అమరావతి: సీఎం చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులు వాసవీ మాత ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొననున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతోంది. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజులుగా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీమ్ అస్మి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్యకా పరమేశ్వరి, వాసవి ధామ్ ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.

ఇక రేపు అన్నమయ్య జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఫిబ్రవరి 1న అంటే రేపు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు.
కడప ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు… హెలిపాడ్ నుండి కాన్వాయ్ ద్వారా సంబేపల్లి చేరుకొని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు.