Sikander : సికందర్ చిత్రం నుంచి మూడో పాట టీజర్ విడుదల బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న “సికందర్” చిత్రం నుంచి మూడో పాట టీజర్ విడుదలైంది. “సికందర్ నాచే” అనే ఈ పాట దృశ్యాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. పవర్ ఫుల్ డాన్స్ నంబర్‌గా తెరకెక్కిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. “సికందర్” చిత్రం నుంచి మూడో పాట టీజర్ విడుదల ఇప్పటికే విడుదలైన “జొహ్రా జబీన్” మరియు “బమ్ బమ్ భోళే” పాటలకు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన “సికందర్ నాచే” టీజర్ దృశ్యాలు మరింత అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఈ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన సల్మాన్ ఖాన్, “సికందర్ నాచే సాంగ్ టుమారో” అంటూ ప్రకటించారు.ఈ పాట ప్రత్యేకత ఏంటంటే, 2014లో విడుదలైన “కిక్” సినిమాలోని బ్లాక్‌బస్టర్ సాంగ్ “జుమ్మే కి రాత్” తర్వాత, సల్మాన్ ఖాన్, ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ మళ్లీ కలిశారు.
ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా టర్కీ నుంచి డాన్సర్లను రప్పించారని చిత్రయూనిట్ వెల్లడించింది. భారీ స్థాయిలో రూపొందించిన సెట్స్, గ్రాండ్ విజువల్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చాయి.ఇంతకు ముందు విడుదలైన “జొహ్రా జబీన్” పాటను బాలీవుడ్ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కంపోజ్ చేసింది. ఈ పాట ద్వారా సల్మాన్, ఫరా ఖాన్ అనేక ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేశారు.ఈ సందర్భంగా ఫరా ఖాన్ మాట్లాడుతూ, “సల్మాన్ ఖాన్, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతో నా అనుబంధం చాలా దీర్ఘకాలం నుంచి ఉంది. ఒకరు నా చిన్నప్పటి మిత్రుడు, మరొకరు అన్నయ్య. ఇద్దరికీ చాలా పాటలు కొరియోగ్రాఫ్ చేశాను. కానీ ‘జొహ్రా జబీన్’ నాకు ఎంతో ప్రత్యేకం” అని పేర్కొన్నారు.ఫరా ఖాన్ ఈ పాట బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందుగానే ఊహించానని చెప్పారు.
“సల్మాన్ ఖాన్‌కు చాలా కాలం తర్వాత కొరియోగ్రఫీ చేయడం చాలా ఫన్‌గా అనిపించింది.అలాగే రష్మిక మందన్నతో పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఆమె ఎంతో సహాయకారిగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు” అని తెలిపారు.ఈ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ దాదాపు సంవత్సరం విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. 2023లో విడుదలైన “టైగర్ 3” తర్వాత ఆయన నుంచి రాబోతున్న హై అంచనాల ప్రాజెక్ట్ ఇది.సుప్రసిద్ధ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్‌తో పాటు రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అభిమానులు ఇప్పటినుంచే పాట కోసం ఎదురుచూస్తున్నారు. మరి “సికందర్ నాచే” పూర్తి వీడియో పాట ఎలా ఉంటుందో చూడాలి!