మంచు లక్ష్మి (Manchu Lakshmi) చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న “దక్ష: ఏ డెడ్లీ కాన్స్పిరసీ” (Daksha: A Deadly Conspiracy) సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న మంచు వారమ్మాయికి ఇటీవల ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది.మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మి. ఆమె ఒక నటి మాత్రమే కాకుండా, విలన్‌గా, నిర్మాతగా, సింగర్‌గా, యాంకర్‌గా కూడా ప్రతిభను చూపించింది. ఈ కారణంగానే ఆమెను మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అని పిలుస్తారు. సినిమాలకే పరిమితం కాకుండా, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల ఏర్పాటుకు తన వంతు సహాయం చేస్తోంది.
‘దక్ష’లో కీలక పాత్ర
ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది మంచు లక్ష్మి. ‘దక్ష: ఏ డెడ్లీ కాన్స్పిరసీ’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా ప్రధాన పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. రిలీజ్ సమీపిస్తున్న తరుణంలో ప్రమోషన్లలో మరింత బిజీగా మారింది లక్ష్మి.సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, లక్ష్మి ఎదుర్కొన్న ప్రశ్న హఠాత్తుగా హాట్ టాపిక్ అయింది. జర్నలిస్ట్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రస్తావిస్తూ, ముంబైకి వెళ్లాక లక్ష్మి డ్రెస్సింగ్ మారిపోయింది. 50 ఏళ్లకు దగ్గరలో ఉన్న మహిళ, 12 ఏళ్ల కూతురు ఉంది. అలాంటి డ్రెస్‌లు వేస్తారని అనుకుంటారా? అని ప్రశ్నించాడు.
ఘాటుగా సమాధానం ఇచ్చిన లక్ష్మి
ఈ ప్రశ్న విన్న మంచు వారమ్మాయి తీవ్రంగా ఆగ్రహించింది. నేను అమెరికాలో కూడా ఉన్నాను. నాకు నచ్చినట్లు డ్రెస్ చేసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక మగవాడిని ఇలాంటివి అడగడానికి మీకు ధైర్యం ఉందా? మహేష్ బాబును ‘ఇప్పుడిక 50 ఏళ్లు వచ్చాయి, షర్ట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు?’ అని ఎవరైనా అడిగారా? మరి ఒక మహిళను ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.లక్ష్మి ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. నెట్టింట నెటిజన్లు ఆమె ధైర్యం, స్పష్టతను ప్రశంసిస్తున్నారు. జర్నలిస్టుల బాధ్యతపై ఆమె చెప్పిన మాటలు కూడా చర్చనీయాంశంగా మారాయి.మంచు లక్ష్మి చాలా కాలం తర్వాత రానున్న ఈ సినిమా, విడుదలకు ముందే హాట్ టాపిక్ అయింది. సినిమా కంటెంట్‌తో పాటు, ఆమె ఘాటైన సమాధానం కూడా ప్రస్తుతం బజ్ క్రియేట్ చేస్తోంది. అభిమానులు ఇప్పుడు “దక్ష” సినిమాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also :