ఉద్యోగుల రోజువారీ జీవితంలో కాఫీ ఒక తప్పనిసరి భాగమైంది. ఉదయం కాఫీ తాగితేనే పనిలో నిమగ్నమై ఉండగలరని చాలామంది భావిస్తారు. మధ్యాహ్నం అలసట పెరిగినప్పుడు కూడా తక్షణ ఉత్సాహం కోసం కాఫీ తాగడం అందరికీ అలవాటుగా మారింది. కానీ, తాజా అధ్యయనాలు చెప్పే విషయాలను వింటే కాఫీ lovers మళ్ళీ ఆలోచించాల్సిందే. ఆఫీస్‌లోని కాఫీ మెషిన్‌లో తయారయ్యే కాఫీ కొలెస్ట్రాల్ పెంచే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, రోజూ 3-4 కప్పుల కాఫీ తాగే ఉద్యోగులు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

కాఫీలో అనారోగ్యకరమైన పదార్థాల ముప్పు
స్వీడన్‌లోని ఉప్ప్సాలా విశ్వవిద్యాలయం మరియు చల్మర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. ‘Nutrition, Metabolism & Cardiovascular Diseases’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. 14 రకాల ఆఫీస్ కాఫీ మెషిన్స్‌లో తయారైన కాఫీ నమూనాలను పరీక్షించగా, కొన్ని మెషిన్స్ కాఫీలో అధిక కొలెస్ట్రాల్ పెంచే పదార్థాలు ఉన్నట్లు తేలింది. మెషిన్ రకాన్ని బట్టి కాఫీలోని కొలెస్ట్రాల్ పెంచే పదార్థాల స్థాయిలో భారీ వ్యత్యాసం కనిపించింది. ఒకే మెషిన్‌లోనూ ఒక్కోసారి విభిన్న స్థాయిలో ఈ హానికర పదార్థాలు లభించాయని పరిశోధకులు తెలిపారు.
కొలెస్ట్రాల్ పెంచే ప్రధాన కారణం ఏమిటి?
కఫెస్టోల్ మరియు కాహ్వియోల్ అనే రెండు సహజ పదార్థాలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇవి LDL స్థాయిని పెంచి, గుండె సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. బాగా మరిగించిన కాఫీలో ఈ పదార్థాలు అధికంగా ఉండటంతో, నార్డిక్ దేశాల్లో బోయిల్ కాఫీ తక్కువగా తాగాలని డైట్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. పేపర్ ఫిల్టర్ ఉపయోగించే మెషిన్స్ హానికర పదార్థాలను తొలగిస్తాయి. కొలెస్ట్రాల్ పెంచే పదార్థాల ప్రభావం తక్కువగా ఉంటుంది. కావున ఇలాంటి కాఫీ తాగితే మంచిది. అధికంగా కాఫీ తాగే ఉద్యోగులు రోజుకు 3-4 కప్పులు తాగే వారు కొలెస్ట్రాల్ పెరిగే ముప్పును అంచనా వేసుకోవాలి. ఆఫీస్‌లో పేపర్-ఫిల్టర్ ఉన్న కాఫీ మెషిన్ వాడితే.. ఈ ప్రమాదం తగ్గించుకోవచ్చు. మొత్తం రోజులో కాఫీ తాగే పరిమితిని నియంత్రించాలి. గ్రీన్ టీ, నాచురల్ హర్బల్ టీ, నల్ల కాఫీ, కొబ్బరి నీరు ఇవి తాగడం మంచిది. కావాలంటే కాఫీ తాగండి కానీ జాగ్రత్త! ఎంతోమంది ఉద్యోగుల ఉదయం మొదలయ్యేది కాఫీతోనే కానీ అదే కాఫీ కొలెస్ట్రాల్ పెంచే ప్రమాదం ఉందన్న నిజాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేపర్-ఫిల్టర్ కాఫీకి మారడం ఉత్తమం. ఎందుకంటే ప్రతి రోజు తాగే ఆఫీస్ కాఫీ మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయొచ్చు.