ఆసక్తి, పట్టుదల, విజ్ఞా నతృష్ణ మానవ జీవితాన్ని ఊహాతీతమైన మలుపు తిప్పగలదు. ఏదో సాధించాలనే తపనతో, నిద్రాహారాలు వదిలేసి, నిరంతర శ్రమతో, నిస్వార్థమైన ఆలోచనలతో, పరిశోధనలతో మానవ ప్రపంచాన్ని వినూత్నంగా ఆవిష్కరించే ప్రయత్నంలో సర్వ సుఖాలు త్యజించి, జ్ఞా నమే సంపదగా, మానవ శ్రేయస్సే సర్వస్వంగా భావించి, వయసంతా కరిగి పోయి, శరీరమంతా ముడతలు పడి వార్థక్యపు అంచులపై నిలబడి చూస్తే ముసలితనం ఆవహించిందని, మరణం దగ్గర పడిందని తెలుసుకునేసరికి జీవితం తమ చేతుల్లో లేదని అవగతమౌతుంది. ఇవీ శాస్త్రవేత్తల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలు. జ్ఞాపకాల పుస్తకాన్ని తెరచి చూస్తే తాము ఈ ప్రపంచానికి ఏమి అందించామో, ఎలాంటి ఆవిష్కరణలతో జనజీవితాలను ఎలా ప్రభావితం చేసామో ఆవలోకనం చేసుకుని, ప్రపంచం దృష్టిలో తమకున్న విశిష్టమైన స్థానాన్ని, గౌరవాన్ని తలచుకుని జీవితానికి ఇంతకంటే తృప్తి, పరమార్థం మరొకటి లేదని భావించి, మానసికానం దంతో, ఉద్వేగంతో అంతిమ క్షణాలను ఆనందంగా గడిపిన శాస్త్రవేత్తల జీవితాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినా, వారి పరిశోధనల, ఆవిష్కరణల ఫలితాలను అనుభవిస్తున్న ప్రపంచం వారి సేవలను మరవదు. ఈరోజు ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో ఇంత ప్రగతి సాధించినా ఇంకా ఏదో సాధించాలనే తపన మాత్రం సజీవంగా ఉండడానికి నాటి శాస్త్రవేత్తలు నాటిన బీజాలే కారణం.
వారి ఆలోచనలే జ్ఞానమై, వారి పరిశోధనలే ఆవిష్కరణలై నేటి ప్రపంచాన్ని మనం ఊహించని విధంగా మార్చిన సంగతి మరవలేం. నిత్య హోమంలా సాగిన విజ్ఞాన మథనం ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నో సంఘర్షణలకు గురై, ఎన్నో సంక్షోభా లను చవిచూసి చివరికి ‘కృత్రిమ మేధ’ అనే వినూత్నమైన సాంకేతిక ప్రక్రియకు దోహదం చేసిం ది. కృత్రిమ మేధ గురించి వివరించే ముందుగా మానవ మేధస్సుకు సంబంధించిన విషయాలను, మానవ మేధస్సు ఎలాంటి ఆలోచనలకు, పరిణామాలకు గురౌతున్నదో, భవిష్య మానవ జీవితాల్లో ‘కృత్రిమ మేధ’ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రపంచంలోని ఏడు వింతల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. వీటి గురించి ఆసక్తిగా వింటాం. ‘కొత్తక వింత పాతొక రోత’గా పాత విషయా లను పక్కన బెట్టి, కొత్త వింతల కోసం అన్వేషిస్తాం, ఆనందపడతాం. వర్తమానంలో నిత్యం మన కళ్ల ముందు ఎన్నో వింతలు కనబడుతు న్నాయి. కలలో కూడా ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇలలో జరుగుతున్నాయి. ఆకాశమే హద్దుగా అంతులేని వింత కథలకు ప్రాణమొచ్చి, మన ముందు సాక్షాత్కరిస్తున్న భావన కలుగుతున్నది. మన భ్రమలు, ఊహలు నిజమైన మన ముందే వాస్తవమై కదలాడుతున్నాయి. చిత్రాలు విచిత్రాలుగా రూపు దిద్దుకుని జీవం పోసుకొని, మన ఎదుటే నిలబడుతున్నాయి. కలయా? నిజమా? అనే భ్రాంతిని కలిగిస్తున్నాయి చూపులను కట్టిపడేస్తున్నాయి.
మనం ఊహించుకునే కల్పనలు, కల్పిత గాథలు వాస్తవమై సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఏదో మాయ మన కళ్లకు కనికట్టు చేసి, క్షణ కాలం విభ్రమకు గురి చేసి, ఇంద్రజాల విద్య ల మాదిరిగా మనల్ని భ్రమలో ముంచి, రసవత్తరంగా రక్తి కట్టించే కృత్రిమ సన్నివేశాల సమాహారాలతో ఉర్రూతలూగించి, ఈ ప్రపంచాన్ని తెలియని వింతలోకపు శిఖరాలకు తోడ్కొని పోతున్నాయి. సృష్టిలో ఇన్ని అద్భుతమైన కళలున్నా యా? ఇంతటి ప్రతిభా సామర్థ్యాలు మానవుడి మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నాయా? మానవ మేధస్సు ఇంతగా వికసించి, విస్తృతమై మానవ ప్రపంచాన్ని శాసిస్తుందా? అనే సంశయం కలగడం సహజం. నేటి ప్రపంచంలో చోటు చేసుకుంటున్న అద్భుతాలను కొన్ని దశాబ్దాల కిందట ఎవరూ ఊహించి ఉండరు, పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మనమందరం ఎంతో కొంత చదివే ఉంటాం. మన పెద్దలు చెబితే వినే ఉంటాం. ఈ భూ ప్రపంచంలో అప్పటికి లేనివాటికి, భవిష్యత్తు ఇలా ఉండవచ్చని ఊహించిన వాటికి వాస్తవ రూపమిచ్చి ఒక అద్భుతమైన నూతన ప్రపంచ సృష్టికి నాంది పలుకుతున్న నేటి మానవ విజ్ఞా నానికి సాగిలపడి, సాష్టాంగ ప్రణామాలు తెలియచేయాలో, మన కల్పితాలకు మనమే బానిసలమై, మన మేధస్సుకు మనమే విశాలమైన రెక్కలు తొడిగి, మన జీవితాలను మనమే ఛిద్రం చేసుకుంటున్నామో తెలియని ఒక సందిగ్ధం ఆవహించింది. అందమైన ప్రపంచంలో అపరిమితమైన అద్భుతాలను సృష్టించి, సైన్స్ ఫిక్షన్ కథల స్థాయిని దాటి, మానవ జీవితాలను ఒక తెలియని, వింత లోకాలకు తోడ్కొని పోయి అపరిమి తమైన మానసికానందానికి గురిచేసి, కనీ వినీ ఎరుగని అనుభూతిని ఆస్వాదించే స్థితిని స్పృశించడానికి విజ్ఞాన గవాక్షాలు తెరచుకుంటున్నాయి. మనమెక్కడున్నాం? ఒకప్పటి పరిస్థితులను సింహావలో కనం చేసుకుంటే అప్పటి మనమెక్కడ? ఇప్పటి మనమెక్కడ? అనే ఆశ్చర్యం కలగక తప్పదు.
ఎడ్లబండ్ల నుండి ఎయిర్ బస్సుల వరకు మానవ విజ్ఞానం అనేక మలుపులు తిరిగింది. భూగోళం నుండి ఖగోళం వరకు మానవ ఆలోచనా పరిధి విస్తృత రూపం ధరించింది. మానవ మేధస్సు విస్తృతమై, నిరంతరం అనంతమైన విజ్ఞాన సాగర మథనం చేస్తూ, అలుపెరుగని శ్రమతో అద్భుతాలను సృష్టిస్తూ ప్రతిసృష్టి చేయగల సత్తా సాధిస్తున్న మానవ మహా విజ్ఞానాన్ని వేనోళ్ల ప్రశంసించక తప్ప దు. అడవుల్లో తిరుగుతూ ఆకులు, అలాలు ఆరగిస్తూ, వీలైనప్పుడల్లా జంతువులను వేటాడి, పచ్చి మాంసం భుజిస్తూ, అభద్రతా వాతావరణంలో ఆయువును అరచేతిలో పట్టుకుని జీవించే నాటి మానవుడెక్కడ? సకల జీవరాశులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఆకాశాన్నంటిన భవంతుల్లో హాయిగా జీవించే నేటి మానవుడెక్కడ? నాగరికతకు దూరంగా జంతు సదృశమైన జీవన విధానంతో శతాబ్దాల చీకటి జీవితాలను గడిపిన ప్రాచీన మానవుడెక్కడ? నగ్నత్వం నుండి నాగరికత్వం వైపు అడుగులు వేసి, భువనం నుండి గగనం వరకు ఈ మహా విశ్వంలోని మాయను చేధించి, మహోన్నత శిఖరాలను తాకీ, ఝంఝామారుతంలా దూసుకుపోతూ, గాడాంధకారం నుండి విజ్ఞానమనే వెలుగు మార్గంలో వడి వడిగా పరుగులు పెడుతూ, కాలంతో పోటీ పడుతూ, భువిని స్వర్గతుల్యంగా చేయాలని ఆరాట పడుతున్న ఆధునిక మానవ విజ్ఞాన తృష్ణను కనులారా వీక్షిస్తూ, మనసారా ఆనందిస్తూ, అలవికాని, అసాధ్యమనుకున్న అనుభూతిని ఆస్వాదిస్తూ, మానవ ప్రతిభను మహోన్నతంగా నిలిపిన ఆధునిక విజ్ఞా న మహత్తును ఆరాధించవలసిందే, అభినం దించవలసిందే.
ఇప్పుడు మానవ ఆలోచనా శక్తి కంటే అత్యంత వేగంగా కచ్చితమైన ప్రమాణంతో పని చేసే యంత్రాలు, కం – ప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. మానవ జ్ఞాపకశక్తి పరిమిత స్థాయిలో ఉంటుంది. ఒక్కోసారి అనారోగ్య కారణాల రీత్యా, వయసురీత్యా జ్ఞాపకశక్తి తరిగి పోవచ్చు. విపరీతమైన ఒత్తిడి, మానసిక, శారీరక రుగ్మతలు వంటి పలు కారణాల వలన మనిషిలోని తెలివితేటలు క్షీణించ వచ్చు. అలాగే అధిక శ్రమతో కూడిన పనుల వలన మనిషి అలసటకు గురి కావడం జరుగుతుంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి మనిషికి పట్టే సమయం కూడా ఎక్కువే. మనిషి చేసే పనిలో తప్పులు దొర్లడం కూడా సహజమే. ప్రమా దకరమైన పనుల్లో మానవ శక్తి వినియోగం వలన జరిగే అనర్దాలు ఊహాతీతం. మానవ శక్తిపై అధిక వ్యయం చేయడం తప్పదు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట వైఫల్యం చెందక తప్పదు. వీటిని అధిగమించి, సమయాన్ని, వృథా ఖర్చును అరికట్టి, అత్యంత నాణ్యమైన ఫలితాలను సాధించి లాభాలను ఆర్జించడానికి భవిష్యత్తులో అన్ని రంగాల్లో ‘కృత్రిమ మేధ”(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కీలక పాత్ర వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధను సంక్షిప్తంగా “ఎ.ఐ” అని పిలుస్తారు. కంప్యూటర్ల యుగంలో, ఆధునిక సాంకేతిక వ్యవస్థలో కృత్రిమ మేధ ఒక గొప్ప అద్భుతం. ఇది ఒక కంప్యూటర్ జనరేటెడ్ ఇంటెలిజెన్స్.
మనిషి అందించే డేటా ఆధారంగా మనిషి తెలివితేటలను పోలినట్టుగా ఒక మిషన్ లేదా రోబో లేదా కంప్యూటర్ పనిచేయడం కృత్రిమ మేధ లక్ష్యం. భవిష్యత్తులో ఏ.ఐ.లో ప్రావీణ్యత సంపాదించడంలోనే ఉద్యోగ భద్రత ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని యువ ఇంజినీర్లు జీర్ణించుకోక తప్పదు. ప్రోగ్రామింగ్, మిషన్ లెర్నింగ్ వంటి అంశాలపై పట్టు సాధించ డం వలన ఏ.ఐ.లో ప్రావీణ్యత సాధించవచ్చు. భూత, భవిష్య వర్తమానాలను జ్ఞాపకం ఉంచుకుని మనిషి అందించే డేటా సాయంతో రోబోలు కానీ కంప్యూటర్ల ద్వారా పనిచేసే యంత్రాలు గానీ అత్యంత సమర్థవంతంగా తమ భూమిక పోషించగలుగుతాయి. కచ్చితత్వం, మనిషి కంటే అనేక రెట్ల సామర్థ్యం కృత్రిమ మేధ ద్వారా పనిచేసే మెషీన్ల స్వంతం. అందుకే వీటి పట్ల అనేక సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి సంస్థలు ఏ.ఐ. పట్ల అధిక శ్రద్ధ చూపిస్తున్నాయి. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధ స్వంతం కాక తప్పదు. యువత కూడా ప్రస్తుతం నేర్చుకుంటున్న అనేక కంప్యూటర్ కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్కు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. ప్రోగ్రామింగ్, మిషన్ లెర్నింగ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల యువ ఇంజినీర్లు ఆసక్తి చూపుతున్నారు. వేగంగా మారుతున్న పరిణామాలను ఆకళింపు చేసుకుని, ఎప్పటికప్పుడు వినూత్న పంథాలో నిరంతర విద్యార్థులా నేటి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు శ్రమించకపోతే, వారి ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్థక మయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్ప టికే ప్రతీ సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ కోర్సుల పట్ల మక్కువ చూపుతున్నారు. ఇంజినీరింగ్ రంగంలో అనేక శాఖలున్నప్పటికీ, చదువు పూర్తయిన యువత పలుచోట్ల పనిచేసే అవకాశాలున్నప్పటికీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది చదువుకున్న ప్రతీ ఒక్కరి కలగా, లక్ష్యంగా, నేటి యువతకు అదొక ట్రెండ్లో మారిపోయింది. ఇంజినీరింగ్ చదివినవారే కాకుండా, ఇతర డిగ్రీలు చదివినవారు కూడా కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని, జీతం ఎంతయినా పర్వాలేదనే సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తూ, ముల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రతీ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సాఫ్ట్వేర్ ఆశావహులకు ఉద్యోగాలు కల్పించడం కష్టతరంగా మారింది. కొవిడ్ సంక్షోభవం సృష్టించిన ఆర్ధిక విధ్వంసం వలన ఇప్పటికీ పలు ఎం.ఎన్.సి.లు పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. ఆయా కంపెనీల ఉద్యోగులు ఈనాటికీ పూర్తి స్థాయిలో ఆఫీసులకు హాజరు కావడం లేదు. చాలామంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోంకే మక్కువ చూపుతున్నారు.. కొవిడ్ సంక్షోభం సమసిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొనే తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా, పుండు మీద కారం చల్లినట్టుగా ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ‘ఆర్థిక మాంద్యం’ ప్రభావం వలన పలు బహుళజాతి కంపెనీలు నష్టాల బాట పట్టాయి. రెషిసన్ వలన చాలా మంది ఉద్యోగాలు డైలమాలో పడిపోయాయి. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు అరకొర జీతాలతో వని చేస్తున్నారు.
ప్రస్తుతం అధిక జీతాలతో ఉద్యోగాలిచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో ఎడారిలో ఒయాసిస్సులా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిజం వంటి అంశాలు ఆశాదీపంలా అగుపిస్తున్నాయి. అయితే పెరుగుతున్న జనాభాతో పాటు విద్యావంతుల శాతం కూడా బాగా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల పట్ల మక్కువ చూపడం వలన అందరికీ ఉద్యోగావ కాశాలు కల్పించే అవకాశాలు లేవు. పైగా సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. ప్రతీ రంగం టెక్నాలజీతో అనుసంధానిం చబడింది. ఉద్యోగార్థుల శాతం పెరిగింది. ఏదో కొద్ది మంది అత్యంత ప్రతిభావంతులకు తప్ప, గతంలో మాదిరిగా అందరికీ లక్షల్లో జీతాలిచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు. భవిష్యత్తులో కూడా ఉండవు. ఎక్కువ జీతాలిచ్చే పరిస్థితులు లేనందున మానవ శక్తిని తగ్గించి, యంత్రిక శక్తిని విరివిగా వినియోగంలోకి తీసుకువచ్చే ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవ తెలివితేటలను కంప్యూటర్లకు అనుసంధానించి, చాకచక్యంగా అత్యంత సమర్థవంతంగా పనిచేయించగల సాంకేతిక పరిజ్ఞానానికి అంకురార్పణ చేయడం జరిగింది. దీనినే ‘కృత్రిమ మేధ’గా పేర్కొంటున్నారు. దశాబ్దాల కిందట రూపుదిద్దుకున్న కృత్రిమ మేధ ప్రక్రియ పలు కారణాల వలన ఇప్పటివరకు వేగం సంతరించు కోలేదు. అయితే భవిష్యత్తులో కృత్రిమ మేధ ‘ఏ.ఐ.కే అత్యంత ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి.
ఒకప్పుడు గణిత సమస్యల సాధన కోసం విద్యార్థులు ఎంతగానో శ్రమించేవారు. ఎక్కాల పట్టికలతో కుస్తీ పట్టి లెక్కలు చేసేవారు. పెద్ద సంఖ్యలతో కూడిక లు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు చేసేవారు. దీని వలన విద్యార్థులకు మొదట్లో శ్రమ అనిపించినా. అలవాటు పడిన తర్వాత అనేక అంశాల్లో ఈ సాధన బాగా ఉపకరించేది. అయితే తర్వాత వచ్చిన కాలుక్యులేటర్ విద్యార్థులకే కాకుండా, వ్యాపారులకు, ఇతరులకు గణిత సమస్యలకు ఉత్తమ సాధనంగా మారింది. దీనితో ఆలోచించే అవసరం తగ్గింది. ఇప్పుడు ఎంత మేధావులకైనా మొబైల్లోని కాలుక్యులేటర్ సాయం. లేనిదే చిన్న చిన్న గణిత సాధనలు కూడా సాధ్యం కాకుండా. పోయాయి. అలాగే గడియారాలు పోయి డిజిటల్ వాచీలు, డిజిటల్ గోడ గడియారాలు, మొబైల్ కాక్స్ అందుబాటులోకి వచ్చాయి. గడియారంలో కదిలే గంటల, నిమిషాల, సెకన్ ముల్లులతో పని లేకుండా పోయింది. అలాగే ఒకప్పుడు రేడియోలో నాటకాలు, కథలు వింటుంటే మన ఆలోచనా శక్తి పెరిగేది. రేడియో అనే శ్రవణ సాధనం వలన మన మనోఫలకంపై దృశ్యాన్ని ఊహించు కుని ఆ సన్నివేశాన్ని కళ్లముందు కనిపించేటట్టు చేసే ఊహాశక్తి మనలో ఉండేది. టెలివిజన్ ఆవిష్కరణతో ఆకాశవాణి ప్రాభవం అంతరించిం ది. శబ్దంతో పాటు తెరపై కనిపించడంతో మన ఊహాశక్తికి పదును పెట్టే అవసరం లేకుండా పోయింది. అలాగే ఉత్తరాలు రాయడంలో ఎంతో భావుకత, కళాత్మకత గోచరించేది.. మొబైల్ ఫోన్ల వలన, ఉత్తరాల శకం ముగిసింది.
ఇలా మానవ మేధస్సుతో జరిగిన, జరుగుతున్న మార్పుల ప్రక్రియ మానవ మేధస్సునే హరిస్తున్నది. ఆలోచనా శక్తి క్షీణిస్తున్నది. జ్ఞా పకాలను మస్తిష్కంలో బంధించే అవసరం లేకుండా కంప్యూటర్ల హార్డ్ డిస్కులు, ఇతర సాంకేతిక వ్యవస్థలు మానవ మస్తష్కానానికి పని లేకుండా చేస్తున్నాయి. ఇలా ఒకటేమిటి.. అనేక ఎలక్ట్రానిక్ సాధనాలు మానవ జీవితంలో తిష్ఠ వేసాయి. ఇవన్నీ సాంకేతిక విప్లవం తెచ్చిన మార్పులు. ఎప్పుడైతే మనం సులభతరమైన పద్ధతులకు అలవాటు పడ్డామో. యంత్రాల సహాయంతో మన పనులను చక్కదిద్దడం మొదలుపెట్టామో. అప్పటి నుండే మన జీవితాల్లో ‘కృత్రిమ మేధ యుగం’ మొదలైందని చెప్పవచ్చు. కృత్రిమ మేధతో మన తెలివితేటలను యంత్రాలకు, కంప్యూటర్లకు అప్పగించినట్టే. అయితే ఈ ఆధునిక యుగంలో పరిశోధనలు మరింత వేగంగా సాగుతూ, సాంకేతిక వ్యవస్థలు అత్యంత అధునాతన పరిజ్ఞానాన్ని సంతరించుకుని ‘రోబో’ యుగాన్ని స్వాగతిస్తున్నది. దీని పర్యవసాన ఫలితమే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ల ప్రవేశానికి మార్గం సులభతరం చేసింది. రోబో చలన చిత్రంలోని కల్పితాలు నేడు వాస్తవమై కృత్రిమ మేధ రూపంలో మన చెంతకు అరుదెంచాయి. ఒకవైపు టెక్నాలజీ సాయంతో మానవ జీవితం విప్లవాత్మక మార్పు సంరతించుకుంటుని సంతోషించాలో, కృత్రిమ మేధ వలన రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయోనని ఆందోళన పడాలో అర్ధం కావడం లేదు.
ఇప్పటికే చదువుకున్న వారు, చదువు లేనివారు సైతం స్మార్ట్ఫోన్ విన్యాసాలకు అలవాటు పడ్డారు. ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. అసభ్యమైన దృశ్యాలకు, మోసాలకు ఆన్లైన్ అడ్డాగా మారింది. యూట్యూబ్’ సంపాదనకు ఒక దగ్గర దారిగా మారింది. మంచికి లైకులు, పేర్లు, సఖ్ సైట్లు ఉండవు. నగ్నంగా ఆసభ్యంగా చిత్రీకరించి, సాంఘిక మాధ్యమాల్లో చొప్పిస్తున్న వీడియోలకు, కథనాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని అనేక యూట్యూబ్ ఛానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా మారిన కొంతమంది యూట్యూబర్లు మంచి-చెడు విచక్షణ మరచిపోయి, వ్యక్తిగత జీవితాలను సైతం బయటకు లాగి, కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తూ, విలువలకు తిలోదకాలి స్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను కూడా సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రదర్శిస్తూ, ఆదిమానవ సంస్కృతిని అధునాతన సంస్కృతిగా వర్ణిస్తూ, ఇలాగే జీవించాలనే మాదిరిగా సమాజంపై విషం చిందిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీ ఇందుకు దోహదం చేస్తున్నది. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించవలసిన టెక్నాలజీ ఈ విధంగా మానవ జీవితాలను ఛిద్రం చేయడం చూస్తున్నాం. డేటా చౌర్యంతో గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. టెక్నాలజీ తెచ్చిన మార్పులతో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతున్నది.
కృత్రిమ మేధతో జరగబోయే విపత్కర పరిణామాల గురించి సాంకేతిక రంగ నిపుణులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవాలి. మానవ విజ్ఞానంతో సృష్టించిన ‘కృత్రిమ మేధ’ మానవాళికే పెనుముప్పుగా మారుతుందనే కథనాలు వినబడుతున్నాయి. ఈ సందర్భంగా మనం చిన్నతనంలో చదివిన ఒక కథ గుర్తుకు వస్తున్నది. ఒక శాస్త్రవేత్త ఒక నిర్మానుష్య ప్రదేశంలో చచ్చిపడి ఉన్న సింహం కళేబరాన్ని చూసి, దానికి జీవం పోయాలనే ఆసక్తి కనబరిచాడు. ఆ శాస్త్రవేత్త తన విజ్ఞానంతో ఆ సింహాన్ని పునర్జీవింపచేయగా, ఆ సింహం తనను బతికించిన ఆ శాస్త్రవేత్తకు తన పంజా రుచి చూపించి, చంపింది. కృత్రిమ మేధ కూడా ఈ కథ మాదిరిగానే చివరికి మానవులనే శాసించి మానవుల ఆలోచనా శక్తిని, కష్టించే తత్వాన్ని హరించి అధోగతి పాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనం సృష్టించిన కృత్రిమ మేధ భస్మాసుర హస్తం కారాదు. ఇప్పటికే మన చెంతకొచ్చిన సాంకేతిక మన జ్ఞానాన్ని, సృజనాత్మకతను హరించి, మనిషిని మరబొమ్మగా మార్చిన వైనం చూస్తు న్నాం. ఒక కృత్రిమ మేధ మానవ జీవితాలపై ఎలాంటి ప్రభావం తీసుకువస్తుందో ఊహించడానికే భయంగా ఉంది. కంప్యూటర్ ఆవిష్కరణ ఓ అద్భుతం కంప్యూటర్ అనేది ఒక అద్భుతమైన మానవ నిర్మిత ఎలక్ట్రానిక్ సాధనం.
ఇప్పటివరకు సైన్స్ సాధించిన ప్రగతి, సైన్స్ ద్వారా జరిగిన ఆవిష్కరణలు ఒక ఎత్తయితే మానవ విజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంలో కంప్యూటర్ ఆవిష్కరణ ఒక ఎత్తు. అవధులు లేని మానవ విజ్ఞానానికి పరాకాష్ఠ కంప్యూటర్ ఆవిష్కరణ. టెలిఫోన్ల నుండి మొబైల్ ఫోన్ల వరకు, రేడియో నుండి టెలివిజన్ వరకు, టెలీస్కోప్ నుండి మైక్రోస్కోప్ వరకు ఒకటేమిటి.. రాకెట్లు, రోబోలు వంటి ఆవిష్కరణలతో మానవ ప్రపంచంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. మానవ మేధస్సును అత్యున్నతంగా నిలబెట్టిన అద్భుతమైన కంప్యూటర్ ఆవిష్కరణతో మానవుడు భువన, గగనాలను శాసించే స్థితికి చేరుకున్నాడు. మానవ జిజ్ఞానకు అత్యున్నతమైన రూపకల్పన కంప్యూటర్. నేడు విద్య, వైద్య రంగాలతో పాటు సమాచార వ్యవస్థలో కంప్యూటర్ల పాత్ర కీలకంగా మారింది. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటు చేసుకున్న అనిర్వచనీయ మైన మార్పులను నేడు మనం ప్రత్యక్షంగా అనుభవిస్తూ, మన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నాం. స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ప్రపంచం మన ముందు సాగిలబడి, మనకు పాదాక్రాంతమైన అనుభూతి ఏర్పడింది. అలాగే కంప్యూటర్ రంగంలో అనేక మార్పులు సంభవించాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్లు అన్ని రంగాల్లో ప్రవేశపెట్ట బడ్డాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు, బ్యాంకింగ్ రంగం, ఇతర ఆర్థిక వ్యవస్థలు, రైల్వేలు, విమానాలు, రక్షణ, అంతరిక్ష రంగాలన్నీ కంప్యూటర్లతో అనుసంధానిం చబడి పని చేస్తున్నాయి.
మానవ మేధస్సుకు కంప్యూటర్ ఒక నిదర్శనం. మానవ విజ్ఞానంలో ఇదొక మైలురాయి. అధునాతన టెక్నాలజీతో కూడిన కంప్యూటర్లు లేనిదే నేడు మానవ జీవితం స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులను సంతరించుకుని ఎన్నో అధ్యయనాలు, పరిశోధనల తర్వాత ‘కృత్రిమ మేధ(ఎ.ఐ.)’ అనే ఒక వినూత్న ప్రక్రియ సమస్త వర్తమాన మానవ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపి ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ పరిణామాల వలన భవిష్య మానవ జీవన ముఖచిత్రం సమూలంగా మారిపోయే అవకాశాలున్నాయి. ‘కృత్రిమ మేధ’ వలన ఒకవైపు ఆనందం, మరోవైపు భయం తొంగి చూస్తున్నాయి. ఈ విషయా లను ప్రస్తావించే ముందు కంప్యూటర్కు సంబంధించిన మూలాల గురించి క్లుప్తం గానైనా ప్రస్తావించడం సముచితం, సందర్భోచితం. కంప్యూటర్ ఆవిష్కర్త.. లండన్కు చెందిన ఛార్లెస్ బాబేజ్ కంప్యూటర్ ఆవిష్కర్త. అయితే ఆధునిక కంప్యూటర్ ఆవిష్కర్తగా యు.కె.కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త అలాన్ ఎమ్. టూరింగ్ విశేషమైన ఖ్యాతి గడించాడు. కృత్రిమ మేధస్సు రూపొందడానికి 1950లో టూరింగ్ వెలువరించిన ‘కంప్యూ టర్ మెషీనరీ అండ్ ఇంటెలిజెన్స్’ ప్రచురణ దోహదం చేసింది. యంత్రాలు మానవుల్లా ఆలోచించగలవా? అనే సందేహం వినూత్న మైన పరిశోధనలకు ప్రేరణగా మారింది. ఒక యంత్రం మనిషిలా ఆలోచించాలి, దానిలో చలనం కలగాలి అనే విధంగా సాగిన టూరింగ్ ఆలోచనలు కృత్రిమ మేధస్సుకు దారి తీసాయి.
ఈ అంశంపై అతను చేసిన విశేషమైన కృషి కంప్యూటర్ మేధస్సుగా, కృత్రిమ మేధగా పరిగణింపబడింది. టూరింగ్ చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడమే కాకుండా ఈనాటి నేగవంతమైన కంప్యూటర్ విజ్ఞా నానికి బాటలు వేసాయి. మానవ విజ్ఞానంతో అనుసంధానం చేయబడిన కంప్యూటర్ పరిజ్ఞానంపై విశేష కృషి చేసిన అమెరికాకు చెందిన జాన్ మెక్ కార్తి కృత్రిమ మేధకు నామకరణం చేసిన వ్యక్తిగా ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు గాంచాడు. అమెరికాకు చెందిన గ్రేస్ హోవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల అభివృద్ధిలో, అమెరికా, హంగేరీ శాస్త్రవేత్త జాన్ వోన్ న్యూమాన్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ విషయంలో కీలక పాత్ర పోషించా డు. బ్రిటీషు శాస్త్రవేత్త అడా లవ్ లేస్ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్గా పేరు పొందారు. అమెరికాకు చెందిన మార్విన్ మిస్కీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ.ఐ.)లో, కెనడాకు చెందిన జేమ్స్ గార్లింగ్ జావా ప్రోగ్రామింగ్లో ప్రముఖ పాత్ర వహించారు. ఇలా ఎంతో మంది ప్రముఖులు అహరహం శ్రమించి, ఒక్కో అడుగు ముందుకేసారు. అందరి అడుగులు సుదీర్ఘ ప్రయాణాన్ని సులభత రం చేసాయి. వారి శ్రమకు ఫలితమే కృత్రిమ మేధ. వివిధ రంగాల్లో నెలకొన్న సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, అధిక ఖర్చులకు కళ్లెం వేయడం, సమయాన్ని ఆదా చేయడం, ఉత్పాదకత పెంచడం, ఏ.ఐ. సాధనాలతో, అలసట ఎరుగని రోబోలతో 24 గంటలు పని చేయించడం కృత్రిమ మేధ వలన సుసాధ్యం కాగలదు.
కృత్రిమ మేధ వేగవంతమైన ప్రపంచంలో ఉత్తమమైన సేవలను అందిస్తుంది. ఏ.ఐ. ప్రపంచంలోకి ఇప్పటికే అడుగులు పడ్డాయి. ఇక ఏ.ఐ. వలన ఒనగూరే లాభ నష్టాలను గురించి విశ్లేషిద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియల వలన సాంకేతికతకు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడుతుంది. కమ్యూనికేషన్, రవాణా, వైద్య తదితర రంగాల్లో గణనీయమైన మార్పులు సంభవించి ఆర్థిక ఎదుగుదల, నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడతాయి. సాంకేతిక సామర్థ్యంతో వ్యాపారం మెరుగు పడుతుంది. రోగులను కచ్చితమైన ప్రమాణా లతో డయాగ్నోసిస్ చేయడం, సత్వర చికిత్సలు, శస్త్రచికిత్సలు చేయడం, ఇంటివద్ద నుండే వైద్య పరీక్షలు చేసి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. కృత్రిమ మేధ(ఏ.ఐ.) ప్రభావంతో రాగల రోజుల్లో ప్రతిభావంతులైన యువత ఉపాధికి ఏవిధమైన నష్టం జరగదనే అభిప్రాయముంది. నైపుణ్యత లేని చదువులతో డిగ్రీలు సంపాదించి, కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చు కుని, ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా మారుతున్న వారికి భవిష్యత్తులో కృత్రిమ మేధ ఒక శరాఘాతంలా పరిణమించవచ్చు. కృత్రిమ మేధ వలన ఉద్యోగావకాశాలు తగ్గి, రోబోల ఆధిపత్యం మొదలయ్యే అవకాశం ఉందనే కథనాలు వెలువడుతున్నాయి. లాభనష్టాలెంత? మానవ భద్రతకు, వివిధ దేశాల రక్షణ వ్యవహారాలకు కృత్రిమ మేధ వలన ఒక విధంగా లాభం, మరొక విధంగా నష్టం జరిగే అవకాశముందనే వార్తల్లో నిజమెంతో తెలియాలి. భవిష్యత్తులో మనం ఉపయోగిస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర రవాణా వ్యవస్థలు ఏ.ఐ.సహకారంతో నడిచే అవకాశాల వలన భారీ ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారముంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియలు మానవ నిర్మిత అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, మనిషి సృష్టించిన టెక్నాలజీని మాయచేసి, వైరస్లను ప్రవేశపెట్టి సాంకేతికతో నడుస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రమాదం లేకపోలేదు. ఏ.ఐ.తో రాగల ముప్పును క్షణాల్లో నిలువరించగల సామర్థ్యం లేకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్స్, కంప్యూటర్ల లోకి వైరస్లు ప్రవేశించి, డేటాను విచ్ఛిన్నం చేయడం, వివిధ వ్యవస్థలు స్తంభించిపోవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కృత్రిము మేధతో నడిచే కంప్యూటర్ల వలన, యంత్రాల వలన భారీ విపత్కర పరిణామాలు సంభవించగలవని ఆందోళన నెలకొని ఉంది. మనిషి మాయమై మరబొమ్మలే ప్రాణం పోసుకుని, మనిషి జీవితాన్ని చక్రబంధంలో ఇరికించే ముప్పు పొంచి ఉంది. కీలక వ్యవస్థలు కృత్రిమ మేధతో పని చేస్తే, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో లోపాలు న్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా సంభవించగల పరిణామాలు ఊహాతీతం. రాబోయే దశాబ్ద కాలంలో సుమారు 100 కోట్ల మందికి పైగా కృత్రిమ మేధ వలన ఉద్యోగాలు కోల్పోయే అవకాశ ముందని నిపుణుల వాదన. కృత్రిమ మేధ వలన ఇకముందు టీ.వి. సీరియల్స్ ను, యాంకరింగ్, న్యూస్ రీడింగ్ వంటి అంశాల్లోనూ మనుషుల స్థానంలో ఏ.ఐ. ఆధారిత సేవలు అందు బాటులోకి వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేం. ఇటీవల ఒడిస్సాలో కృత్రిమ మేధ ద్వారా ‘లీసా’ అనే కృత్రిమ మహిళా న్యూస్ యాంకర్ను సృష్టించి, ఒక ప్రైవేట్ ఛానల్లో న్యూస్ చదివించిన విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
ఇదే పద్ధతి భవిష్యత్తులో సినిమా ప్రపంచంలోను, టెలివిజన్ రంగంలోను ప్రవేశపెడితే, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసేవారికి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం కాగలదు. ఉద్యోగ అవకాశాలను పోగొట్టకుండా, పెరుగుతు న్న విద్యావంతుల ఉపాధికి నష్టం లేకుండా చూడాలి. ఎంతవరకు కృత్రిమ మేధ అవసరముందో, అంతవరకే వినియోగించాలి. ఏ.ఐ. ప్రవేశం కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారకూడదు. మానవ శక్తికి వీలు కుదరని చోట్ల, ప్రమాదకరమైన పనుల్లోను, ఇతర సంక్లిష్టమైన కార్యకలాపాల్లోను కృత్రిమ మేధను వినియోగించి, అభివృద్ధిని సాధించవచ్చు. ఈ దిశగా కంప్యూటర్ రంగంలోని నిష్ణాతులు, ఏ.ఐ. నిపుణులు తమ ఆలోచనా పరిధిని విస్తృతం చేయాలి. కోతి నుంచి పరివర్తన చెంది, ఉన్నతమైన విలువలను నిర్మించు కుని, ఆటవికం నుండి ఆధునికంగా మారి, దానవత్వం నుండి మానవత్వం వైపు నడక సాగించి, చీకటిని చేధించి వెలుతురును జన జీవితాల్లో ప్రసరింపచేసి అజ్ఞానాన్ని హరించి విజ్ఞానం వైపు పరుగులు తీసే క్రమంలో ఎక్కడో మనసులో అల్లుకుపోయిన కోరికలు కదం తొక్కి, ఏదో సాధించేద్దామనే కసితో, కృషితో మనల్ని మనమే సాధించుకుంటున్నాం. మన స్వేచ్ఛను మనమే హరించుకుంటున్నాం. మన జ్ఞానాన్ని మనమే అజ్ఞానంగా మలచు కుంటున్నాం, ఇకనైనా టెక్నాలజీ పంథా మారాలి. మానవ జీవితం సౌకర్యవంతంగా సాగడానికి మాత్రమే సాంకేతికత వినియోగపడాలి. కృత్రిమ మేధలో ఉపయోగించే మరబొమ్మలు, మానవులను మరమనుషులుగా మార్చకుండా, ఉపాధికి గండి కొట్టకుండా, ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధిని పెంచి, విద్యాధిక యువత భవితను ఉజ్వలంగా మార్చాలని కోరుకోవడం అత్యాశ కాబోదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: