📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pollution:కాలుష్య కడలిలో కన్నీటి వరద!

Author Icon By Hema
Updated: August 7, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pollution:పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి. పర్యావరణం మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. మనుగడకు అవసరమైన బాహ్యపరిస్థితుల (భూమి, గాలి, నీరు, ఆహారం, వెలుతురు, వేడి, చలి) లభ్యతనే
పర్యావరణం అంటారు. ప్రకృతిలో సహజంగా ఏర్పడే చర్యల వల్ల జరిగే కాలుష్యాలను సహజ కాలుష్యాలు అంటారు. మానవుడు సాధించిన ప్రగతి వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీన్ని కృత్రిమ కాలుష్యం అంటారు.

ప్రాణికోటి మనుగడ క్షేమంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. మానవ తప్పిదాల వల్ల ఇప్పటికే ఓజోన్ పొర ఛిద్రమై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్టాత్మక సంస్థల్లో
ఒకటైన స్టాక్హోం రెజిలియన్స్ సెంటర్ (ఎస్ఆర్సి) అందించిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది.
ప్రకృతి వనరులు విచ్చలవిడి వినియోగతీరును బట్టి, భూతాపాన్ని బట్టి భూగోళం ఆరోగ్యాన్ని అంశాల ప్రాతిపదికగా అంచనా వేశారు.

వీటిలో వ్యవసాయం, ఆహారం (food) వ్యవస్థ, నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నత్రజని, ఫాస్పరస్ వంటి రసాయనాలవాడకం ఇత్యాదివి ఉన్నాయి. కాలుష్యాన్ని(Pollution) పెంచిపోషించడంలో 2022 నాటికే ప్రపంచ మానవాళి హద్దులు దాటేసింది. నేడు పర్యావరణం సమత్యుత కోల్పోయింది. పులి మీద పుట్రలా ఇటీవల జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల వల్ల పంచభూతాలు కలుషితమౌతున్నాయి.

రణం వల్ల పర్యావరణం కలుషితమై ప్రాణికోటి మరణానికి కారణమౌతుంది. భూగోళం వేడెక్కుతుంది. గత 13నెలల్లో ప్రపంచంలోని అన్ని దేశాలలో అత్యధిక ఉష్ణోగ్రతనమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది సునాయాసంగా అర్థమౌతుంది. విలువైన పర్యావరణానికి మానవులు చేస్తున్నత హాని ఈ
సృష్టిలో ఏ జీవి చేయడం లేదంటే అతిశయోక్తి కాదు.

మానవ నిర్మిత పర్యా వరణం

మానవ నిర్మిత పర్యావరణం అనేది మానవ కార్యకలాపాల ద్వారా సృష్టించి, సవరించిన పర్యావరణం. ఇందులో నగరాలు, రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయి. పర్యావరణం అనేది మానవ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంటుంది.
మానవ నిర్మిత పర్యావరణాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వనరులు, అవకాశాలు వంటి అనేక
ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

మానవ నిర్మిత పర్యావరణాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వనరులు, అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలను కూడా అందించ గలవు. అయినప్పటికీ అవి
కాలుష్యం, నివాస విధ్వంసం, వాతావరణ మార్పులతో సహా అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనేలా చేస్తున్నాయి. పర్యావరణాన్ని నాలుగు ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. భూసంబంధమైన పర్యావరణం, వాతావరణ పర్యావరణం, జల పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం ఇత్యాదివి.

భూసంబంధమైన పర్యావరణం

భూసంబంధమైన పర్యావరణం అనేది అడవులు, గడ్డి భూములు, ఎడారులు, ఇతర పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉన్న భూ ఆధారిత పర్యావరణం. ఉష్ణమండల వర్షారణ్యాలు, సమశీతోష్ణ అడవులు, సవన్నాలు, టండ్రా, ఎడారులు వంటి పలు రకాల పర్యావరణ వ్యవస్థలకు దారితీసే వృక్షసంపద, గడ్డిభూములు, అనేక జాతుల మొక్కలు, జంతువులకు ఆవాసాలను అందించడంలో భూసంబంధమైన పర్యావరణాలు కీలకపాత్ర పోషిస్తాయి.

నేల కాలుష్యం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్లో ఏటాయాభైఆరు లక్షల టన్నులకు పైగా చెత్త పోగు పడుతోంది. ఇలా 2020 నాటికి పేరుకునే 12 బిలియన్ టన్నుల చెత్తని శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చని అంచనా.మనిషి పవిత్రమైన భూమిని తన స్వార్థప్రయోజనాలు,
సుఖభోగాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. ఆహారం, జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తున్నాడు. గృహ వ్యర్థాలు, చెత్తాచెదారం వల్ల భూసారం దెబ్బతింటోంది. మనదేశంలో ప్రతిరోజూ 15వేల టన్నుల కంటే ఎక్కువగా చెత్త ఉత్పత్త అవుతోంది.

కొన్ని పట్టణ ప్రాంతాలు చెత్త, ప్రమాదకరవ్యర్థాలను, ద్రావకాలు, పారిశ్రామిక రంగులు, వ్యర్థాలను, పారవేయడం గురించి తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. చెత్త అధికంగా పేరుకుపోయి, ఏం చేయాలో పాలుపోక కొందరు తగలబెట్టడమే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇలా చేయడం అనేది వాయు కాలుష్యానికి దోహదపడుతుంది. 2004 నుండి జరిపిన అధ్యయనాలు గ్రీస్ దేశం వ్యర్థాలలో 10శాతం మాత్రమే రీసైక్లింగ్ చేసిందని, 90శాతం పల్లపు ప్రదేశాలలో ఉంచినట్ల తెలుస్తుంది. డెన్మార్క్ దాదాపు 30శాతం రీసైకిల్ చేసి, 60శాతం భస్మం చేసి కేవలం 10శాతం వ్యర్థాలను మాత్రమే పల్లపు ప్రాంతాలకు పంపుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం యునైటెడ్ స్టేట్స్
తన చెత్తలో 30శాతానికి పైగా రీసైకిల్ చేస్తుంది. గత 15 ఏళ్లలో ఈ రేటు దాదాపు రెట్టింపు
అయింది. రీసైక్లింగ్ అనేది పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారు. ఇలా చేయకపోవడం వల్ల కూడా
పర్యావరణానికి పెనుముప్పుగామారింది.

వాతావరణ పర్యావరణం

వాతావరణం అనేది భూమి చుట్టూ ఉన్న వాయు పొరను సూచిస్తుంది. ఇందులో మనం పీల్చే గాలి, వాతావరణ నమూనాలు, వాతావరణం ఉంటాయి. వాతావరణ నమూనాలు, వాతావరణం అనేవి
భూమి ఉష్ణోగ్రత, వాతావరణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్-డై-ఆక్సైడ్, నీటి ఆరి వంటి వివిధ వాయువుల ఉనికిని కలిగి ఉంటుంది. గ్రీన్ హౌస్ వాయువల ఉద్గారాలకు, వాతావరణ మార్పులకు దోహదపడే శిలాజ ఇంధనాలను కాల్చడం, అటవీ నిర్మూలన వంటి మానవ తప్పిదాల వల్ల వాతావరణ పర్యావరణం కూడా ప్రభావితమవుతుంది.

వాయు కాలుష్యం

ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, వామనాల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు
చేరి, ప్రాణవాయువు తగ్గిపోతోంది. 2016లో వెలువడ్డ ఒక సర్వేరిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 90శాతం ప్రజలు కలుషితమైన వాయువులు పీలుస్తున్నారు. దీని కారణంగా అనేక రకాలైన శ్వాసరోగాలు, కేన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణికోటి, వృక్షజాతులు ప్రమాదంలో పడ్డాయి. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల
ప్రాజెక్టులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 50వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని నగరాల్లో వాయు కాలుష్యంకొంతమేరకు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

జల పర్యావరణం

జల పర్యావరణం అంటే సముద్రాలు, సరస్సులు, నదులు, చిత్తడి నేలలు, ఇతర నీటి వనరులను కలిగి ఉన్న నీటి ఆధారిత పర్యావరణం. నీటి లవణీయత ఆధారంగా నీటి
పర్యావరణాన్ని మంచినీరు, సముద్ర పర్యావరణ వ్యవస్థలుగా వర్గీకరించవచ్చు. చేపలు, ఉభయచరాలతో సహా ఏక రకాల జీవులకు జల పర్యావరణం నిలయంగా ఉంది. భూగోళంపై
80శాతం జలం విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత మూడుశాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితం కావడం, ఉప్పు నీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యలవల్ల పనికిరాకుండాపోతోంది. దీనివల్ల కేవలం మనుషులేకాక సమస్త ప్రాణికోటితో పాటు ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.

భూగర్భజల కాలుష్యాన్ని ఆపడానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి, తాగడానికి స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యకం. జలాన్ని సంరక్షించడం పరిశుభ్రంగా ఉంచడం మనందరి నైతిక
బాధ్యత. మన సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు. తల్లిగా భావించే గంగ, యమున, గోదారి వంటి నదుల పరిస్థితి మనకు తెలియంది కాదు. పవిత్రజలాలను మనమే కలుషితం చేసుకుంటున్నాం. నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త చెదారం, పరిశ్రమల నుండి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. దీని పర్యవసానంగా దేశంలో ఉన్న
ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వీటిని పూర్తిస్థాయిలో ఆపడం సాధ్యం కావడం లేదు. చివరకు సముద్ర జలాలు సైతం కాలుష్యానికి గురౌతున్నాయి. కాబట్టి నదులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలతోపాటు ప్రతి ఒక్కరూ
విధిగా పూనుకోవాలి. మానవులు చిన్నాచితకా నదులు, కాల్వలు, చెరువులను సైతం విడిచి పెట్టడం లేదు. ఒకప్పుడు ప్రతిఒక్కరూ ఉచితంగా భించే ఆరోగ్యకరమైన భూగర్భజలాలనే తాగేవారు. నేడు పెరిగిపోయిన కాలుష్యం వల్ల భూగర్భ జలాలను తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అందరూ శుద్ధి చేసిన జలాన్ని కొనుక్కుని మరీ తాగుతున్నారు. భూగర్భ జలాలను నిత్యావసర కార్యక్రమాలనువాడుకుంటున్నారు. ఇంకుడు గుంటలు చాలాచోట్ల లేకపోవడం
వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

శబ్ద కాలుష్యం

ఒకప్పుడు శబ్ద కాలుష్య తక్కువగా ఉండేది. నేడు పెరిగిపోయిన మోటారు వాహనాలు, డిజె సౌండ్ వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోయింది. ధ్వని తీవ్రతను డెసిబెల్స్ లో కొలుస్తారు. ఉదాహరణకు ఉరుము చప్పట్లు దాదాపు 100 డెసిబుల్స్తీవ్రతను కలిగి ఉంటాయి. 120 డెసిబెల్ స్థాయిలో లేదా
అంతకంటే ఎక్కువ శబ్దం వింటే హాని కలుగుతుంది. నగరాల్లో శబ్ద కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోయింది.కొందరు యువకులు ద్విచక్రవాహనాలకు సైతం మన వంటకాలను రుచి చూపించి ఆప్యాయత, అనుబంధాలతో ఆనందంగా గడిపేవారు. నేడు పండుగలను ప్రజలు భయపడే
రీతిలో కొందరు జరుపుకుంటున్నారు.

ప్లాస్టిక్ కాలుష్యం

నేడు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోయింది. కొన్ని వేల సంవత్సరాలైన ప్లాస్టిక్ మట్టిలో కలవకుండా కాలుష్యాన్ని పెంచుతుందనే నగ్నసత్యం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ప్లాస్టిక్ వాడకం తగ్గడం లేదు. పెరుగుతున్న ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడానికి చైనా ప్లాస్టిక్ఉత్పత్తులపై నియంత్రణ చేపట్టింది. కెనడాలో ఏకంగా ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్ లో 2016లో ప్లాస్టిక్ నియంత్రణ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం సాధారణ అవసరాలకు వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు ఇత్యాది వాటిపై 2020వరకు పూర్తిగా నిషేధం
విధించారు. ప్లాస్టిక్పై నిషేధం విధించకుండానే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగిన దేశం ఐర్లాండ్. భారీగా జరిమానాల మూలంగా ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 94శాతం తగ్గిపోయింది. మలేషియా కూడా ప్లాస్టిక్ నియంత్రించడంలో విజయం సాధించింది.

ముంచెత్తుతున్న వరదలు

జీవుల మనుగడకు అవసరమైన ప్రతి వస్తువు సమకూరుస్తూరుణం తీర్చుకోలేనంతగా మేలు చేస్తోంది ప్రకృతి. కానీ మనిషి ఆ మేలును మరచి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ, కలుషితంచేస్తూ, ప్రకృతిలోని సమతౌల్యాన్ని దెబ్బ తీస్తున్నాడు. ఎడాపెడా కాలుష్యాన్ని వదులుతూ భూతాపాన్ని పెంచడం, చెట్ల నరికివేత, కొండలు, గనులను ఎడాపెడా తవ్వడం, జలవనరుల విధ్వంసం, ముందుచూపు లోపించిన పట్టణ ప్రణాళిక ఒకటేమిటి.. ప్రకృతికి మనిషి చేస్తున్న నష్టాల
జాబితా గురించి చెబితే అది మహా గ్రంథమే అవుతుంది.

తనకు ఇంత నష్టం చేస్తే ప్రకృతి ఎలా ఊరుకుంటుంది? వరదలు, భూకంపాలు, సునామీలు, అతివృష్టి, అనావృష్టి.. ఇలా ఏదో ఒక విపత్త రూపంలో విరుచుకుపడుతుంది. తనకు ఎదురు వస్తే ఏం జరుగుతుంది? అనే విషయాన్ని విపత్తుల రూపంలో చాటి చెబుతుంది. ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకుని, తనను కాపాడి మిమ్మల్ని మీరు కాపాడుకోండని ప్రకృతి మనుషులకు పదే పదే గుర్తు చేస్తుంది.అయినా మనిషి మారడం లేదు.

తన శాయశక్తులా ప్రకృతిని సర్వనాశనం చేస్తూనే ఉన్నాడు. జలవనరులను ఇష్టానుసారంగా ధ్వంసం చేసి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. విజయవాడ, ఖమ్మం వరదల రూపంలో ఇటీవల ఆ ఫలితం కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విజయవాడ, ఖమ్మం వరదలే కాదు, గత కొన్ని సంవత్సరాల్లో సంభవించిన పలు విపత్తులు మనిషి పాఠాలు నేర్చుకోవాల్సిన
అవసరాన్ని చాటి చెబుతున్నాయి.

ఒకసారి నష్టం రిగితే రెండోసారి అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పదే పదే నష్టం జరుగుతున్నా సరిదిద్దుకోకుంటేదాన్నే నిర్లక్ష్యంఅంటారు. ఆ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం విలయాలు.ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం అయింది. కొద్ది రోజులు మండుటెండలు మాడి మసి చేస్తే, కొన్ని రోజులు కుండపోతవర్షాలతో వరదలతో మానవ జీవితం అతలాకుతలమైంది. 2013 ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ వరదలు, 2020 హైదరాబాద్ వరదలు, ఇటీవల కేరళలోని వయనాడ్లో
కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ఇలాంటివే. తుపాన్లు, అల్పపీడన ప్రభావాలతో భారీ వర్షాలు కురవడం సాధారణ విషయమే అయినప్పటికీ ఇటీవల కాలంలో వాటి తీవ్రత బాగా
పెరిగింది. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయి గంట వ్యవధిలోనే సెంటీమీటర్లకొద్ది వర్షం కురవడం, ఉదయం మండిపోయే ఎండలు, సాయంత్రం కుండపోతవాన.. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య సాధారణ విషయాలుగా మారిపోయాయి.

ఇకముందు ఇలా జరగకుండా ఉండాలంటే
దీనికి ప్రధాన కారణమైన భూతాపాన్ని తగ్గించడం మొట్టమొదటి మార్గం. పెరుగుతున్న కాలుష్యమే భూతాపానికి ముఖ్య కారణం. అందువల్ల కాలుష్యాన్ని తగ్గించే మార్గాలను అనుసరించాలి. బొగ్గు ఆధారిత విద్యత్ ఉత్ప కాకుండా సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని
ప్రోత్సహించాలి. అడవులు, చెట్ల నరికివేతను నిలిపివేసి పచ్చదనాన్ని పెంచాలి. భూతాపాన్ని తగ్గించి ప్రకృతిలో సమతౌల్యం లోపించకుండా, అది విపత్తుల రూపంలో విరుచుకుపడకుండా చేయడంలో ఈ చర్యలు అత్యంత కీలకం. వరదలు, విపత్తుల నివారణలో జలవనరుల సంరక్షణ మరో కీలక చర్య. మనం చెరువులోకి వెళితే, చెరువు మన ఇంటికి వస్తుంది.

దశాబ్దం క్రితంనాటి ఉత్తరాఖండ్వరదలైనా, ఇప్పటి విజయవాడ, ఖమ్మం వరదలైనా ఇదే పాఠాన్ని బోధిస్తున్నాయి. గత
కొన్ని సంవత్సరాల్లో ఉత్తరాఖండ్లో గంగానది తీరం వెంటసహజసిద్ధంగా ప్రవహించే మార్గాలను ఆక్రమించి ఎడాపెడా నిర్మాణాలు, కొండల ధ్వంసం, సొరంగాల తవ్వకం, ఆనకట్టలు, విద్యుత్ కేంద్రాలు వంటి భారీ నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా గంగానది ప్రవాహం సహజంగా ముందుకు వెళ్లే మార్గాలు లేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. భారీ నిర్మాణాల వల్ల కేదార్నాథ్పర్వతాల్లో సహజత్వం లోపించి కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా 5 వేల 7 వందల మందిప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.

విజయవాడ మునగడానికి ప్రధాన కారణమైన బుడమేరు, ఖమ్మం వరదలకు కారణమైన మున్నేరు వాగుల పరిస్థితి కూడా ఇలాంటిదే. ఈ రెండు వాగులు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురయ్యాయి. వీటి వెంట పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలిసాయి. ఫలితంగా వాటి సహజసిద్ధ ప్రవాహ మార్గాలు కుంచించుకుపోయాయి. అందుకే భారీ వర్షాలు కురవడంతో బుడమేరు, మున్నేరు వాగుల్లో నీరు ముందుకు వెళ్లే మార్గం లేక ఊళ్ల మీద విరుచుకుపడ్డాయి. అందువల్ల సహజ వనరులను కాపాడుకునే విషయంలో ఇది నేర్చుకోవాల్సిన మరో పాఠం.

పర్యావరణ పరిరక్షణ చట్టాలు

పర్యావరణాన్ని రక్షించి, జీవరాశిని కాపాడటానికి సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను చేసింది. పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం, ప్రజల బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. మొదట రాజ్యాంగంలో ఈ ప్రస్తావన లేదు. కానీ 1972 జూన్లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో స్టాక్ హోం (స్వీడన్)లో నిర్వహించిన పర్యావరణ సదస్సులో దీన్ని సవరించారు. 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా 48(ఏ), 51(ఏ),నిబంధనల కింద పర్యావరణ పరిరక్షణను పొందుపరిచారు. కర్మాగారాల చట్టం(1948) 1887 చట్టాన్ని సవరించి కార్మాగారాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్య, భద్రత, సంక్షేమం కోసం 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్య, భద్రత, పర్యావరణం గురించి ఈ చట్టంలో నిబంధనలను రూపొందించారు.


క్రిమిసంహారక మందుల చట్టం(1968) క్రిమి సంహారక మందుల తయారీ, రవాణా, విక్రయం,
వినియోగం, దిగుమతి ఇత్యాది కార్యకలాపాలను క్రిమిసంహారక మందుల చట్టం 1968 ద్వారా
నియంత్రించవచ్చు. పర్యావరణ మార్పులను 1994లో రూపొందించిన ఈఐఏ (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్అసెస్మెంట్-ఈఐఏ) విధానం ద్వారా బేరీజు వేసుకుని, చెడు ప్రభావాల ఉధృతిని తగ్గించి,
పర్యావరణ సమత్యౌతకు,జీవ నాన్యత విలువలు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు పొందించడానికి వీలవుతుంది. పర్యావరణ ప్రతికూల పరిస్థితుల తీవ్రతను తగ్గించడానికి ముందుగానే అనుకూల మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా 1970లోనే జాతీయ
పర్యావరణ విధానాన్ని చట్టబద్ధం చేసి తొలిసారిగా అమలు చేసింది. ఈ విధానం ఇప్పుడు ప్రపంచానికే మార్గదర్శిగా మారింది.

అటవీ పరిరక్షణ చట్టం(1980)

అడవుల్లో నివసించే గిరిజనులు కలపను పొందే హక్కును హరిస్తూ, పోడు వ్యవసాయ విధానాలను కట్టడి చేస్తూ, అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడాన్ని నిషేధిస్తూ, బ్రిటిష్ ప్రభుత్వం 1927లో అటవీ పరిరక్షణ చట్టాని చేసింది. దీన్ని సంస్కరణలు చేస్త 1980లో భారత ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టన్ని తీసుకొచ్చింది. 1988లో మరోసారి ఈ చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం గనుల తవ్వకాలు చేపట్టకూడదు.

వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం (1981)

వాహనాల నుండి వెలువడే పలురకాల ఉద్గారాలు, పారిశ్రామిక విసర్జితాలను నియంత్రించడానికి 1981లో కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలు శిక్షార్హులు. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి ఏడాదిన్నర నుండి గరిష్టంగా 6 సంవత్సరాల వరకు జైలుశిక్ష, పదివేల జరిమా విధిస్తున్నారు. ఈ చట్టాన్ని అనుసరించి శబ్ద కాలుష్యాన్ని కూడా వాయు కాలుష్యంలో భాగంగా పేర్కొన్నారు.
ఎకో మార్క్(1991): దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్సంస్థ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకో మార్క్ సర్టిఫికెట్ను ఈ సంస్థ జారీ చేస్తుంది. పర్యావరణంపై చెడు ప్రభావం చూపించే ఉత్పత్తులకు అనుమతులు ఇవ్వదు.

జల కాలుష్య నియంత్రణ చట్టం (1974):

దీని ప్రకారం నీటి స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కాలుష్య నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేయవచ్చు. 1988లో సవరణ చేసి మరింత బలోపేతం
చేశారు. కాలుష్య నియంత్రణ ప్రమాణాన్ని పాటించని పరిశ్రమలను మూసివేసే అధికారం ఈ చట్టం ద్వారా లభించింది.

పర్యావరణ సంరక్షణ చట్టం(1986)

1974లో రూపొందించిన జల కాలుష్య నియంత్రణ చట్టం, 1961లో వాయు కాలుష్య నియంత్రణ చట్టం రెండూసమర్థంగా పర్యావరణ కాలుష్య నివారణ ఉపయోగపడలేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. ఆ కారణంగా అన్ని రకాల కాలుష్యాల పర్యావరణ నాణ్యత కాపాడటం కోసం కేంద్ర
పార్లమెంటు ద్వారా 1986లో ఒక సమగ్ర, సార్వత్రిక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారు.

జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్ చట్టం (1995)

వాణిజ్య, ఆర్థిక కార్యలాపాలు జరిపేటప్పుడు వ్యక్తులతో పాటువారి ఆస్తులకు, పర్యావరణానికి నష్టం వాటిల్లితే తగిన పరిహారం ఇప్పించేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యథావిధంగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతినబూనాల్సిన అవసరం ఉంది.

ప్రతి మనిషి పర్యావరణాన్ని
అమ్మలాగే చూసుకోవాలి. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ బిల్డింగ కాన్సెప్ట్, క్లీన్ టెక్నాలజీస్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే భూతాపం మరింత పెరిగి మున్ముందు భూమి మీద మానవుడు బతికేపరిస్థితి ఉండబోదని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. మనం భావితరాలకు ఎలాంటి భూమిని అందించబోతున్నాం అనే విషయాన్ని సమీక్షించుకోవాలి. సముద్రం మట్టం పెరుగుతుంది. ఋతువులు మారుతున్నాయి.

ప్రకృతి
హెచరిస్తుంది. అర్థం చేసుకొని ప్రకృతికి అనుకూలంగా జీవనం అలవాటు చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఆధునిక నాగరికత, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పేరుతో విచ్చలవిడిగా వనరుల
దర్వినియోగం కారణంగా సహజ పర్యావరణం రోజురోజుకూ క్షీణిస్తోంది. నాగరికత విస్తరిస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న అనేక దేశాల్లో నీరు, గాలి నాణ్యత కోల్పోతున్నాయి. వీటన్నింటిని మరచి నా మతం, నా కులం, నా జాతి, మా రాజకీయ పార్టీ, మా నాయకుడు, మా దేశమే గొప్ప అంటూ బీరాలు పలుక్కుంటూ, వ్యక్తిగత స్వార్థం కోసం నిత్యం ప్రజల మధ్య తగవులు పెడుతూ, విభజించి పాలిస్తూ, నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టించి రాక్షసానందంతో లబ్ధి పొందుతూ ప్రపంచంలోని
అనేక దేశాలు పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తున్నాయి.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదు. ముందుగానే ప్రపంచ దేశాలన్నీ కళ్లు తెరిచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి సమతుల్యాన్ని, వన్యప్రాణుల మనుగను కాపాడటంతో పాటు పర్యావరణానికి జరుగుతున్న నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించి కాపాడుకోవాలి. లేదంటే భావితరాలు ఈ తరాన్ని ఎన్నటికీ క్షమించవు.

విజయవాడ వరదలు ఓ గుణపాఠం

ఇటీవల భారీగా కురిసిన వర్షాలవల్ల విజయవాడకు కనీ వినీ ఎరుగని రూపంలో భారీ వరదలు
ఒక్కసారిగా వచ్చాయి. అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో అపార్ట్మెంట్లను, ఇళ్లను పూర్తిగా
ముంచేశాయి. దీనితో సర్వం కోల్పోయినవాళ్లు కట్టుబట్టలతో మిగిలారు. దాదాపు 50 వేల ఇళ్లు, 3
లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని పోయారు. బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి గొల్లపూడి మీదుగా వెళుతుంది. దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది.

కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే కృష్ణా నదిలో ప్రవాహం
తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కు వస్తోంది. దాంతో ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్లే అటు అజిత్సింగ్నగర్, ఆటోనగర్ వరదలో చిక్కుకున్నాయి. వరద వల్ల సింగ్ నగర్, నున్న, గన్నవరం ఈ
ప్రాంతాలకు వెళ్లడానికి మార్గం లేకుండా పోయింది. దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్టమెంట్లు, ఇళ్లపై వరద ప్రభావం అధికంగా పడింది. జనజీవనం కూడా స్తంభించింది. విజయవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి ప్రవాహానికి మార్గం లేకపోయింది. బుడమేరు వాగును కారణంగా చెబుతున్నారు నిపుణులు. బుడమేరులో మూడొంతుల భాగం ఆక్రమణకు గురి కావడంతోనీటి ప్రవాహానికి మార్గం లేకపోయింది. బుడమేరును ఆక్రమించి
పక్క భవనాల నిర్మాణంతోనే వరద ఉధృతి పెరిగి మూడు చోట్ల గండి పడి వేల గృహాలను ముంచెత్తింది. ఆక్రమణలతో బుడమేరు కుంచించుకుపోయింది.

కొల్లేరులో ఆక్రమణల వల్ల బుడమేరు వరదనీరు కొల్లేరులో కలిసే మార్గం లేక వెనక్కి వచ్చేశాయి. ఆపరేషన కొల్లేరు ఆగిపోవడం కూడా బుడమేరుకుశాపంగా మారింది. ఇటువంటి ఆక్రమణలే విజయవాడ ముంపునకు
కారణం అని నిపుణులు చెబుతున్నారు. 2005ల చేపట్టి బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి. బుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కొనసాగించి కొందరు పర్యావరణానికి తీవ్రమైన హాని చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రా విడిపోవడంతో విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ 20 యేళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం బుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. 20 యేళ్ల నిర్లక్ష్యానికి విజయవాడ వాసులు మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

నిర్లక్ష్యానికి ఫలితంగా తాజా వరదల మూలంగా విజయవాడ మరోసారి నీట మునిగింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం
కళ్లు తెరవాలి. ఆపరేషన్ కొల్లేరు పనులు పూర్తి చేయాలి. అప్పుడు కానీ బుడమేరుకు వరద ముంపు నుంచి బయటపడే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. అటు కొట్టేరు ఆక్రమణలను, ఇటు బుడమేరు ఆక్రమణలను పూర్తిగా తొలగించవలసిన అవసరం ఉంది. వరదలతో ప్రజల అతలాకుతలమవుతుంటే వాళ్ల కష్టాలకు పరిష్కార మార్గం కనుగొనవలసిన రాజకీయ నాయకులు తమ స్థాయిని మరచి మీ వల్లే వరదలు వచ్చాయంటే మీ వల్లే అని ఒకరిపై ఒకరు
దుమ్మెత్తి పోసుకుంటూ ఎవరు నిజం చెబుతున్నారో? ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియక ప్రజలు అయోమయంలో పడిపోయారు.

ఏది ఏమైనా మానవ తప్పిదాలే ఈ వరదలకు కారణమనేది నూటికి నూరు శాతం నిజం. ఇప్పటికైనా మేల్కొని స్వార్థ ప్రయోజనాలను వీడి పర్యావరణానికి హాని చేయకుండా దాన్ని పరిరక్షించుకునే కార్యక్రమాలను చేపడితే మున్ముందు రాబోయే పెనుముప్పులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది.


Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/millets-for-health/cover-stories/526520/


AirPollution ClimateChange EnvironmentalPollution SoilPollution WaterPollution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.