తమిళ సూపర్‌స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమాను కర్ణాటక (Karnataka)లో విడుదల చేయకుండా ఆపే ప్రయత్నాలపై సుప్రీంకోర్టు గట్టిగా స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కన్నడ సంఘాల నిరసనలు, ఫిల్మ్ ఛాంబర్ ఒత్తిడి వంటి అంశాలతో సినిమాను నిలిపివేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉన్నందున, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సినిమాను నిలిపివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.
వివాదం ఉత్కంఠభరిత నేపథ్యంలో…
కమల్ హాసన్ (Kamal Haasan) గతంలో కన్నడ భాషపై చేసిన కొన్ని వ్యాఖ్యలు (“కన్నడ తమిళం నుండే పుట్టింది”) వివాదాస్పదం కావడంతో, ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయనీయకుండా కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సినిమాను నిషేధించాలని హెచ్చరించింది. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు కర్ణాటకలో ప్రదర్శనకు నోచుకోలేదు. ఇది సినిమాకే కాకుండా స్వేచ్ఛా భావనకు అవమానంగా మారిందని విమర్శలు వచ్చాయి.
సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు:
సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, “సెన్సార్ బోర్డు అనుమతి పొందిన సినిమాను ఏ రాష్ట్రం అడ్డుకోలేరు. ప్రజల శాంతిభద్రతలను నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యత. అల్లరి మూకల బెదిరింపులకు లొంగకూడదు” అని తేల్చేసింది.
ఈ నేపథ్యంలో, సినిమా విడుదలకు భద్రత కల్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. “సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అనుమతి పొందిన సినిమాను విడుదల చేయాల్సిందే. చట్టబద్ధమైన పాలన ఇదే చెబుతోంది,” అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు సూచించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. “జూన్ 3న హైకోర్టు కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం సరికాదు,” అని పేర్కొంది.
కమల్ హాసన్ స్పందన:
కమల్ హాసన్ ఈ వివాదంపై స్పందిస్తూ – తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ భాష పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని కమల్ హాసన్ చెబుతున్నప్పటికీ, క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు.
ఈ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది. “రాష్ట్రాన్ని అల్లరి మూకలు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి నియంత్రణలోకి వెళ్లనివ్వలేం” అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గత విచారణలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
Read also: Sitare Zameen Par: ‘సితారే జమీన్ పర్ ‘ నుండి ‘శుభ మంగళమ్’ పాట విడుదల