విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (Pre-release event) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానుల పట్ల తన గాఢమైన ప్రేమను వ్యక్తపరిచారు.
విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్
ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అభిమానులు తనపై చూపిస్తున్న అపారమైన ఆదరణను తానెప్పటికీ మర్చిపోలేనని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. “మీరు నాకు దేవుడిచ్చిన వరం” అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన సినిమా గురించి కంటే ఎక్కువగా అభిమానుల గురించే మాట్లాడారు.
‘కింగ్డమ్’ పై నమ్మకం
“మరో రెండు రోజుల్లో జులై 31న మిమ్మల్ని థియేటర్లలో కలవబోతున్నాం. మనసులో కొంచెం భయం ఉంది, అదే సమయంలో ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. ‘కింగ్డమ్’ అవుట్‌పుట్ పట్ల టీమ్ అందరం సంతోషంగా ఉన్నాం” అని విజయ్ తెలిపారు.
అభిమానులతో అనుబంధం
“ఈ రోజు నేను అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నా. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నారు. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్డమ్’ (Kingdom) తో రాబోతుంది” అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
చిత్ర బృందం గురించి విజయ్ దేవరకొండ మాటలు
గౌతమ్ తిన్ననూరి: “ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా పని మీదే ఉన్నాడు. ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు.”
అనిరుధ్ రవిచందర్: “ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పాటలు ఇప్పటికే విన్నాం. నేపథ్యం సంగీతం కూడా అదిరిపోతుంది. నా సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అది ‘కింగ్డమ్’తో నెరవేరింది. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు.”
నాగవంశీ: “అలాగే ఇది నాగవంశీ ‘కింగ్‌డమ్’. ఎంతో రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. బెస్ట్ అవుట్‌పుట్ రావడం కోసం.. ఎక్కడా రాజీ పడకుండా మేము ఏది అడిగితే అది ఇచ్చారు.”
భాగ్యశ్రీ బోర్సే: “భాగ్యశ్రీ బోర్సే కొత్తమ్మాయి. కానీ, సినిమా కోసం చాలా కష్టపడుతుంది. చాలా స్మార్ట్. రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళుతుంది.”
సత్యదేవ్ & వెంకటేశ్: “నా సోదరులు సత్యదేవ్, వెంకటేశ్ ఇద్దరూ చాలా మంచి నటులు. ఈ సినిమాలో అన్న పాత్ర చాలా ముఖ్యమైంది. ఆ పాత్రలో సరైన నటుడు చేస్తేనే సినిమా పండుతుంది. అలాంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చాలా చర్చించిన తర్వాత.. సత్యదేవ్‌ను గౌతమ్ ఎంపిక చేశాడు. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించాడు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేశ్ అద్భుతంగా నటించాడు. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.”
Read hindi news: hindi.vaartha.com
Read also: Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ వచ్చేదెప్పుడో తెలుసా?