📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Adulteration of food:గాలి పీల్చినా, నీరు తాగినా.. కడుపు కోతే!!

Author Icon By Hema
Updated: August 4, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Adulteration of food:గాలి పీల్చినా, నీరు తాగినా.. కడుపు కోతే!!ఆరోగ్యం కోసం ఆహారం అనేది ఆనాటి మాట. నేడు మాత్రం సర్వత్రా వ్యాపించి ఉన్న కల్తీ ఆహారం రోగాలకు నిలయం అన్నది నేటి మాట. ఆకలి తీర్చే ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. కానీ నేడు సంస్కృతి కనుమరుగైపోయింది.

ఆదాయాల యావలో పడి కల్తీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఎర్రగా ఉన్నదంతా కారం కాదు, పచ్చగా ఉన్నది పసుపు కాదు. నల్లనివన్నీ మిరియాలు కావు.. ఇలా ఏ వస్తువుని చూసినా దాని పై పై మెరుగులు రంగు చూసి మోసపోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. దానిలో సహజమైన సరుకు లభించడం అనేది మృగ్యమైపోయింది. కల్తీ లేని వస్తువు దొరకడమనేది దుర్గభం అయిపోయింది. తెలిసి కొన్ని తెలియక కొన్ని తిని నీటితో కడుపు నింపుకుంటున్నాం, రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. మన మనుగడకి ప్రశ్నార్ధకంగా నిలిచిన ఈ మహమ్మారి కల్తీపై ప్రత్యేక కథనం.

పూర్వం ఆహార పదార్థాల కల్తీ అనేది చాలా అరుదుగా ఉండేది. ప్రధానంగా తూకంలో మోసాలు జరుగుతూ ఉండేవి. లేదా బియ్యంలో రాళ్లు కలపడం.. వంటి చిన్నపాటి కల్తీలు జరిగేవి. ఈ రకమైన మోసం లేదా కల్తీ వలన ఆర్థికంగా కొంత నష్టం జరిగినా వాటిని భర్తీ చేసుకునే అవకాశం ఉండేది. కానీ నేడు ఈ కల్తీ అనేది ఓ మహమ్మారిగా రూపు దాల్చింది. దానిని కనిపెట్టలేని, నిర్మూలించ లేనంతగా తారాస్థాయికి చేరింది. ఫలితంగా అనేక రుగ్మతలతో బాధపడటమే కాకుండా కోట్లాది మంది
ప్రాణాలను కోల్పోతున్న ఆహార కల్తీ అంటే.. ఆహార పదార్థాల నాణ్యతను (Quality) తగ్గించేందుకు లేదా వాటి పరిమాణాన్ని పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా హానికరమైన లేదా తక్కువ నాణ్యత గల పదార్థాలను కలపడం. ఇది సహజమైన పోషక విలువలను తగ్గించి, ఆదనపు విష పదార్దాలను ఆహారంలోకి చేర్చుతుంది. ఆహారంలో (food) రంగులు, రసాయనాలు, కృత్రిమ ఫ్లేవర్లు, తక్కువ నాణ్యత గల పదార్థాలను కలపడం ద్వారా కల్తీ జరుగుతుంది.


తాగే నీరు, పీల్చే గాలి, తినే పండ్లూ, కూరగాయలు కావేవీ కల్తీకి ఆనర్హం. అవును… దేశంలోని చాలా పదార్థాలు కల్తీ బారిన పడుతున్నాయి. కల్తీ లేని ఆహారం లభించడం అనేది ఇప్పుడు ఆసాధ్యంగా పరిణమించింది. అక్రమార్కుల కక్కుర్తి కారణంగా పాలు, నీళ్లు వంటివి కూడా విషంగా మారి ప్రజల ఉసురు తీస్తున్నాయి. దేశంలో వినియోగమూ అంతే జనాభా పెరుగుతున్నకొద్దీ రోజువారీ ఆహార పదార్థాల విని స్థాయిలో పెరుగుతోంది. ఇదే ఆసరాగా కల్తీ మాయగాళ్లు అన్ని పదార్థాలను విషమయం చేస్తున్నారు. ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఆహార పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో తక్షణం ఎటువంటి చెడు ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు.


ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి మారడం కారణంగా ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. మరొకపక్క నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో దుకాణదారుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. దాంతో కొందరు కల్తీకి పాల్పడుతూ తక్కువ ధరకే సరుకులను విక్రయిస్తున్నారు.
మరోవైపు, సిద్ధం చేసిన ఆహారంవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వారిని ఆకర్షించడం కోసం చాలామంది దుకాణదారులు తినుబండారాలు, ఆహార పదార్థాల తయారీలో రుచి, రంగు కోసం హానికరమైన రసాయనాలు, రంగులను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా మానవ మనుగడకు అత్యవసరమైన ఆహారం, నేడు విషతుల్యంగా మారుతోంది. తయారీ మొదలు ప్యాకింగ్, నిల్వ, సరఫరా వంటి ప్రతీ దశలోనూ ఆహార పదార్థాలు, పానీయాలు నిరంతరం కల్తీ జరుగుతుంది.
ఆహారం అనేది ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది. కానీ ఈ కల్తీ ఆహారం రోగాలను తెచ్చి పెడుతుంది. ప్రాణాలను తీసేస్తుంది. వివిధ ఆహార పదార్థాలలో జరుగుతున్న కల్తీ విధానాలను పరిశీలిస్తే-

‘పాల’ కూట విషం

బలవర్ధక ఆహారమైన పాలను పిల్లలూ పెద్దలూ నిత్యం తాగుతుంటారు. టీ, కాఫీ, పాయసం ఏదైనా సరే, పాలు కలవనిదే అసలైన రుచి రాదు. అలా అందరి దైనందిన జీవితాల్లో అంతర్భాగమైన పాల విషయంలో జరుగుతున్న కల్తీ తెలుసుకుంటే తీవ్ర ఆవేదన మిగులుతుంది. పూర్వం పాలలో కల్తీ అంటే నీళ్లు మాత్రమే కలిపేవారు. ఇప్పుడు విష రసాయనాలు చేరిపోతున్నాయి. దేశంలో విక్రయిస్తున్న పాలు, పాల సంబంధ ఉత్పత్తుల్లో 68.7 శాతం నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టు లేవు. సాక్షాత్తూ భారత రక్షి త ఆహార ప్రమాణాల సంస్థే వెల్లడించింది. ఇందుకు ప్యాకేజింగ్ సమయంలో రసాయనాలు వాడడం పాలను నింపే క్యాన్లను డిటర్జెంట్లతో కడగడం వల్ల కలుషితాలు చేరుతున్నాయి. పాలు చిక్కగా కనబడడం కోసం, ఎక్కువ కాలం విరిగిపోకుండా ఉండేందుకు యూరియా, గంజి పౌడరు, గ్లూకోజ్, ఫార్మాలిన్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. అంతే కాకుండా పాల దిగుబడి పెంచేందుకు పశువులకు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇస్తున్నారు.

నెయ్యి కలుషితం

మనం తినే ఆహారంలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి స్వచ్ఛమైన నెయ్యిని సైతం కల్తీ చేస్తున్నారు. పామాయిల్, వనస్పతి, ఇతర రసాయనాలతో పాటు కేన్సర్కు కారకమైన వైట్ ఆయిల్ని నెయ్యిలో వాడుతున్నారు. జంతువుల నుంచి వేరు చేసే కొవ్వునూ, వాటి ఎముకల ద్వారా తయారు చేసే నూనెలను నెయ్యిలో కలుపుతున్నారు. ఇటీవల కాలంలో పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని అనేక ఆరోపణలు రావడంతో విచారణ జరుపుతున్నారు.

నీటిలోనూ కల్తీయే

ఒకప్పుడు వ్యాధులకు ప్రధాన కారణం కలుషిత నీరే అయినా, ఇప్పుడు ‘సురక్షి త నీరు’ పేరుతో అమ్ముడవుతున్న బాటిల్ వాటర్, ప్లాంట్ల నీరు కూడా కొత్త సమస్యలను సృష్టిస్తోంది. కనీస ప్రమాణాలు పాటించకుండానే ఈ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, దీనికి యథేచ్ఛగా అనుమతులు లభించడం మరింత ఆందోళనకరం. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యంపై, ముఖ్యంగా కాలేయంపై ప్రభావం చూపుతుంది. లివర్ శరీరంలో ఒక ప్రధాన డీటాక్సిఫికేషన్ అవయవం, మనం తీసుకునే ఆహారం, నీరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే విష పదార్థాలను, రసాయనాలను విచ్ఛిన్నం చేసి, వాటిని శరీరం నుండి బయటకు పంపే పనిని లివర్ చేస్తుంది. కలుషిత నీటిలో ఉండే విష పదార్థాలు నేరుగా లివర్పై భారం మోపుతాయి, దీనివల్ల లివర్ వాపు, సిర్రోసిస్, కాలక్రమేణా లివర్ వైఫల్యం వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.

నూనె కల్తీ

నిత్యం వంటల్లో వాడే నూనెను మరీ ప్రమాదకరంగా కల్తీ చేస్తున్నారు. జంతువుల కళేబరాల నుంచి సేకరించిన ఎముకలను బట్టీల్లో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి తీసిన ద్రావణాన్ని వంట నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. రైస్ బ్రాండ్ ఆయిల్స్, తౌడు ఆయిల్, పామాయిల్ లో కల్తీ కలిపి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. పందికొవ్వుతో తయారు చేసే దానిని పామాయిల్ పేరుతో విక్రయిస్తున్నారు. వచ్చి కుసుమ గింజలు కలిసిన ఆవనూనెలో కలుపుతున్నారు. దీంతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

పప్పులు.. కృత్రిమం

కేన్సర్ కారకాలైన కృత్రిమ రంగులను కందిపప్పుకు వాడుతున్నారు. ఆకర్షణ కోసం టారాటజిన్, లెమన్ ఎల్లో, మెటానికల్ ఎల్లో వంటివి వాడుతున్నారు. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మినప్పప్పు, ఛాయా మినప్పప్పు, మినపగుళ్లు మెరుపు కోసం.. పురుగు పట్టకుండా నిల్వ ఉండేందుకు రసాయన పౌడరు వాడుతున్నారు. కందిపప్పులో కేసరిపప్పు, గోధుమపిండిలో మైదా, శనగపిండిలో బఠాణీ పిండి కలిపి విక్రయిస్తున్నట్లు పలు తనిఖీల్లో బయటపడింది. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

పండ్లు కల్తీ

పండ్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు కార్బైడ్ హానికారక రంగులు, జిగురు యథేచ్చగా వాడుతున్నారు. ఎక్కువగా మాలాకైట్ గ్రీన్ అనే కెమికల్ కలర్ను కోటింగ్ కోసం వాడుతున్నారు. దాంతో పాటు పండ్లు, కూరగాయల మీద ఆక్సిటోసిన్, శాకరిన్, మైనం, కాల్షియం కార్బైడ్, కాపర్ సల్ఫేట్ వంటివి పూస్తున్నారు. సాధారణంగా ఏప్రిల్ మాసంలో చేతికందే మామిడి కాయలను పక్వానికి రాకుండానే కార్బైడ్, ప్లైటో కెమికల్స్ ద్వారా కృత్రిమంగా పండ్లుగా మార్చేస్తున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయంటున్నారు. అంతే కాకుండా పండ్లను తాజాగా కనిపించడానికి వాటి పైన పూత పూస్తున్నారు. ఆరోగ్యం మెరుగుదలకు పండ్లు తినాలని వైద్యులు చెబుతూ ఉంటే రసాయనాలు నిండిన పండ్లు తిని లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నాం.

కూరగాయలు-ఆకు కూరలు

కూరగాయలు తాజాగా కనిపించడానికి వాటిని రసాయనాల్లో ముంచుతారు. ముఖ్యంగా ఆకుకూరలు ఒక పూటలో వాడిపోతాయి. వాటిని మళ్లీ తాజాగా ఉంచడానికి రసాయనాలు స్ప్రే చేసి తాజా ఆకు కూరలా చేసి విక్రయిస్తున్నారు.

టీ పొడి

వాడిన టీ పొడి ఎండబెట్టడం లేదా చౌక ధరకు లభించే టీ పొడిలో రంపపు పొట్టు, చింత గింజల పొడి, జీడిపప్పు పిక్క లోపల ఎర్రని చారతో ఉండే పొరను తీసుకుని దానిని పిండిలా ఆడి దీనిలో కలుపుతున్నారు. దీనితో పాటు సుద్ద మట్టి, కెమికల్స్ కలుపుతూ కల్తీ టీ పొడి తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ టీ పొడి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉండగా ఈ లూజ్ టీ పొడి కేవలం రూ.150కు విక్రయిస్తున్నారు. టీ పొడిలో ఇవి కలపడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయే ప్రమాదం ఉంది.

తియ్యటి విషం

మన దేశంలో స్వీట్సుకు ఉన్నంత క్రేజ్ మిగతా ఏ దేశాల్లో ఉండదేమో! స్వీట్లు లేనిదే ఏ శుభకార్యం జరగదు. స్వీట్లు తయారు సమయంలో వాటి రంగు మరింత ఆకర్షణీయంగా కనబడటానికి మెటానిల్ అనే కెమికల్ను వాడుతుంటారు. ఇవి కలిసిన పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.

పంచదార… బెల్లం

పంచదారలో సోడా, రవ్వ కలుపుతున్నారు. పంచదారను తెల్లటి విషం అని తరచూ వైద్యులు చెబుతూనే ఉన్నారు. పంచదార కన్నా బెల్లం మంచిది అని చెప్పేసరికి బెల్లానికి డిమాండ్ పెరిగింది. దాంతో కల్తీ అక్రమదారులు పంచదారను కరిగించి బెల్లం రంగు వేసి బెల్లం తయారు చేస్తున్నారు.

ఐస్ క్రీమ్.. రసాయనాల మయం

ఐస్క్రీమ్స్ లో తొంభై శాతం కెమికల్స్ వాడతారని చాలా మందికి తెలియదు. ఐస్క్రీమ్ తయారీలో ఇథైల్ ఎసిటేట్, ఎమిల్ ఎసిటేట్, నైట్రేట్ లాంటివి విపరీతంగా వాడుతున్నారు. ఇథైల్ ఎసిటేట్ వల్ల లంగ్స్, కిడ్నీలు, గుండెకు సంబంధించిన వ్యాధులొస్తాయి. ఐస్క్రీమ్ టెక్స్చర్, టేస్ట్ పోకుండా ఉండడం కోసం అందులో ఒక రకమైన గమ్ కూడా కలుపుతారు. ఆ గమ్ ను జంతువుల తోక, ముక్కు వంటి భాగాలు ఉడికించి తీస్తారు. ఆ గమ్ ఉంటేనే అది నెమ్మదిగా కరుగుతుంది.

బియ్యం కల్తీ

ఒకప్పుడు బియ్యంలో రాళ్లు కలిపేవారు. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసి చౌకబియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి డబుల్ పాలిష్ పట్టి సన్నబియ్యంగా మారుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయనే ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది.

మాంసం కల్తీ

మాంసం విక్రయాలలో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. లేగ దూడల మాంసం కోతులు మాంసం వేట మాంసంగా అమ్మడాన్ని అధికారులు పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కరమైన జంతువు మాంసాన్ని 24 గంటల్లోపే వినియోగించాలి. ఇక హోటల్స్లో అయితే దీర్ఘకాలం పాటు డీ ఫ్రీజ్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఆకర్షణీయంగా రంగులు అద్ది వండి వారుస్తున్నారు.

అల్లం-వెల్లుల్లి పేస్ట్

కూరల్లో వాడే వెల్లుల్లి పేస్ట్ కోసం కుళ్లిపోయిన బంగాళదుంపలు, అరటి బోదెలు రసాయనాలతో ముద్ద చేస్తున్నారు. పసుపు, కారంలో వ్యాపారులు నికిల్, గిలాటిన్ అనే పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరంలో రక్తకణాలను దెబ్బతీస్తాయి. కడుపులో మంట, అల్సర్ కలిగిస్తుంది. ప్రాథమిక దశలో చికిత్స అందకపోతే కేన్సర్గా మారే ప్రమాదం ఉంది. పచ్చి బఠాణీలు బఠానీలను రాత్రిపూట నానబెట్టి, ఆ తర్వాత వాటిని కృత్రిమ ఆకుపచ్చ రంగులో (ముఖ్యంగా మలాచైట్ గ్రీన్ వంటివి) ముంచుతారు లేదా ఆ రంగును వాటికి అద్దుతారు. ఇలా చేయడం వల్ల అవి పచ్చి బఠానీల వలె తాజాగా, ఆకుపచ్చగా కనిపిస్తాయి. వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఈ రంగు కేన్సర్ కారకం, ఇవి కాలేయానికి తీవ్రమైన హానిని కలిగిస్తాయి. దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు, ఇతర అవయవాల పని తీరుపై కూడా ప్రభావం చూపుతాయి.

కల్లు.. మద్యం కల్తీ
మద్యపాన ప్రియులు సేవించే కల్లు మద్యం పూర్తిగా కల్తీమయం అయిపొయింది. కల్తీ కల్లు విషయం చూస్తే రోడ్డు ప్రమాదాలు, శస్త్ర చికిత్సలు, మెడికల్ ఎమర్జెన్సీలో పేషెంట్లకు నొప్పి తెలియకుండా ఇచ్చే క్లోరాల్ హైడ్రేట్, డైజోఫామ్, క్లోరోఫామ్, అఫ్రాజోలం వంటి మత్తు మందులు కలుపుతున్నారు. ఈ రసాయనాలు చాలా అత్యంత విషపూరితమైనవి అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఔషధాల కల్తీ
రోగాన్ని నయం చేసుకోవడానికి వాడే మందులు కూడా కల్తీ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్య ఆరోగ్య రంగంలో జరిగే ఈ రకమైన మోసాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. తనిఖీల సందర్భంగా ఇటువంటివి బయట పడటం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.

కల్తీ ఆహారం ప్రభావాలు

కల్తీ ఆహారం శరీరంలోకి
చేరినప్పుడు జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొన్ని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. కల్తీ ఆహారంలో తరచుగా తక్కువ నాణ్యత గల నూనెలు, హైడ్రోజనేటెడ్ కొవ్వులు, అధిక స్థాయిలో కృత్రిమ చక్కెరలు ఉంటాయి. ఇవి ఊబకాయానికి, టైప్ 2 మధుమేహానికి, గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలు. కల్తీ ఆహారం పోషక విలువలు లేకపోవడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్ల వారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు.

ప్రజలు కల్తీ ఆహారం వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణాలు:

తక్కువ ధర: కల్తీ ఆహార పదార్థాలు సాధారణంగా స్వచ్ఛమైన వాటి కంటే తక్కువ ధరకు లభిస్తాయి. పేదరికం లేదా పొదుపు చేయాలనే కోరిక ఉన్నవారు తక్కువ ధరలకు ఆకర్షితులవుతారు.

అధిక లాభాలు: కల్తీ వ్యాపారులకు స్వచ్ఛమైన ఆహార పదార్థాల కంటే కల్తీ చేసిన వాటిపై ఎక్కువ లాభాలు వస్తాయి.

సులభంగా లభించడం:

కొన్నిసార్లు కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటాయి.

అవగాహన లేకపోవడం: చాలా మంది ప్రజలకు కల్తీ ఆహార పదార్థాలను ఎలా గుర్తించాలో, వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలియదు.

ఆకర్షణీయంగా ఉండటం: రంగులు, ఇతర రసాయనాలు ఉపయోగించి ఆహార పదార్థాలను చూడటానికి తాజాగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు.

ఏటా 4.20 లక్షల మరణాలు : కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా యేటా 4 లక్షల 20 వేల మరణాలు సంభవిస్తున్నాయి. 60 కోట్ల మంది రోగాల బారినపడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కలుషిత ఆహారం కారణంగా 70 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులే చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కలుషిత, నాసిరకం ఆహారం, పోషకాహార లోపం కారణంగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు, వ్యాధులు తలెత్తుతున్నట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ : ఆహారం కలుషితం కారణంగా విశ్వవ్యాప్తంగా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల ఆనారోగ్యానికి గురవుతున్నారు. అతిసార మొదలు.. కేన్సర్ వరకు రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ కారణంగానే ఏటా సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార
కల్తీకి ఎక్కువగా అయిదేళ్లలోపు చిన్నారులే ప్రభావితం అవుతుండటం తీవ్ర ఆందోళనకరం. కలుషిత, కల్తీ ఆహారం వల్ల అతిసారం నుంచి కేన్సర్ల వరకు దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించని కారణంగా ఆహారం పాయిజన్గా మారి సుమారు 200 రకాల వ్యాధులకు కారణ భూతంగా మారుతోంది. కల్తీ కారణంగా దేశంలో సుమారు 10 కోట్ల మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ 15 కోట్లకు చేరుతుందని అంచనా. అసురక్షిత ఆహారం కారణంగా మధ్య ఆదాయ దేశాల్లో యేటా 110 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టాలు తప్పటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల ఐదేళ్ల లోపు చిన్నారుల్లో దాదాపు 40 శాతం మంది అనారోగ్యానికి గురవుతున్నారనీ, లక్షా 25 వేల మంది పిల్లలు మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిస్తోంది. కలుషిత ఆహారం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 55 కోట్ల మంది డయేరియాతో ఇబ్బందులు పడుతుండగా 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఐక్యరాజ్యసమితి

ఆహార పదార్థాల విషయంలో ఎవరూ ప్రమాణాలు పాటించటం లేదు. ఇదే విషయం గతంలో ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం కూడా ప్రస్తావించింది. ఈ సమస్య ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. పలు నివేదికలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. జాతీయ ఆహార భద్రత ప్రమాణాల మండలి విడుదల చేసిన నివేదికలో… అందరికీ ఆహారభద్రత మాట అటుంచి అసలు నాణ్యమైన ఆహారం అందటమే గగనమైపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న వివిధ రకాల ఆహారోత్పత్తుల్లో 28.5 శాతం నాణ్యత ప్రమాణాలకు దూరంగా ఉన్నట్టు వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం.. మన దేశంలో సుమారు 527 రకాల ఉత్పత్తుల్లో కేన్సర్ కారక ఇథలీన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంది.
వీటిలో నిత్యం మనం వాడే పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు వంటివెన్నో ఉన్నాయి. ఇక, సరిగా ఉడకని మాంసం, సీఫుడ్లో ఉండే సాల్మొనెల్లా, కాంపీలోబాక్టర్, ఈ-కోలీ వంటి బ్యాక్టీరియాలు జీర్ణాశయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ చేయడం వల్ల తేమతో వచ్చే బూజు (అప్లోటాక్సిన్) కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారుతుంది. కాడ్మియం, సీసం వంటి లోహాలు ఒంట్లో చేరితే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని రోగ నిరోధక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇవన్నీ మహిళల పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్న దేశాలు

చైనా : ఆహార కల్తీకి సంబంధించిన నేరాలకు మరణశిక్షతో సహా అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తుంది. సింగపూర్ : ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు, సుదీర్ఘ జైలు శిక్షలు విధిస్తుంది. యునైటెడ్ స్టేట్స్: ఫెడరల్ ఫుడ్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ద్వారా కఠినమైన ఆహార భద్రతా నియమాలను అమలు చేస్తుంది. ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉంటాయి.

యూరోపియన్ యూనియన్ (ఈయు): ఆహార కల్తీకి పాల్పడిన వారికి గణనీయమైన జరిమానాలు, వ్యాపార లైసెన్స్ల రద్దు వంటి చర్యలు తీసుకుంటుంది.

భారతదేశంలో ఆహార కల్తీపై చట్టం: భారతదేశంలో ఆహార కల్తీని నిరోధించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (ఎఫ్ఎస్ఎస్ఏ) ప్రధాన చట్టం. ఈ చట్టం దేశంలో ఆహార భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తుంది. వాటిని అమలు చేస్తుంది. ఈ చట్టం కింద ఆహార కల్తీకి పాల్పడిన వారికి జరిమానాలు, జైలు శిక్షలు నిర్దేశించడం జరిగింది. 1) నాసిరకం ఉత్పత్తులని తేలితే సెక్షన్ 51 ప్రకారం రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. 2) వివరాలు సరిగా పొందుపర్చకపోతే సెక్షన్ 52 మేరకు రూ.3 లక్షలు జరిమానా వేస్తారు. 3) కల్తీ కారకం ఆరోగ్యానికి హానికరం కాకపోతే సెక్షన్ 57 ప్రకారం రూ.2 లక్షలు మించకుండా జరిమానా విధిస్తారు. ఆరోగ్యానికి హానికరం అయితే రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. 4) సురక్షి తంకాని ఆహార పదార్థాలు తినడం వల్ల మరణం సంభవిస్తే సెక్షన్ 59 ప్రకారం ఏడేళ్లు తక్కువ కాకుండా జైలు, రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. 5) లైసెన్సు లేకుండా వ్యాపారం సాగిస్తే సెక్షన్ 63 ప్రకారం 6 నెలల వరకు కారాగారం, రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుంది.

భారతీయ న్యాయ సంహిత బిల్లు: ఆహార కల్తీని అరికట్టే దిశగా పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘కల్తీ ఆహార పదార్థాల విక్రేతల పట్ల మెతక వైఖరి సరికాదంటున్న హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం వారి భరతం పట్టేందుకంటూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లులో కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. ఆహార కల్తీకి పాల్పడే వారికి కనీసం ఆరు నెలల కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా, విక్రేతలకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించాలంటూ ఆ సంఘం ఇటీవల సిఫారసు చేసింది.

కేంద్ర ప్రభుత్వ నివేదిక: 2021-24 మధ్య కేంద్ర వైద్య,

ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీగా తేలినట్టు వెల్లడించింది. కల్తీ ఆహారం అనేది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. అది సమాజం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. కల్తీని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల్లో ఒక బలమైన చైతన్యం రావాలి. ఈ చైతన్యం ద్వారానే వినియోగదారులు ఏది స్వచ్ఛమైన ఆహారం, ఏది కల్తీ అనేది తెలుసుకుని సరైన ఎంపికలు చేసుకోగలుగుతారు. ప్రజలు స్వచ్చమైన ఆహారాన్ని డిమాండ్ చేయడం మొదలు పెడితే, కల్తీ చేసిన ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతుంది. ఇది వ్యాపారులను స్వచ్ఛమైన ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రోత్సహిస్తుంది.

కల్తీని గుర్తించినప్పుడు భయం లేకుండా అధికారులకు ఫిర్యాదు చేసే ధైర్యం వస్తుంది. ఇది కల్తీ చేసేవారికి ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. ఆహార పదార్థాలను ఇంట్లో నిల్వ చేయడం, వండటం విషయంలో సరైన పద్ధతులు పాటిస్తారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు అవసరం. కల్తీ చేసిన ఆహారాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా గుర్తించాలో చూపించే ప్రయోగాలు, వీడియోలు, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పాఠ్య పుస్తకాలలో ఆహార భద్రత, కల్తీ, దాని ప్రభావాలపై పాఠాలను చేర్చాలి.

ఇది చిన్న వయసు నుంచే పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఆహార కల్తీ ప్రమాదాలపై నిరంతరం ప్రచారం చేయాలి. ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల ద్వారా సందేశాలను ఇవ్వాలి. స్వచ్చంద సంస్థలు స్థానిక స్థాయిలో వర్క్ షాప్లు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

ప్రజల్లో చైతన్యం ఎంత ముఖ్యమో, కల్తీ చేసేవారికి కఠినమైన శిక్షలు విధించడమూ అంతే అవసరం. శిక్షలు కఠినంగా ఉంటే, కల్తీకి పాల్పడటానికి భయపడతారు. బాధితులకు న్యాయం జరగడం, కల్తీ వల్ల కలిగిన నష్టానికి బాధ్యులు శిక్షించబడటం సమాజంలో విశ్వాసాన్ని పెంచుతుంది. శిక్షలు కఠినంగా ఉండటంతో పాటు, వాటి ఆమలు కూడా వేగంగా, సమర్ధవంతంగా ఉండాలి.

కేసులు సుదీర్ఘ కాలం నత్తనడకన సాగకుండా, త్వరగా పరిష్కరించబడేలా చూడాలి. ఆహార కల్తీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ కఠిన నియంత్రణలు, శిక్షలు ఒక వైపు, ప్రజల్లో విస్తృత అవగాహన, చైతన్యం మరో వైపు సమానంగా పని చేయాలి.

ప్రజలు తమ ఆరోగ్యం పట్ల బాధ్యత వహించడం, బయట ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండటం ఈ పోరాటంలో అత్యంత కీలకమైన అంశాలుగా గుర్తించి ఆచరణలో తీసుకు వచ్చినప్పుడే దేశ ప్రజలకు సురక్షితమైన ఆహారం లభించి ఉత్పాదకత పెరుగుతుంది. ప్రజల పైనా, ప్రభుత్వాల పైనా వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది. ప్రజారోగ్యానికి భరోసా దక్కుతుంది.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/maanavatvam-mahatva-maanavata-values/cover-stories/522449/

FakeFood FoodAdulteration HealthHazards PublicHealth ToxicFood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.