వ్యాధి తీవ్రతని బట్టి మెదడులో రక్తస్రావం కలగడం, లివర్, స్క్రీన్ పెద్దదవడం, రక్తనాళాలు దెబ్బతినడం, సెరిబ్రల్ మలేరియా, లివర్ పని చేయకపోవడం, న్యూమోనియా రక్తస్రావాలు, జీర్ణశక్తి లోపాలుంటాయి. డీహైడ్రేషన్, డెలీరియం, కోమా, కీళ్లనొప్పులు, చెవుడు, బ్రాంకైటిస్, ఎలర్జీస్ వంటి. కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. వీటివల్ల మరణాల సంఖ్య కూడా ఉంటుంది. డెంగ్యూ(1.1 శాతం), టైఫాయిడ్(1.7 శాతం), మలేరియా(0.26 శాతం), స్క్రబ్ టైఫస్ వల్ల 0.09 శాతం, స్వైన్ఫ్లూ (2.5 శాతం), విరేచనాలు(10-15 శాతం) వంటి వ్యాధుల వల్ల మరణాలు సంభవిస్తాయి.
జాగ్రత్తలు
పిల్లల్లో సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ అపరిపక్వంగా ఉన్నందున తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వీరిలో నోరు, నాలుక ఎండిపోవడం, నీరసం, మూత్ర విసర్జన తక్కువగా లేదా తరుచుగా వస్తుంది. ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు రావు. వీరి నెత్తిన బ్రహ్మరంధ్రాలు త్వరగా పూడుకోక ఉబ్బెత్తుగా ఉంటాయి. ప్రవర్తనా లోపాలుంటాయి. వీరు అనారోగ్యంగా మగతగా ఉంటారు. పాలు తాగక సతాయిస్తుంటారు.
అలాంటప్పుడు వీరికి ఉడికించిన బంగాళాదుంపలు, అరటి, ఆపిల్, పుచ్చకాయ ఇవ్వవచ్చు. పెరుగన్నం పెట్టవచ్చు. పాల ఉత్పత్తుల్ని తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. అరగని పదార్థాలైన గుడ్డు, జున్ను, చికెన్, గింజెల్ని ఇవ్వరాదు. తేలికైన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- వర్షాకాలంలో తడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా, పొడిగా ఉండాలి. దమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న మురికి ప్రాంతాల్లో ఉండరాదు. స్నానం చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు నీళ్లు మింగరాదు.
- వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగాలి. లేదా ఫిల్టర్ నీరు/మినరల్ వాటర్ తాగాలి.
- తుమ్మేటప్పుడు,
దగ్గేటప్పుడు మాస్కులు ధరించాలి.
- గొంతునొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని పుక్కిలించాలి. వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం.
- ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఉప్పు నీటిలో 10-15 నిమిషాలుంచి శుభ్రం చేసిన తర్వాత వాడుకోవాలి.
- పెంపుడు జంతువుల్ని శుభ్రంగా ఉంచాలి. వాటి మలమూత్రాల్ని ఎప్పటికప్పుడు ఎత్తివేసి శుభ్రం చేయాలి.
- దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా, వాటి వ్యాప్తిని అరికట్టాలి. అవి కుట్టకుండా, వాలకుండా చూసుకోవాలి. వేపాకు పొగ పెట్టడం, మస్కిటో రిపెల్లెంట్స్, దోమతెరలు, మెష్‌లు వాడాలి.
- తాగి పడేసిన, వాడి పారేసిన కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, టైర్లు, పగిలిన పెంకులు, డబ్బాలు, ఎయిర్ కూలర్లు, పూలకుండీల్ని నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి.
- శానిటేషన్ చాలా ముఖ్యం. చెత్తా చెదారం దూరంగా పారవేయాలి. దోమలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విశ్రాంతి అవసరం. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. యూకలిప్టస్ ఆయిల్, కాంఫర్ లేదా విక్స్ బామ్ కర్చీఫ్ పై వేసుకొని తరుచు పీల్చడం వల్ల నాసల్ కంజేషన్, ఇరిటేషన్ తగ్గుతుంది.
- ఆహారంపై ఈగలు వాలకుండా చూసుకోవాలి. దానిపై దుమ్ము, ధూళి పడకుండా మూతలు పెట్టాలి. రోడ్డుపక్కన అమ్మే పానీపూరీలు, జంక్‌ఫుడ్ తినరాదు. పాలు, పండ్లు, హెర్బల్ టీ, జ్యూస్, సూప్స్, సలాడ్స్ ఇంట్లోనే తయారు చేసుకొని వాడాలి.
- నాన్ వెజ్ వంటకాల్ని తగ్గించి తీసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లు, ఐస్‌క్రీమ్స్, పండ్లు తీసుకోరాదు. డ్రైనేజీలు కాలువల్లో దుమ్ము, చెత్తా చెదారం రసాయనాలు కలిసిన నీరు పోవడానికి సరైన సదుపాయాలు కల్పించాలి. బ్లీచింగ్ పౌడర్, మలాథియన్ స్ప్రే చేయాలి. నీరు నిల్వ ఉండకుండా చేయాలి. వాటర్ ట్యాంకుల్లోని నీటిని క్లోరినేషన్ చేయాలి. ఇంట్లో ఎలుకలు, బొద్దింకలు, క్రమికీటకాలు లేకుండా చూసుకోవాలి. రోజూ బాత్రూమ్స్, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోవాలి. తాగునీటి వనరుల్లో పశువుల్ని కడగడం, బట్టలు ఉతకడం చేయరాదు. గుంటలు, చెరువులు, కాలువల్లోని నీళ్లు తాగరాదు.
- గొడుగులు, రెయిన్ కోట్లతో పాటు మాస్కులు, కాళ్లకి షూస్ ముఖ్యం. చెప్పులు లేకుండా నీళ్లలోకి వెళ్లకూడదు. కరెంటు వైర్లు తెగిపడినప్పుడు షాక్ తగులుతుంది. కాబట్టి
గాలి, వానకు కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. - తడిబట్టలు వేసుకోరాదు. పొడి బట్టలు, తేలికైన దుస్తులు ధరించాలి. వర్షంలో తడిసి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఆవిరి పట్టుకోవాలి. రోజూ గోల్డ్ మిల్క్, హెర్బల్ కషాయాలు, ఇమ్యూన్ బూస్టర్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. తేనె, అల్లం టీ, లెమన్ టీ తీసుకోవచ్చు.
- కారం, నూనెవస్తువుల్ని, ప్రాసెస్ చేసిన ఆహారాల్ని. ఎలర్జీ, ప్రతిచర్యలకు కారణమయ్యే ఆహారాన్ని మానివేయాలి.
- ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండాలి.
- విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు గల సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
- జ్వరం ప్రమాదకరం కాని పరిస్థితి అయినప్పటికీ దాన్ని అదుపులో ఉంచడానికి తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం.
- క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థని పెంచవచ్చు. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ఆంటీబాడీలు తయారవుతాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా స్పాంజింగ్ చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతని తగ్గించి జ్వరాన్ని కంట్రోల్ చేయవచ్చు.
- పాదాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిక్స్, ఎలర్జీ, హైపర్ సెన్సి విటీ ఉన్నవారు.
- వైరల్ ఫీవర్స్, జ్వరాలు వచ్చినప్పుడు వ్యాధి లక్షణాల్ని బట్టి, కారణాన్ని బట్టి సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. రోగిని ప్రత్యేకంగా ఉంచి విశ్రాంతి తీసుకోవడం వల్ల (సెల్ఫ్ ఐసోలేషన్) వ్యాధి ఇతరులకి వ్యాపించకుండా ఉంటుంది. పారిశుద్ధ్యం లోపించకుండా, అపరిశుభ్రత పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. గుంతల్ని ఎప్పటికప్పుడు పూడ్చివేయాలి. నీరు నిల్వ లేకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
- సాధ్యమైనంతవరకు పబ్లిక్ ప్లేసెసికి, షాపింగ్ మాలికి, జన సమర్థ్యమున్న ప్రాంతాలకి వెళ్లరాదు. ఇవి ఇన్ఫెక్షువస్ డిసీజెస్ కాబట్టి త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఇప్పుడు సార్స్, కొవిడ్-19 వంటి కొత్త వైరస్లు కూడా వచ్చి విజృంభించే అవకాశం వుంది. కాబట్టి సీజనల్ ఫీవర్స్ ని అరికట్టడంలో ముందస్తు జాగ్రత్తలు, మెలకువలు పాటించడం అందరి బాధ్యత.
- సీజనల్ వ్యాధుల్ని తరుణ దశలోనే వ్యాపించకుండా చూడాలి. వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధి నిర్ధారణ, చికిత్సతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలి. కాంప్లికేషన్స్ రాకుండా సీజనల్ డిసీజెస్‌పై సరైన అవగాహన కలిగి ఆరోగ్య సూత్రాల్ని అందరూ పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం. విజృంభిస్తున్న సీజనల్ వ్యాధుల్ని రూపుమాపడంలో అందరి సమిష్టి కృషితో మన ఆరోగ్య సంరక్షణ పెంపొందించుకుందాం.
Read also: hindi.vaartha.com
Read also: