తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గుజరాత్‌కు వెళ్లనున్నారు. అహ్మదాబాదులో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రత్యేక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేరుకున్నారు. మంత్రి వర్గ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ కూడా ఈరోజు బయలుదేరనున్నారు.
బీసీ కులగణన, రిజర్వేషన్లపై దృష్టి
ఈ సమావేశాల్లో బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్ ప్రసంగించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, శాసనసభలో ఆమోదించిన తీర్మానాల గురించి వివరించే అవకాశం ఉంది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీ కేంద్ర స్థాయిలో దృష్టిలో పెట్టుకునేలా సీఎం ప్రచారం చేయనున్నారు.

రాష్ట్ర విధానాలపై ప్రజెంటేషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజానుకూల విధానాలపై సీఎం రేవంత్ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. డబుల్ బెడ్రూం ఇళ్ల బదులు ఇండ్ల పథకాలు, విద్యుత్ సరఫరాలో కొత్త విధానం, రైతు రుణమాఫీ వంటి అంశాలను కూడా వివరించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ విధానాలు ఆదర్శంగా ఉండేలా రేవంత్ వివరించనున్నారు.
కాంగ్రెస్ అంతర్గత చర్చలకు వేదిక
ఈ సమావేశాలు పార్టీ అంతర్గత వ్యూహాలపై చర్చించేందుకు వేదిక కానున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సమన్వయం, బలహీనతలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పార్టీ బలోపేతానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి హైలైట్ చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్ చేయాలనే యత్నంలో భాగంగా ఈ పర్యటన కీలకమని భావిస్తున్నారు.