మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తుడరుం’ (Thudarum). ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన అందుకుంది. ఈ చిత్రం ₹230 కోట్లకుపైగా వసూళ్లు సాధించడం విశేషం. ఇక ఈ చిత్రం మే 30 నుంచి JioCinema (Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం:
చిత్ర కథానాయకుడు షణ్ముగం అలియాస్ బెంజ్ (మోహన్ లాల్) మంచి వయసులో ఉండగా సినిమాలలో ఒక ఫైట్ మాస్టర్ కి అసిస్టెంట్ గా పనిచేస్తాడు. కొన్ని కారణాల వలన ఆ వృత్తికి దూరం కావలసి వస్తుంది. ఫైట్ మాస్టర్ అభిమానంతో ఇచ్చిన బ్లాక్ అంబాసిడర్ కారు అంటే షణ్ముగానికి చాలా ఇష్టం. ఆ కారునే టాక్సీగా నడుపుతూ అతను తన భార్యా బిడ్డలను పోషిస్తూ ఉంటాడు. ఆయనకి బెంజ్ అంటే మరింత ఇష్టం ఉండటం వలన, అందరూ ఆయనను ‘బెంజ్’ అనే పిలుస్తూ ఉంటారు.
భార్య లలిత ( శోభన) కూతురు పవిత్ర ( అమృత వర్షిణి) కొడుకు పవన్ (థామస్ మాథ్యూ) ఇదే అతని కుటుంబం. పిల్లలిద్దరూ టీనేజ్ లోనే ఉంటారు. పవన్ వేరే ఊర్లోని కాలేజ్ లో హాస్టల్లో ఉంటూ చదువుతూ ఉంటాడు. ఒక రోజున రిపేర్ కోసం బెంజ్ ఇచ్చిన కారును మణి అనే మెకానిక్ తీసుకుని వెళతాడు. ఆ కారులో గంజాయి దొరికిందని చెప్పి, పోలీస్ లు పట్టుకుంటారు. తన కారును విడిపించుకుని రావడానికి పోలీస్ స్టేషన్ కి బెంజ్ వెళతాడు.
ఎస్ ఐ బెన్నీ (బినూ పప్పు)తో అంతకుముందే గొడవ కావడం వలన, సీఐ జార్జ్ ( ప్రకాశ్ వర్మ)తో బెంజ్ తన పరిస్థితిని చెప్పుకుంటాడు. తమ కొలీక్ సుధేష్ కూతురు పెళ్లి పక్క ఊర్లోనే జరుగుతుందనీ, అక్కడ తమను డ్రాప్ చేసి వెళ్లమని కారు కీస్ ఇచ్చేస్తాడు జార్జ్. ఆ రాత్రి వాళ్లు బెంజ్ ను ఫారెస్టులో చాలా దూరం తీసుకువెళతారు. తన కారు డిక్కీలో శవం ఉందనీ, దానిని పూడ్చడం కోసం తనని వాళ్లు అక్కడివరకూ తీసుకొచ్చారనే విషయం అప్పుడు బెంజ్ కి అర్థమవుతుంది. పోలీసులు హత్య చేసింది ఎవరిని? అది తెలుసుకున్న బెంజ్ ఏం చేస్తాడు? అనేది కథ.
సస్పెన్స్, డ్రామా, మరియు ప్రకృతి న్యాయం:
ఈ సినిమా ప్రధానంగా ఒక సామాన్యుడిని ఎట్లా వ్యవస్థ నిష్ఠురంగా దెబ్బతీస్తుందో చూపిస్తుంది. భగవంతుడు ప్రకృతిని ఒక సాక్షిగా పెట్టాడనీ, ప్రకృతి ఇచ్చిన సాక్ష్యంతోనే కర్మ వెంటాడుతూ ఉంటుందని అంటారు. అలా ఒక పాపానికి పాల్పడినవారిని ‘కర్మ’ ఎలా వెంటాడిందనేదే ఈ కథ. నేరస్థులను ఈ ప్రపంచం వదిలేసినా ప్రకృతి వదిలిపెట్టదనే సందేశంతో కూడిన కథ ఇది. కథ – కథనం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. ఆ తరువాత పాత్రలను డిజైన చేసిన తీరుకు లొకేషన్స్ కి మార్కులు పడతాయి.
ఈ కథ మెయిన్ ట్రాక్ లో వెళ్లడానికి దర్శకుడు కొంత సమయాన్ని తీసుకున్నాడు. అయితే ఆయా పాత్రలను గురించి బలంగా చెప్పడానికి ఆ మాత్రం సమయం పడుతుందనే అనుకోవాలి. ఒక సామాన్యుడిని అతని స్థాయికి మించిన కేసులో అతను చేయని కేసులో ఇరికించడానికి పోలీస్ అధికారులు ప్రయత్నిస్తే, ఒంటరిగా అతను ఏం చేయగలుగుతాడు? అనే కోణం నుంచి దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు హ్యాట్సాఫ్ అనిపిస్తుంది.
కథలో ఒక సందర్భంలో వచ్చే డైలాగ్ –”అతణ్ణి చంపింది అడివికి రాజే అందుకు అడవి మొత్తం సహకరించింది” అనే మాట ఈ సినిమా సారాంశాన్ని చెబుతుంది.
తరుణ్ మూర్తి దర్శకత్వం ఈ కథను నెమ్మదిగా, కాని బలంగా అల్లుకున్న తీరు, ప్రేక్షకులను మొదటి 30 నిమిషాల తరువాత కథలో ముంచెత్తుతుంది. సస్పెన్స్, మానవతా విలువలు, పోలీసు వ్యవస్థలోని చెడు శక్తులు, ప్రకృతి ధర్మం — ఇవన్నీ కలిసి ఈ సినిమాని ప్రత్యేకం చేశాయి. ఈ ఒక్క డైలాగ్ ఈ సినిమా కాన్సెప్ట్ ను మొత్తాన్ని చెప్పేస్తుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఈ సినిమా కూడా చేరిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏం జరిగి ఉంటుందనేది చివరివరకూ ప్రేక్షకుడు గెస్ చేయలేడు.
ఈ కథకు ఒక వైపు నుంచి స్క్రీన్ ప్లే కొమ్ముకాస్తే, మిగతా మూడు వైపుల నుంచి షాజీ కుమార్ ఫొటోగ్రఫీ జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం నిషాద్ – షఫీక్ ఎడిటింగ్ సపోర్ట్ చేశాయి. ఎవరికి వారు మనసు పెట్టి చేసిన వర్క్ మనలను ఆకట్టుకుంటుంది. మొదటి అరగంట దాటిన తరువాత చివరి వరకూ ఈ కథ కదలనీయదు. మోహన్ లాల్ కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
Read also: Rashmika Mandanna: నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు:రష్మిక మందన్న