📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nutrition is Life: పోషకాహారమే జీవనాధారం

Author Icon By Hema
Updated: September 16, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nutrition is Life: సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం చాలా అవసరం, సమతుల ఆహారం భుజించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం, అభివృద్ధిలో పోషకాహారం కీలకమైన భాగం, మెరుగైన పోషకాహారం (nutrition) శిశువుతో పాటు తల్లి ఆరోగ్యం మెరుగుపడటం, బలమైన రోగనిరోధక వ్యవస్థలు, సురక్షితమైన గర్భధారణ, ప్రసవం, అంటువ్యాధి కాని వ్యాధుల (మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటివి) తక్కువ ప్రమాదం, దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది.

పోషకాహారమే పిల్లలు బాగా తగినంత ఉత్పాదకతను కలిగి ఆరోగ్యవంతమైన నేర్చుకుంటారు. ఉన్నవారు ఎక్కువ ఉంటారు. పోషకాహార లోపం ఏ రూపంలోనైనా మానవ ఆరోగ్యానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్త పోషకాహార లోపం అనేది అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, వైద్య ప్రభావం ఇత్యాది వాటిపై అనేక దేశాలలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మనదేశంలో 50 శాతం మంది పిల్లలు (children) పౌషికాహార లోపంతో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. పౌష్టికాహారం అంటే అత్యంత ఖరీదైన ఆహారం అని కాదు. అలాగని కేవలం ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే ఆహారమూ కాదు, రుచితో పాటు పోషక విలువలు ఉండాలి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందిస్తే ప్రతి అవయవం ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే సమతుల ఆహారంపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతుంటారు.

పౌష్టికాహారం అంటే ఏమిటి?

పౌష్టికాహారం అంటే శరీరానికి అవసరమైన పోషకాలను
అందించే ఆహారం. ఇది శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రోజువారీ కార్యకలాపాలకు శక్తిని అందించడానికి సహాయపడుతుంది. పౌష్టికాహారంలో ప్రధానంగా పలురకాల పోషకాలు ఉంటాయి.
కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు): శరీరానికి శక్తిని అందించే ప్రధాన వనరు. (ఉదా: బియ్యం, గోధుమలు, బంగాళదుంపలు, పండ్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి).

ప్రోటీన్లు (మాంసకృత్తులు): కండరాలు, శరీర కణజాలం ఏర్పడటానికి ఇవి చాలా అవసరం. (ఉదా: ధాన్యాలు, చికెన్, చేపలు, పాలు, పప్పులు, గింజధాన్యాలు, గుడ్లు ఇత్యాది వాటిని ఇవి పుష్కలంగా
కొవ్వులు: శరీరానికి శక్తిని, విటమిన్లను అందిస్తాయి. శక్తి నిల్వలు, హార్మోన్ల నిర్మాణానికి ఇవి ఉపయోగపడతాయి. (ఉదా: నీటిగింజలు, నెయ్యి, నూనెలు వీటిలో పుష్కలంగా లభిస్తుంది. అయితే ఆరోగ్యకరమైన కొవ్వులను మాత్రమే తీసుకోవాలి)
విటమిన్లు: శరీర కార్యకలాపాల నియంత్రణ, శరీరంలోని వివిధ జీవక్రియలకు ఇవి అవసరం, (ఉదా: కూరగాయలు, పండ్లు, పాలు ఇత్యాది వాటిలో విటమిన్లు ఉంటాయి).

ఖనిజాలు (మినరల్స్): ఎముకలు, జీవనాధారం -బలానికి, రక్తం
ఏర్పాటుకు, రక్తం ఆరోగ్యానికి చాలా అవసరం. (ఉదా:కాల్షియం, ఐరన్, ఇవి ఆకుకూరలు, పాలు, చేపల్లో అధికంగా ఉంటాయి).

నీరు: శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.

Nutrition is Life

ప్రపంచ దేశాలలో పౌష్టికాహార పరిస్థితి:

ప్రపంచవ్యాప్తంగా పౌష్టికహార పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నివేదికల ప్రకారం ప్రపంచంలో సుమారు 735 మిలియన్ మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 148 మిలియన్ మంది క్షయక్రమంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అండర్ న్యూట్రిషన్ (పోషకాహారం లోపం), ఓవర్ వెయిట్, ఒబెసిటీ (అధిక బరువు), మైక్రోన్యూట్రియెంట్ డెఫిషియెన్సీలు (విటమిన్లు, మినరల్స్ లోపం) వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2023లో సుమారు 733 మిలియన్ మంది భూమి పై ఆకలి ఎదుర్కొన్నారు.

ఇది ప్రపంచ జనాభాలో 1/11 మందికి సమానం. ఆఫ్రికాలో 1/5 మందికి సమానం. 2023లో మితమైన, తీవ్రమైన ఫుడ్ ఇన్సెక్యూరిటీ (ఆహార భద్రత లోపం) 2.33 బిలియన్ మందిని ప్రభావితం చేసింది. ఇందులో 864 మిలియన్ మంది తీవ్రమైన అభద్రతను ఎదుర్కొన్నారు. 2022లో 2.8 బిలియన్ మంది ఆరోగ్యకరమైన డ్రైట్ (పౌష్టికాహార ఆహారం) తమ శరీరానికి అందించలేకపోయారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో 71.5 శాతం మంది ప్రభావితమయ్యారు. 2024-2025 డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ కంటే ఎక్కువ 5 యేళ్ల లోపు పిల్లలు స్టంటింగ్ (తక్కువ పొడవు)తో బాధపడుతున్నారు. 42.8 మిలియన్ వేస్టింగ్ (తక్కువ బరువు)తో, 35.5 మిలియన్ ఓవర్ వెయిట్తో, అండర్ న్యూట్రిషన్ (పౌష్టికాహార లోపం) ప్రధానంగా స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియెన్సీలను (అనీమియా వంటివి) కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2023లో 9.1 శాతం ప్రజలు అండర్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. ఆఫ్రికాలోని సబ్-సహారాలో అయితే 23.2 శాతం వరకు ఉంటుంది. ఇది 733 మిలియన్ మందిని ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకంగా పిల్లలలో అండర్ న్యూట్రిషన్ తీవ్రమైనది. ఇది 5 యేళ్ల లోపు పిల్లల మరణాలలో కారణమవుతుంది.

ప్రపంచ దేశాలలో పౌష్టికాహారం పరిస్థితి ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటుంది. అభివృద్ధి స్థాయి, ఆర్ధిక పరిస్థితులు, వ్యవసాయం, ఆరోగ్య సదుపాయాలు, ప్రజల ఆహారపు అలవాట్లు, విద్య వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూరప్, జపాన్ ఇత్యాది దేశాలలో ఆహార లోపం తక్కువగా ఉంటుంది. అయితే అధికంగా జంక్ ఫుడ్, ప్రాసెస్ట్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె వ్యాధులు పెరుగుతున్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, బంగ్లాదేశ్, నైజీరియా ఇత్యాది దేశాలలో రెండు రకాల సమస్యలు కనిపిస్తుంటాయి. ఆహార లోపం వల్ల పిల్లల్లో క్షయక్రమం, రక్తహీనత, బరువు తక్కువగా ఉండటం ఇత్యాది సమస్యలతో పాటు జంక్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల ఊబకాయం, షుగర్ వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు పేదలలో ఆహార లోపం, మరోవైపు పట్టణాల్లో అధికాహార సమస్య రెండూ ఉన్నాయి. అత్యంత వెనుకబడ్డ సోమాలియా, ఇథియోపియా ఇత్యాది చోట్ల ప్రధాన సమస్య ఆకలి, పోషకాహార లోపం. చిన్న పిల్లల మరణాలు ఎక్కువగా పౌష్టికాహారం లోపం వల్లే జరుగుతున్నాయి. శుద్ధి చేసిన నీరు, సరైన ఆహారం అందుబాటులో లేకపోవడం మరో ప్రధాన కారణం.

Nutrition is Life

ప్రభుత్వ చర్యలు

అనేక దేశాలు పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. మన దేశంలో పోషణ్ అభియాన్ వంటి పథకాలు గర్భిణులు, పిల్లలు, కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందించడానికి పనిచేస్తున్నాయి. ఆహార పదార్థాలను బలవర్ధకం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం వంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు.

పోషణ్ అభియాన్ అనే పథకం పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఒక జాతీయ స్థాయి కార్యక్రమం. మిషన్ పోషణ్ 2.0 అనే మరో పథకం పోషణ్ అభియాన్, అంగన్వాడీ సేవలు వంటి వాటిని సమన్వయం చేసి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాలల్లో పిల్లలకు పోషక విలువలున్న భోజనం అందించడం ద్వారా వారి పోషకాహార స్థితిని మెరుగుపరుస్తుంది. సమన్విత శిశు అభివృద్ధి సేవలు ద్వారా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణిలకు, బాలింతలకు పోషకాహారంతో పాటు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది. ప్రజలకు సరసమైన ధరలలో తగినంత ఆహార ధాన్యాలను అందించడానికి జాతీయ ఆహార భద్రతా చట్టం తోడ్పడుతుంది. భారత ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నపటికీ పోషకాహార లోపం అనేది నేటికీ ప్రధాన సమస్యగానే ఉంది.

గణాంకాలు-నివేదికలు

ప్రపంచ ఆకలి సూచీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. భారతదేశం వంటి దేశాలు ఈ సూచీలో వెనుకబడి ఉన్నాయి. 2023 నివేదికలో భారతదేశం 125 దేశాలకుగాను 111వ స్థానంలో ఉంది. ఈ సూచీలో ఉపయోగించే పద్ధతులపై భారత ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా బదేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికహార లోపం చాలా ఎక్కువగా ఉంది. సరైన పోషకాహారం లభించక, ప్రతి సంవత్సరం లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. గిడసబారడం, బక్కచిక్కడం, తక్కువ బరువు.. వంటి సమస్యలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళల్లో రక్తహీనత ఒక పెద్ద సమస్య, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువై, అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

భారతదేశంలో పోషకాహార లోపం సూచీ నివేదిక

ప్రపంచ ఆకలి సూచీ: ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపం స్థాయిలను అంచనా వేస్తుంది. 2024 నాటికి భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది. ఈ సూచీ భారతదేశంలో పోషకాహార లోపం, ముఖ్యంగా పిల్లలలో, తీవ్రమైన సమస్యగా ఉందని సూచిస్తుంది. అయితే ఈ నివేదికలో కొన్ని పద్ధతులపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే: 2019 -2021 ప్రకారం భారతదేశంలో ఆరోగ్య, పోషకాహార సూచీలను అంచనా వేసే ముఖ్యమైన సర్వే ఇది.

పిల్లలలో ఎదుగుదల లోపం: ఐదేళ్ల లోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేనివారు 36.5 శాతం ఉన్నారు. ఇది అంతకు ముందు సర్వేలో 38.4 శాతంతో పోలిస్తే మెరుగుదల.

పిల్లలలో బరువు తక్కువ: ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు 19.3 శాతం ఉన్నారు. అంతకు ముందు సర్వేలో ఇది 21.0గా ఉంది. పిల్లలలో తక్కువ బరువు: వయసుకు తగ్గ బరువు లేనివారు 32.1 శాతం ఉన్నారు. అంతకు ముందు సర్వేలో ఇది 35.8 శాతంగా ఉంది.

పోషణ్ ట్రాకర్: మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మొబైల్ అప్లికేషన్ ను పోషకాహార కార్యక్రమాలను పర్యవేక్షి ంచడానికి ఉపయోగిస్తుంది. ఈ డేటా ప్రకారం పిల్లలలో పోషకాహార లోపం సూచికలలో స్థిరమైన మెరుగుదల కనిపిస్తోంది. నవంబర్ 2023 నాటికి 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 37.51 శాతం మంది ఎదుగుదల లోపంతో ఉన్నారని ఈ డేటా సూచిస్తుంది. అయితే ఇది ప్రపంచ ఆకలి సూచి నివేదికలో పేర్కొన్న గణాంకాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఉన్నాయి. ఏతావాతా తేలిందేమిటంటే భారతదేశంలో పోషకాహార లోపం సమస్య ఇప్పటికీ ఉంది. అందుకు అనేక కారణాలు

Nutrition is Life

కారణాలు

పేదరికం వల్ల తగినంత ఆహారం కొనడానికి డబ్బు లేకపోవడం పౌష్టికాహార లోపానికి ప్రధాన కారణం. ఆహార భద్రత లేకపోవడం మరో కారణం. ఆహార ఉత్పత్తి, సరఫరా గొలుసులో సమస్యలు, వాతావరణ మార్పులు, కరువులు వంటివి ఆహార లభ్యతను తగ్గిస్తాయి. ఏది సమతుల్య ఆహారం, ఏ పోషకాలు అవసరం అనే దానిపై అనేకమందికి అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం.
కేవలం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, ఇతర పోషకాలు (ప్రొటీన్లు, విటమిన్లు) తక్కువగా తీసుకోవడం ఇత్యాది ఆహారపు అలవాట్లు ఇంకో కారణం. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్య వసతులు లేకపోవడం వల్ల అంటువ్యాధులు వ్యాపించి, పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. భారతదేశంలో పౌష్టికాహారం పరిస్థితి సంక్లిష్టంగా ఉంది, ఇందులో అనేక సవాళ్లు, కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. దీనిని లోతుగా అర్ధం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది.
మన దేశంలోని ప్రధాన సమస్యల్లో ఒకటి పౌష్టికాహార కొరత అని చెప్పకతప్పదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో పిల్లలలో పౌష్టికాహార లోపం ఉన్నట్టు తేలింది. 35.5 శాతం పిల్లలు వయసుకు తగిన ఎత్తు లేకుండా ఉన్నారు, ఇది దీర్ఘకాలిక పౌష్టికాహార లోపాన్ని సూచిస్తుంది. 19.3 శాతం పిల్లలు బరువు-ఎత్తు నిష్పత్తిలో లోపం కలిగి ఉన్నారు. ఇది తీవ్రమైన పౌష్టికాహార కొరతను సూచిస్తుంది. 32.1 శాతం పిల్లలు వయసుకు తగిన బరువు కంటే తక్కువ బరువు కలిగి ఉన్నారు. 6-59 నెలల వయస్సు గల పిల్లలలో 67.1 శాతం, 15-49 సంవత్సరాల మహిళలలో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఇనుము లోపం, ఇతర సూక్ష్మ పోషకాల కొరతను సూచిస్తుంది. భారతదేశంలో విటమిన్ ఎ, విటమిన్ డి, జింక్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాల లోపం విస్తృతంగా ఉంది. ఇది ప్రధానంగా ఆహార వైవిధ్యం లేకపోవడం, పేదరికం, ఆహార భద్రత లేకపోవడం వల్ల సంభవిస్తుంది. విటమిన్ డి లోపం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సర్వసాధారణమైంది. ఎందుకంటే సూర్మరశ్మి బహిర్గతం తక్కువగా ఉండడం, ఆహారంలో విటమిన్ డి సమృద్ధిగా లేకపోవడం. పౌష్టికాహార లోపంతో పాటు అతిపోషణ కూడా భారతదేశంలోని ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పెరుగుతోంది. ఫలితంగా ఊబకాయం సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. 15-49 సంవత్సరాల వయస్సు గల పురుషులలో 22.9 శాతం, మహిళల్లో 24 శాతం మంది ఊబకాయం లేదా అధిక బరువుతో ఉన్నారు. ఇది జీవనశైలి మార్పులు, అధిక కేలరీల ఆహారం తినడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల సంభవిస్తుంది.

పౌష్టికాహారం-ప్రయోజనాలు

పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శక్తి స్థాయిలను పెంచి, రోజువారీ పనులను చురుగ్గా చేసుకునేలా చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. ఒత్తిడిని, అందోళనను తగ్గిస్తుంది. రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టుకు, గోళ్ళకు సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. పౌష్టికాహారంలో ఉండే పిండి పదార్థాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అన్నం, రొట్టెలు, పండ్లు, ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు, కణాల పునరుద్దరణకు ఇవి అవసరం. కొవ్వులు శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, విటమిన్లు గ్రహించడానికి కూడా ఉపయోగపడతాయి. విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని వివిధ జీవక్రియలకు ఇవి చాలా ముఖ్యం, పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
తృణధాన్యాలు, కూరగాయలు: మనం తీసుకునే ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. వీటిని దైనందిన ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పౌష్టికాహారం తీసుకోవడం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీర్ఘకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి కూడా చాలా అవసరం.

పౌష్టికాహారంలో ఏమి ఉండాలి?

పండ్లు, కూరగాయలు: విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, తృణధాన్యాలు: బియ్యం, గోధుమలు, ఓట్స్ వంటివి ఫైబర్, శక్తిని అందిస్తాయి. ప్రోటీన్ ఆహారాలు: గుడ్లు, చేపలు, బీన్స్, కాయధాన్యాలు. పాల ఉత్పత్తులు: కాల్షియం, విటమిన్ డి కోసం. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడో, ఆలివ్ ఆయిల్.

తక్కువ ధరకే మనకు లభించే పౌష్టికాహార అనేకం ఉన్నాయి. గుడ్లు, పాలు, పెరుగు,

వేరుశెనగ, నువ్వులు, శనగలు, తాజా కొబ్బరి, మొలకలు.. ఇత్యాదివి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రాగులు, జొన్నలు, చిరుధాన్యాలు, ఆకు కూరలు, మునగాకు, మెంతికూర, ఆయా కాలాల్లో లభించే పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. రాగిముద్ద తినడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. మధుమేహం హెచ్చుతగ్గులు క్రమబద్ధీకరి స్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇటువంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది. దీర్ఘకాలంలో వ్యాధుల నుండి రక్షణ పొందుతుంది. రోజువారీ ఆహారంలో సమతుల ఆహారాన్ని చేర్చడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

జంక్ ఫుడ్ తినకూడదు.

శరీరానికి అవసరమైన పోషకాలు (విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్) తక్కువగా ఉండి, ఎక్కువగా కొవ్వు, చక్కెర, ఉప్పు, మసాలాలు కలిగిన ఆహారాన్ని జంక్ ఫుడ్ అంటారు. జంక్ ఫుడ్ అంటే అధిక కేలరీలు, చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండి, పోషక విలువలు (విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్) తక్కువగా ఉండే ఆహారం. ఫాస్ట్ ఫుడ్ (బర్గర్, పిజ్జా, (ఫైస్), చిప్స్, కాండీ, చాక్లెట్లు, సోడా, స్వీట్ డ్రింక్స్, డీప్ (ఫైడ్ స్నాక్స్ (పకోడీ, సమోసా) ఇత్యాది వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం కావచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడు తగ్గించడం మంచిది. జంక్ ఫుడ్ రుచికి బాగుంటాయి కానీ ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ శక్తి ఇస్తాయిగానీ శరీరానికి అవసరమైన పోషణ ఇవ్వవు.

పౌష్టికాహారం లోపం వల్ల నష్టాలు

పౌష్టికాహార లోపం వల్ల శరీరానికి, మనసుకు అనేక రకాల నష్టాలు కలుగుతాయి. శరీర సంబంధిత నష్టాలు: బరువు తగ్గడం, ఎత్తు పెరగకపోవడం, పిల్లలలో వృద్ధి మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, జలుబు, దగ్గు, క్షయ, మలేరియా వంటి వ్యాధులు త్వరగా వస్తాయి.

రక్తహీనత సమస్య ఉత్పన్నమై శరీరానికి తగినంత రక్తం లేక బలహీనత, తలనొప్పి, అలసట వస్తాయి. ఎముకలు బలహీనమవడం, విటమిన్ డి, కాల్షియం లోపం వలన ఎముకలు పలుచబడటం, విరిగిపోవడం జరుగుతుంది, చర్మం, జుట్టు, కళ్ల సమస్యలు, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబరడం, కళ్లలో చూపు తగ్గిపోవడం, జీర్ణ సమస్యలు కడుపులో సమస్యలు, విరేచనాలు, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి.

Nutrition is Life

మానసికబుద్ధి సంబంధిత నష్టాలు: మెదడు అభివృద్ధి తగ్గిపోవడం, పిల్లలలో చదువులో వెనుకబాటు, కేంద్రీకరణ లోపం వలన పని, చదువులో దృష్టి పెట్టలేకపోవడం, ఆత్మ విశ్వాసం తగ్గడం వల్ల అలసట, బలహీనత వల్ల పనిలో వెనుకబడటం ఇత్యాది అనేక సమస్యలు వస్తాయి.

దీర్ఘకాలిక నష్టాలు: హృదయ, మూత్రపిండ, కాలేయ సమస్యలు, శరీర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తీవ్ర పౌష్టికాహార లోపం వల్ల చిన్న పిల్లల్లో మరణం సంభవించే అవకాశం ఎక్కువ. విటమిన్ ఎ, డి, సి. బి-కాంప్లెక్స్, ఇనుము, కాల్షియం, జింక్ వంటి పోషకాల లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తగినంత శక్తి అందకపోవడం వల్ల శరీరం బలహీనంగా మారి, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాల్షియం, విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రావచ్చు. ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత సంభవించవచ్చు, ఇది శ్వాసకోశ సమస్యలు, అలసట, తలతిరగడం వంటివి కలిగిస్తుంది. ఫైబర్ లోపం వల్ల మలబద్దకం, గ్యాస్, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మెదడుకు అవసరమైన గ్లూకోజ్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బి విటమిన్లు లభించకపోతే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. పోషకాల లోపం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరగవచ్చు. కొన్ని పోషకాల లోపం (మెగ్నీషియం, విటమిన్ బి6) నిద్ర నాణ్యతను
దెబ్బతీస్తుంది. విటమిన్ సి, డి. జింక్ వంటి పోషకాలు లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గి, తరచూ ఇన్ఫెక్షన్లు, ఇతర రోగాలు సంభవించే అవకాశం పెరుగుతుంది. పౌష్టికాహారం లేకపోతే అనారోగ్యకరమైన ఆహారాలపై ఆధారపడటం వల్ల ఊబకాయం లేదా అతి తక్కువ బరువు సమస్యలు వస్తాయి. సమతుల ఆహారం లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలు రావచ్చు..

మధుమేహం: అధిక చక్కెర, పిండి పదార్థాలు, తక్కువ ఫైబర్ ఆహారం వల్ల. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లల్లో పౌష్టికాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం, బరువు తగ్గడం, మేధస్సు అభివృద్ధిలో లోపాలు, బలహీనమైన ఎముకలు, దంత సమస్యలు వంటివి సంభవించవచ్చు. చర్మం, జుట్టు సమస్యలు: విటమిన్ ఎ, ఇ, బయోటిన్, ఒమేగా3 లోపం వల్ల చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, గోళ్లు బలహీనంగా మారడం జరుగుతుంది. పోషకాల లోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలు తలెత్తవచ్చు.
సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది మన జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగం, పోషకాలు నిండిన ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యానికి పునాది వేస్తుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం రోగాల నుండి దూరంగా ఉండటమే కాకుండా, మన దైనందిన కార్యకలాపాలను ఉత్సాహంగా, చురుగ్గా నిర్వహించుకోగలుగుతాం. ఆరోగ్యకరమైన జీవనానికి, పోషక విలువలతో కూడిన ఆహారం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యవంతమైన జీవితానికి, దీర్ఘకాలిక ఆనందానికి సోపానం. పౌష్టికాహారం లోపం దేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి. కాబట్టి ప్రతి కుటుంబం నుండి సమాజం వరకు దీనిపై చైతన్యం కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పౌష్టికాహారం అలవాటు చేసుకోవాలి.

“ఆహారం మన జీవనాధారం” అని గుర్తుంచుకుంటూ, పౌష్టికాహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం మన బాధ్యత. కాబట్టి మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి, ఈరోజు నుంచే మంచి పోషకాహారాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/seasonal-fevers/cover-stories/543452/

BalancedDiet EatHealthy Google News in Telugu healthyfood Latest News in Telugu NutritionIsLife NutritiousFood Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.