Local Elections:తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో 2014, 2018లో రెండు సార్లు ప్రజామోదం పొంది సుమారు పదేళ్లు పరిపాలించిన టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకొని అధికారం నుండి దిగిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తయినా కూడా ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయినా స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించలేకపోయింది. ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన ‘ప్రజాపాలన’ కాదని స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి అధికార వికేంద్రీకరణ చేసినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాపాలనని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలి. ఇక కేంద్రంలో స్థానిక ప్రభుత్వాల పట్ల వివక్ష ఎలా కొనసాగుతుంది.
ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్లో (Parliament) ప్రవేశపెట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే నినాదంతో మొదలైన ఈ జమిలి ఎన్నికల ఆలోచన ఆచరణ సాధ్యమా? కాదా?
అనే వివాదం కొనసాగుతూనే ఉంది. అలాగే “ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలలో జాతీయ ఎజెండాను రుద్దడానికే” అనే విమర్శ కూడా ఉంది. జమిలి ఎన్నికలు (Elections) దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదంగా మారుతుందనే మరో విమర్శ ఉంది. అలాగే జెమిలి ఎన్నికల ప్రతిపాదనకు సానుకూల అంశాలుగా చెప్పబడుతున్న ఎన్నికల ఖర్చు ఒక సమస్య కాదని విమర్శించబడుతుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెమిలి ఎన్నికల ముసాయిదాలో మొదట చెప్పినట్లుగా స్థానిక ప్రభుత్వాల ఊసు లేకపోవడం చూస్తే స్థానిక ప్రభుత్వాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిరక్ష్య వైఖరి కనబడుతుంది. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజుల్లో స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు కూడా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే జెమిలి ఎన్నికల ప్రాసెస్లో జరుగుతుందని గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఆ ప్రసక్తి తీసుకురాకపోవడం ఉద్దేశపూర్వకంగానేనా అని అనిపిస్తుంది.
దేశవ్యాప్తంగా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతున్నాయి. 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలు కానీ ఆ సవరణలలో పేర్కొన్న ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు అనే అంశంపై కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఇప్పటికే తేలిపోయింది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 2024 జనవరిలోనే పంచాయతీ సర్పంచుల పదవీ కాలం పూర్తి అయిపోయింది.
అదేవిధంగా 2024 జూన్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మెంబర్ల పదవీ కాలంతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షుల పదవీ కాలం కూడా ముగిసింది. ఇక 2025 జనవరిలో రాష్ట్రంలో జిహెచ్ఎంసి మినహాయించి మిగతా అన్ని మున్సిపాలిటీల కౌన్సిలర్లు ‘స్థానిక’ పాలనే చైర్మెన్ ల పదవీ కాలం పూర్తవుతుంది. ఈ దశలో దేశం సంగతి అలా ఉంచి గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో జమిలి ఎన్నికలు ఎందుకు జరగకూడదు? అనే ఒక సూచన వస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకొని వచ్చే ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలతో పాటే మండల జిల్లా పరిషత్ స్థాయిలో ఎన్నికలను ఒకేసారి పూర్తి చేస్తే దేశవ్యాప్త జమిలి ఎన్నికల సంగతి అటుంచి రాష్ట్రంలో జమిలి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వమే శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. అలా చేస్తే స్థానిక ప్రభుత్వాలను గౌరవించిన పార్టీగా గ్రామ స్వరాజ్యాన్ని ప్రతిపాదించిన మహాత్మా గాంధీ ఆశయాలకు కట్టుబడిన పార్టీ 73,74 వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు మున్సిపాలిటీలకు రాజ్యాంగపరమైన హోదా కట్టబెట్టిన మాజీ ప్రధాని కాంగ్రెస్ నాయకుడు దివంగత రాజీవ్ గాంధీ కలల సాకారానికి పూనుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది.
ఈ దిశగా ఇప్పటికే పర్సన్ ఇన్చార్జీల పేరిట అధికారుల పాలనలో మగ్గిపోతున్న స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2025 సెప్టెంబర్ 30వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికలు జరపాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం డిలిమిటేషన్తో పాటు రిజర్వేషన్ల ఖరారుకు నెల రోజుల టైం అడిగితే ఈ జూలై 25 వరకు హైకోర్టు ఇచ్చిన సమయం కూడా పూర్తయిపోయింది.
