తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఈ పరిస్థితుల్లో సమ్మె చేయడం ప్రజలకు నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తున్నదని, సంస్థను నిలబెట్టేందుకు కార్మికుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే,” అంటూ ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ
రాష్ట్రంలో గత పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ జరిగిందని విమర్శించిన సీఎం రేవంత్, “ఆర్టీసీ కార్మికులు పంతాలకు పోకుండా, సమస్యలుంటే మంత్రులతో చర్చించండి. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మీకే వెచ్చిస్తాం. నేను ఇంటికి ఏ అణా పైసా తీసుకెళ్లేది లేదు” అంటూ నిస్వార్థంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తనను నమ్మాలని కోరారు. రాబోయే ఏడాది ఆర్థికంగా కొంత భద్రత ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మే 5న కార్మిక కవాతు
ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 7 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 5న కార్మిక కవాతు కూడా నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి, స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. సమ్మెని ఆపాలని విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Read Also : Metro : హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం