తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను ‘టీజీ’గా మార్చామని , ఈ నిర్ణయం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనేక సంవత్సరాలు అవహేళనకు గురయ్యాయని, తాజాగా ఈ మార్పు ద్వారా ప్రజల అంగీకారం సాధించినట్టు తెలిపారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో ‘టీజీ’ అని రాసుకోవడం సాధారణమైన పద్ధతిగా మారిందని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ‘టీఎస్’ అని వాడకంతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆయన విమర్శించారు. ఈ మార్పు ప్రజల మనోభావాలను అంగీకరించే ప్రయత్నమని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి గౌరవం దక్కకపోవడం పై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఈ గీతాన్ని రాష్ట్ర గీతగా ప్రకటించడం ద్వారా తెలంగాణ సంస్కృతికి గౌరవం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ పదేళ్లపాటు వివక్షకు గురైన రాష్ట్రమని చెప్పారు. ఉద్యమం సమయంలో కవులు, కళాకారులు ఎప్పుడూ తమ సాహిత్యం, కళల ద్వారా ఉద్యమానికి ఊపిరినిచ్చారని, వారికి గుర్తింపు ఇవ్వడం అవసరం అని పేర్కొన్నారు. తాము సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ మార్గంలో నడిపిస్తున్నామని, ప్రజల అభ్యర్థనలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.