ఇంకా డిలిమిటేషన్ కానీ రిజర్వేషన్లు ఖరారు కూడా పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ల 42 శాతం పెంపు అనే బిల్లుపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడుపుతుంది. రాష్ట్ర గవర్నర్ ద్వారా 2018 పంచాయతీ రాజ్ చట్టంలో సవరణ చేస్తూ పంపిన ముసాయిదా ఆర్డినెన్స్ కూడా ఇప్పటివరకు గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదు.
రాష్ట్ర గవర్నర్ అనేకమంది న్యాయ కోవిధులతో మాట్లాడుతూ ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు గురించి న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్లే ఇక పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చు.
కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే మిగతా పార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా కేవలం 2019 ఎన్నికల్లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిపినట్లే 22 చట్టబద్ధ రిజర్వేషన్లతోనే సరిపుచ్చుకొని ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.
ఇక స్థానిక ప్రభుత్వాలలో దిశలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశంలో స్థానిక ప్రభుత్వాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రిజర్వేషన్ పెంపు చేసి సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి దాటుతూ మళ్ళీ సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేయకుండా ఉండడానికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలనే ప్రతిపాదనకు బిజెపి పార్టీ ససేమీరా అంటుంది.
దాంతో తెలంగాణ అసెంబ్లీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు పాస్ కావడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
స్థానిక ప్రభుత్వాలు-ఒక పరిశీలన
స్థానిక సంస్థలు కావు-స్థానిక ప్రభుత్వాలుగా పిలవాలి
1) భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 40లో ‘లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చేర్చారు. దీన్ని తెలుగులో అనువదిస్తే ‘స్థానిక స్వపరిపాలన చేసే ప్రభుత్వం’ అనే అర్థం వస్తుంది. అందుకే గ్రామ, మధ్యం తర, (మండల) జిల్లా స్థాయి పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా పిలవాలి. మున్సి పాలిటీలు, కార్పొరేషన్లను కూడా ఇలాగే స్థానిక ప్రభుత్వాలుగా పిలవాలి.
2) 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయ తీలు, మున్సిపాలిటీల గ్రామ, పట్టణ, నగర ప్రభుత్వాలుగా పిలవాలి. 1994లో ఆమోదించిన పై సవరణల ప్రకారం రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధత ఏర్పడింది.
3) పార్లమెంట్- అసెంబ్లీల లాగానే స్థానిక ప్రభుత్వాలకు కూడా 73,74వ రాజ్యాంగ సవరణల ప్రకారం చట్టబద్ధత వచ్చింది.
4) 73వ రాజ్యాంగ సవరణలో ముఖ్యాంశాలు
ఎ) ఐదేళ్లకు ఒకసారి తప్పక ఎన్నికలు నిర్వహించాలి.
బి) స్థానిక ప్రభుత్వాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు.
సి) ఆర్థిక వనరుల కేటాయింపు కోసం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు.
డి) దేశమంతటికీ మూడంచెల విధానం. 1) గ్రామ పంచాయతీ 2) మధ్యంతర అంచె
3) జిల్లా పరిషత్
ఇ) మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్ని అంచెలలో అమలు కావాలి.
ఎఫ్) గ్రామ పార్లమెంటుగా గ్రామ సభ సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలి.
1) ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి 2) అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు తప్పక గ్రామ సభలు నిర్వహించాలి. గ్రామ సభల తేదీలు జి.వో.ల ద్వారానే పేర్కొన్నారు.
5) 74వ రాజ్యాంగ సవరణ: పట్టణ, నగర ప్రభుత్వాల గురించి వివరిస్తుంది.
ఎ) 73వ రాజ్యాంగ సవరణలోని అన్ని విషయాలు వీటికి వర్తిస్తాయి. బి) 3 లక్షల జనాభా దాటిన మున్సిపాలిటీలకు వార్డు కమిటీలు ఏర్పాటు.
6) మూడు ‘ఎఫ్’ల సిద్ధాంతం
ఎఫ్) ఫండ్స్
ఎఫ్) ఫంక్షన్స్
ఎఫ్) ఫంక్షనరీస్
నిధులు విధులు సిబ్బంది/నిర్వహణ చేసేవారు.పై సిద్ధాంతం ప్రకారం పాలన సాగాలంటే విధులు, నిధులు, వాటిని నిర్వహించే సిబ్బంది, కార్యనిర్వాహక వర్గం వుండాలి.
జాతీయ ప్రభుత్వం నుండి దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధుల వాటా పంచుతున్నారు. దేశంలో జాతీయ ప్రభుత్వం వసూలు చేసే పన్నుల డబ్బులలో 2015 లో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత (దేశ ప్రణాళిక సంఘం బదులు) అన్ని రాష్ట్రాలకు పార్టీలు, ప్రభుత్వాలు అనే పక్షపాతం లేకుండా చట్టబద్ధంగా అంతకుముందున్న 32 శాతానికి బదులు 42 శాతానికి నిధుల పంపిణీని పెంచారు. అంటే మొత్తం జాతీయ ప్రభుత్వ ఆదాయంలో రాష్ట్ర వాటా 42 శాతం నిర్వచించారు. ఇవికాక కేంద్ర, ప్రాయోజిత పథకాలు అయిన జాతీయ ఆరోగ్య మిషన్, సర్వశిక్ష అభియాన్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి మరో పది, పదిహేను ముఖ్య పథకాల ద్వారా మరో ఎనిమిది శాతం నిధులు దాదాపుగా రాష్ట్రాలకు అందుతున్నాయి.
రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాలకు జాతీయ ఫైనాన్స్ కమిషన్ కేటాయించే డబ్బు అదనం. ప్రస్తుతం 14వ ఆర్టికల్ సంఘ సిఫార్సుల ప్రకారం గ్రామ పంచాయతులకే నేరుగా జనాభా ప్రకారం నిధులు కేటాయిస్తున్నారు. 13వ ఆర్టికల్ సంఘం గ్రామ పంచాయతీలతో పాటు మండల (మధ్యంతర) జిల్లా పరిషత్లకు నిధులు కేటాయించగా 14 ఆర్థిక సంఘం మాత్రం కేవలం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకే నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటుంది. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులు 2019-20 ఆర్థిక సంవత్సరంతో ముగుస్తాయి.
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు
2020-21 నుండి అమలులోకి వచ్చి ఐదేళ్లు. 2024 వరకు అమలులో వుంటాయి. 13వ ఆర్ధిక సంఘంలాగే గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్లకు కూడా ఈసారి వాటా ఇవ్వాలనే ప్రతిపాదన వుంది.
73వ రాజ్యాంగ సవరణలు కేటాయించాల్సిన అంశాలు
73వ రాజ్యాంగ సవరణకు ముందు రాజ్యాంగంలో జాతీయ ప్రభుత్వం చేసే పనులు, యూనియన్ లిస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పనులు స్టేట్ లిస్ట్ ఇద్దరికీ కలిపి కేటాయించిన అంశాలు కంకరెంట్ లిస్ట్గా విభజించారు. స్థానిక ప్రభుత్వాలకు విడిగా కేటాయించిన విధులు మొదట భారత రాజ్యాంగంలో లేవు. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీదే స్థానిక ప్రభుత్వాలు ఆధారపడి వుండేవి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 29 విధులను పంచాయతీ వ్యవస్థకు 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 18 విధులను మున్సిపాలిటీ నగరాలకు కేటాయించారు. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధులను స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి. దేశంలోని కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కొంతవరకు ఎక్కువగా అమలు చేశాయి. ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కేవలం పదకొండు, పన్నెండు అంశాలు మాత్రమే స్థానిక ప్రభుత్వాలకు బదలాయించి దేశంలో అధ్వాన్నంగా వున్నాయి. స్థానిక ప్రభుత్వాలు స్ఫూర్తిని నీరుగార్చాయి.
తలసరి గ్రాంటు కథ కమామిషు బిచ్చమేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు (ఏపి, తెలంగాణ) స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే తలసరి గ్రాంటు(పర్ క్యాపిటా గ్రాంట్) చూస్తే మతిపోతుంది.
జనాభా ప్రకారం:
ఎ) గ్రామ పంచాయతీలకు తలకు ఒక్కంటికి సంవత్సరానికి 4/- రూపాయలు.
బి) మండలాలకు తలకు ఒక్కంటికి సంవత్సరానికి 8/-రూపాయలు.
సి) జిల్లా పరిషత్లకు తలకు ఒక్కంటికి సంవత్సరానికి 4/- రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఒక గ్రామ జనాభా వెయ్యి అనుకుంటే సంవత్సరానికి ఆ గ్రామానికి 1000X4000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బిచ్చమేస్తుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తుంటే ఆయా రాష్ట్రాల బడ్జెట్లో తలసరి ఇరవై రూపాయల నుండి యాభై రూపాయలదాకా పంచాయతీలకు ఇస్తున్నారు. కేరళ లాంటి పంచాయతీలకు 50 శాతం నిధులు కేటాయిస్తుంది.
ఎమ్ఎల్ఎ/ ఎంపీల రాజ్యం పోవాలి
ప్రస్తుతం గ్రామ, మండల, జిల్లా పరిపాలన ఎమ్ఎల్ఎలు, ఎమ్పిల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్ఎల్ఎలకు నియోజక వర్గ అభివృద్ధి నిధులు ఒక కోటి, కేంద్ర ప్రభుత్వం తమ ఎమ్పలకు నియోజక వర్గ అభివృద్ధి నిధులు ఎపిపిఎల్ఎడిఎస్ 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. ఆ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్లు కార్య నిర్వహణాధికారులుగా పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఖర్చు చేయడానికి స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎమ్పి/ఎమ్ఎల్ఎల చుట్టూరా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. వారు కరుణిస్తే అభివృద్ధి: వారు ‘శీతకన్ను’ వేస్తే దరిద్రం.. పరిస్థితి ఇలా వుంది. స్థానిక ప్రభుత్వాల పరిస్థితి 73, 74వ రాజ్యాంగ సవరణలకు ముందే బాగుండేది. కాగితాల మీద అధికారం అయితే వచ్చింది. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో అనుభవం మరోలా వుంది. ఏ రాజ్యాంగ సవరణ లేకముందే ఆనాటి పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్లు నిధులు, విధులు పుష్కలంగా వుండి అభివృద్ధికి బాటలు వేసేవారు. ఆనాటి పంచాయతీ సమితి ఎమ్ఎల్ కంటే శక్తివంతమైంది. జిల్లా పరిషత్ చైర్మన్ క్యాబినెట్ హోదా మంత్రి కంటే శక్తివంతుడిగా వుండేవాడు. జిల్లాకు రాజుగా, జడ్పి చైర్మన్ వుంటే, పంచాయతీ సమితి అధ్యక్షులు నలభై ఏడు ప్రభుత్వ శాఖలకు అధిపతిగా వుండి విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్ప, వ్యవసాయం, పశుపోషణ.. ఇలా చాలా శాఖలు సమితి, జిల్లా పరిషత్ ఆధీనంలో వుండేవి.
ఎమ్ఎల్ఎ/ఎంపీ లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న చట్ట సభలలో మంచి ప్రయోజనకరమైన చట్టాలు చేసే విధంగా పని చేయాలిగానీ స్థానిక ప్రభుత్వాల పనిలో జోక్యం చేసుకోవడం తగదు. ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలనే సామెత వుండనే వుంది కదా!
స్థానిక ప్రభుత్వాలు-చారిత్రక పరిణామం
ఆదిమ సమాజంలో ఆహార సేకరణ దశ నుండి ఆహారాన్ని పండించడం, ఉత్పత్తి దశకు చేరుకున్న మానవులు, అదనపు ఉత్పత్తులు దాచుకోవడానికి ఆవాసాలు ఏర్పరచుకున్నారు. చెట్లూ, పుట్టటు పట్టుకుని తిరిగే మానవులు, శాశ్వత ఆవాసాలకు వ్యవసాయ వృత్తి, ఆహార ఉత్పత్తి కారణమైంది. ఎప్పుడైతే స్వంత ఆస్తి, ఇల్లు, ముంగిలి ఏర్పడ్డాయో వాటిని గుర్తించడానికి రాజ్యం, స్టేట్ అనే వ్యవస్థ కావాల్సి వచ్చింది. ఇదే రాజ్యావతరణ సిద్ధాంతం. ఆ రాజ్యావతరణంలో ఏర్పడిన మొదటి ప్రభుత్వాలు, గుంపు ప్రభుత్వాలు.. అవి పెద్దవైతే గూడేలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు.. ఇలా జన సమూహం నివసించి ఒక ప్రత్యేక ప్రాంతానికి ఆయా దేశ కాల, వాతావరణ, స్థానిక పరిస్థితులను బట్టి పాలనా వ్యవస్థలు ఏర్పడ్డాయి. అలా మొదలైనవే గణ రాజ్యాలు. గణాల మధ్య, రాజ్యాల మధ్య, రాజ్య విస్తరణ కాంక్షలో కలసిపోవడం, విడిపోవడం, మళ్లీ యుద్ధాలు, మళ్ళా 836 గ్రామ పంచాయతిలు కలవడం.. ఇలా పరిణామ క్రమంలో ఇప్పుడున్న దేశాలు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దేశాల మధ్య సమన్వయానికి యుద్ధాలకు విరామం ప్రకటించడానికి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసుకున్నాం.
కంటి ముందు పాలన- ఇంటి ముందు ప్రభుత్వం
గ్రీకు నాగరికత నగర రాజ్యాలదయితే మన భారతదేశంలో సంస్థానాలు, రాజులు, రాజ్యాలూ, చక్రవర్తులూ, సామంతులూ, సామంత రాజ్యాలుగా పరిణామ క్రమం పొందింది. ఏదేమైనా ప్రజలు నివసించే చోట పాలన వుండేది. అది కాస్తా ఆధిపత్య, సామ్రాజ్యవాద ధోరణితో ఒకరి మీద మరొకరు పెత్తనం చేసే క్రమంలో సంస్థానాల నుండి రాజ్యాలు, దేశాలుగా ఏర్పడి పాలన కొంత కష్టమైంది. మొదట కంటి ముందు పాలన-ఇంటి ముందు ప్రభుత్వం వుండేది. కాలక్రమంలో ఇలా గల్లీలో సమస్యలకు ఢిల్లీలో పరిష్కారం వెదికే పరిస్థితి వచ్చింది. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాధినేతలు దేశాలు వున్నా స్థానిక ప్రభుత్వాలకు ‘కౌంటీ’లని ఇతరత్రా ఏ పేరుతో పిలిచినా కూడా వాటికి స్వతంత్రత, ఆర్థిక, పాలనా విషయాల్లో వెసులుబాటు కల్పించాయి. అవి చేయి చాచే పరిస్థితి లేకుండా అధికారాలు, నిధులూ పైకి బదలాయించి పై ప్రభుత్వాలే స్థానిక ప్రభుత్వాల నుండి వాటా తీసుకునే పరిస్థితి వుంది.
థియరీ ఆఫ్ సబ్సిడియారిటీ- పౌరుడు కేంద్రంగా పాలన
“పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి” అన్నారు పెద్దలు. అంటే ఎవరి ఆలోచనలు వారివే. ఎవరి జిహ్వ చాపల్యాన్ని బట్టి వారు తినే పదార్థాలను ఎంచుకోవచ్చు. అది వారి వ్యక్తిగత ఇష్టం. అదే కుటుంబంలో తమ అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటే తల్లితండ్రుల ఇష్టం మాత్రం చెల్లదు. మొదట పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అడగాలి. ఆ తర్వాత అబ్బాయి తరపువారిని అడగాలి. ఇలా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అమ్మాయి పెళ్లి దగ్గరికి వస్తే వ్యక్తి స్వేచ్ఛ హరించింది కుటుంబానికి అధికారం వచ్చింది. మనం ఒక్కరి కోసం మన ఇంటి ముందు రోడ్డు వేసుకోలేం.
అలాగే మన పిల్లల కోసం మనం ఒక స్కూలు పెట్టుకోలేం. అలాగే మా కుటుంబం కోసం మాత్రమే ఒక ఆసుపత్రి కట్టుకోలేం. ఇలాంటి వాటిని సమిష్టి అవసరాలు అంటారు. ఇలాంటి సమిష్టి అవసరాల కోసమే స్థానిక ప్రభుత్వాలు కావాలి.
ఒక రోడ్డు ఉదాహరణగా తీసుకుంటే మన ఊళ్లో రోడ్డు వేయాలంటే గ్రామ పంచాయతీ వేయాలి. మన ఊరి నుండి మరో పక్క ఊరికి రోడ్డు వేయాలంటే మండల పరిషత్ చూడాలి. అలాగే ఒక మండలం నుండి మరో మండల కేంద్రానికి రోడ్డు వేయాలంటే జిల్లా పరిషత్ ఒక జిల్లా నుండి మరో జిల్లాకు రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం;
ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రోడ్డు వేయాలంటే జాతీయ రహదారుల సంస్థ.. ఇలా అంచెలంచెలుగా పనుల విభజన జరుగుతుంది. ఇది ఒక్కరోజు విషయమే కాదు, అన్ని పనులూ ఇలా కింది నుండి పైకి- పని పరిధిని బట్టి వికేంద్రీ కరించబడాలి. కానీ వాస్తవంలో మన దేశంలో గ్రామంలో వేసే రోడ్డుపని ‘ప్రధాన మంత్రి సడక్ యోజన’ అనే పథకం కింద, ప్రాథమిక పాఠకుల మౌలిక వసతుల కోసం సర్వశిక్షా అభియాన్, మన ఊళ్లో ఆశా వర్కర్ నియామకం, జాతీయ ఆరోగ్య మిషన్ కింద జరుగుతుంది. ఇది పచ్చిగా చెప్పాలంటే గల్లీలో సమస్యకు ఢిల్లీలో పరిష్కారాలు వెతకడం లాంటిది.
మన ఊళ్లో మన పాలన ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే పౌరుడు కేంద్రంగా పాలన సాగాలి. దాన్నే ‘థియరీ ఆఫ్ సబ్సిడియారిటీ సూత్రం’ అంటారు. ప్రజల భాగస్వామ్యం కోసం ఇది సరైన పద్ధతి.
థియరీ ఆఫ్ సబ్సిడీయారిటీ అంటే ఈ థియరీలో ‘సబ్సిడీ’ అనే మాట ఉంది కనుక చాలామంది ప్రజలకు ఉచితంగా ఇచ్చే సబ్సిడీ అనుకుంటారు. థియరీ ఆఫ్ సబ్సిడీయారిటీ అంటే అది కాదు. “వ్యక్తి కేంద్రంగా పాలన” సాగాలని ఈ సిద్ధాంతం చెబుతుంది.
వ్యక్తి నుంచి కుటుంబం కుటుంబం నుంచి గ్రామం లేక పట్టణం అక్కడ నుండి మండలం, జిల్లా, రాష్ట్రం, జాతీయ ప్రభుత్వం వరకు వ్యక్తి ‘సెంట్రిక్’ గా (కేంద్రంగా) ప్రభుత్వాలు పని చేసే వ్యవస్థనే మనం “థియరీ ఆఫ్ సబ్సిడీయారిటీ” అంటాం.
అలాగే అధికార వికేంద్రీకరణ అంటే మనం పుస్తకాలలో చదువుకున్నట్లు పైన కేంద్రం నుండి కింద గ్రామం వరకు పై నుంచి కిందికి అధికార వికేంద్రీకరణ చేస్తామని చెబుతారు. కానీ అసలైన నిజమైన అధికార వికేంద్రీకరణ అంటే గ్రామం ‘బేస్’గా లేక పట్టణం కేంద్రంగా మొదలై మండలం, జిల్లా, రాష్ట్రం ఇలా కేంద్రం వరకు కింది నుంచి పైకి అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే నిజమైన అధికార వికేంద్రీకరణగా చెప్పుకోవచ్చు.
ఇలా ఇంటి ముందు ప్రభుత్వం-కంటి ముందు పాలన జరగాలంటే అధికార వికేంద్రీకరణ సూత్రం పాటించాలి. దీని వ్యతిరేకులు ఒక వాదం మన ముందుకు తెస్తారు. అదేమిటంటే కింది స్థాయిలో పని చేసే ప్రజా ప్రతినిధులు, అవినీతిపరులు, వారి పాలనా సామర్థ్యం తక్కువ. వారికి పాలించే అర్హతలు లేవు. చదువు, ఇతరత్రా తెలివితేటలు వుండవు. దాంతో అధికార వికేంద్రీకరణ కాస్తా అవినీతి వికేంద్రీకరణగా మారుతుందని అంటారు.
ఇది ఆడవాళ్లకు ఆడవాళ్లే శతృవు అని ఆడవాళ్లను వ్యతిరేకించేవారు సృష్టించిన సామెత లాగానే స్థానికంగా అధికారాలు వికేంద్రీకరణ వద్దనే వారి వాదన. అందుకే ఏ అంచెలో ఆ అంచె అవినీతి జరగకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏర్పాటు చేయాలి. అంటే స్థానిక ప్రభుత్వం అవినీతిపై ‘అంబుడ్స్ మెన్’ నియమించాలి. ఈ వ్యవస్థ ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో వుంది. అంబుడ్స్ మెన్ ఒక స్వతంత్ర సంస్థగా వుండి స్థానిక ప్రభుత్వాలలో బాధ్యతా రహితంగా ప్రవర్తించిన ప్రజా ప్రతినిధులను విచారించి చర్య తీసుకునే అధికారంతో వుండాలి. తప్పుకి శిక్ష, మంచిని ప్రోత్సహించే విధంగా వుండాలి.
Read also:hindi.vaartha.com
Read also: