సినీ హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం పార్టీకి ప్రతికూలంగా మారుతుందనే ఉద్దేశంతో అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మద్దతుగా నిలబడుతుందని అన్నారు. సినీ పరిశ్రమలోని కార్మికుల నుంచి నిర్మాతల వరకు అందరికీ మేలు చేకూరాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్మ్ నగర్ స్థలాలను కేటాయించడం, సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు ఆకర్షించడం వంటి విషయాలను గుర్తు చేశారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌కు సంబంధించి కేసు నమోదుకి కారణాలను పోలీసులు వివరించారని తెలిపారు. అనుమతులు లేకుండా ప్రదర్శనలు నిర్వహించడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు.