తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న హాస్య నటి శ్రీలక్ష్మి (Srilakshmi) గురించి ప్రతి సినీప్రియుడు ప్రత్యేకమైన గుర్తింపుతో మాట్లాడుతుంటారు. అద్భుతమైన టైమింగ్, సహజమైన హాస్యభరిత అభినయంతో ప్రేక్షకులను పగలబరచిన నటి ఆమె. ముఖ్యంగా దర్శకుడు జంధ్యాల (Jandhyala) సినిమాల్లో శ్రీలక్ష్మి పాత్రలు లేకుండా ఊహించలేనంత స్థాయిలో నిలిచిపోయాయి. ఆ కాలంలో ఆమె తెరపై కనబడితే నవ్వుల వర్షం కురిసేది. కానీ ఈ హాస్యమంతా, ప్రజలను నవ్వించిన ఆ వెనక ఒక గాఢమైన వ్యక్తిగత కష్టాల కథ ఉందని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
శ్రీలక్ష్మి మాట్లాడుతూ,
శ్రీలక్ష్మి మాట్లాడుతూ, “మా నాన్న అమర్ నాథ్ గారు ఒకప్పుడు పెద్ద హీరో. మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత నిర్మాతగా అడుగుపెట్టడం వలన తీవ్ర ఆర్థిక నష్టాలు వచ్చాయి. దాంతో ఆయన కెరీర్ క్రమంగా దెబ్బతింది. హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగించలేకపోయారు. ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కలిసి చివరికి ఆయనను అనారోగ్యానికి గురి చేశాయి. చివరి రోజులలో మా కుటుంబం చాలా కష్టాల్లో పడింది” అని చెప్పారు. తన కుటుంబ పరిస్థితులు ఎలా తనను సినిమాల్లోకి నెట్టాయో గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. “మేం ఆరుగురు సోదర సోదరీమణులు. నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతుండగా, మా కుటుంబ భవిష్యత్తు అంతా అనిశ్చితంగా కనిపించింది. మొదట ఆయన మేం సినిమాల్లోకి రావడం ఇష్టపడేవారు కాదు. కానీ పరిస్థితులు విషమించడంతో ఆయన కూడా మౌనంగా అంగీకరించారు. నిజానికి ‘శుభోదయం’ (Good morning) సినిమాలో హీరోయిన్‌గా నాకు అవకాశం వచ్చింది. అయితే అదే సమయంలో నాన్న మరణించడంతో ఆ అవకాశం చేజారిపోయింది” అని చెప్పారు.
Actress Srilakshmi
హాస్య నటిగా మలుపు తిరిగిందని
ఆమె మాటల్లోని ఆవేదన ఇంకా పెరిగింది. “నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడి పోయింది. మా అమ్మ కూడా నాతో స్పష్టంగా చెప్పింది—‘నువ్వే ముందుకు వచ్చి కుటుంబాన్ని నిలబెట్టాలి. లేదంటే మనందరం కలిసి ప్రాణాలు తీసుకోవడం తప్ప మార్గం లేదు’ అని. ఆ మాటలు విన్న తర్వాత నేను వ్యక్తిగత ఆశయాలు, కలలు అన్నింటినీ పక్కన పెట్టి నా కెరీర్‌కే పూర్తిగా అంకితం అయ్యాను. నా త్యాగంతో అయినా మా కుటుంబం నిలబడాలని భావించాను” అని తెలిపారు. అదే కష్టకాలం తనను నటి మార్గంలో నడిపించిందని శ్రీలక్ష్మి (Srilakshmi) చెప్పారు. హీరోయిన్‌గా వెలుగులు చూడాల్సిన తన ప్రయాణం, హాస్య నటిగా మలుపు తిరిగిందని, కానీ ప్రేక్షకుల అభిమానమే తనకు ఊరటగా మారిందని చెప్పారు. జంధ్యాల వంటి దర్శకులు తనలోని హాస్యాన్ని వెలికి తీసి, తెరపై చిరస్థాయిగా నిలిపారని ఆమె కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న శ్రీలక్ష్మి పాత్రలు ఈ రోజుకీ గుర్తు చేసుకుంటే నవ్వులు పూయిస్తాయి. అయితే ఆ పాత్రల వెనుక ఒక బాధతో నిండిన కథ ఉందని, కుటుంబ భారం మోసిన ఒక స్త్రీ పోరాటం దాగి ఉందని ఆమె ఇంటర్వ్యూలో ఆవేదనగా తెలియజేశారు. తన తండ్రి అమర్ నాథ్ వారసత్వం, తల్లి ప్రోత్సాహం, కుటుంబ బాధ్యతలే తనకు బలం అయ్యాయని శ్రీలక్ష్మి తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: