Waqf Amendment Bill : పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో ఆయన సవాల్ చేశారు. వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధమని.. వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

రాజ్యసభ ఆమోదం కూడా పొందింది
కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.
అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు
దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.